logo

రోజూ వెళ్లాలె.. చెత్త తేవాలె

ప్రతి ఇంటికి నిత్యం చెత్త ఆటో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించడంతో.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ క్షేత్రస్థాయి సర్వేకు శ్రీకారం చుట్టారు.

Published : 24 Sep 2023 03:03 IST

ఇంటింటి నుంచి సేకరణపై బల్దియా సర్వే
మంత్రి కేటీఆర్‌ ఆదేశంతో కదిలిన అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతి ఇంటికి నిత్యం చెత్త ఆటో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించడంతో.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ క్షేత్రస్థాయి సర్వేకు శ్రీకారం చుట్టారు. కమిషనర్‌ ఆదేశాలతో సహాయ వైద్యాధికారులు, కేంద్ర కార్యాలయంలోని ఆరోగ్య విభాగం ఉన్నతాధికారుల నుంచి అటెండర్ల వరకు.. యంత్రాంగమంతా సర్వేకు నడుం బిగించింది. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్‌ కేంద్రాలవారీగా జరుగుతున్న ఓటరు పరిశీలనతోపాటు.. ఆయా ఇళ్లకు స్వచ్ఛ ఆటోలు రోజూ వస్తున్నాయా.. లేదా.. ఎన్ని రోజులకోసారి వస్తున్నాయి.. ఇతర సమస్యలేమైనా ఉన్నాయా.. అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం తీసుకుంటున్నారు. అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత ఇళ్ల లెక్కగడుతున్నారు. ఇళ్ల లెక్క తేలితే.. భౌగోళికంగా ప్రతి 500 ఇళ్లకు ఓ సరిహద్దు నిర్ధారించి.. వాటికి ఓ స్వచ్ఛ ఆటోను కేటాయించాలని భావిస్తున్నారు.

2 వేలకుపైగా ప్రాంతాల్లో కుప్పలు..

గ్రేటర్‌ పరిధిలో రోజు 7 వేల నుంచి 7,500 టన్నుల వరకు చెత్త సేకరణ జరుగుతోంది. అయినా నగరవ్యాప్తంగా 2 వేల నుంచి 2,500 చెత్త కుప్పలు ఏర్పడుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కి) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సర్వేతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి చెత్త కుప్పలను తగ్గించాలని జీహెచ్‌ఎంసీ వేర్వేరు చర్యలు చేపట్టినా ఫలితం   ఉండట్లేదు.

సగం ఇళ్లకు వెళ్లట్లేదు..

తెలంగాణ ఏర్పాటవగానే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి చెత్త సేకరణలోని మూడు చక్రాల రిక్షాలను తొలగించి.. ట్రాలీ ఆటోలను ప్రవేశపెట్టింది. నగరంలో ప్రస్తుతం 4,500 ఆటోలున్నాయి. సగటున ప్రతి 650 ఇళ్లకు ఓ ఆటో పని చేస్తోంది. కేటాయించిన వాటిలో సగం ఇళ్లకు స్వచ్ఛ ఆటోలు నిత్యం వెళ్లట్లేదు. కొన్ని ఆటోలు రోజుకు వంద ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తుండగా.. మరికొన్ని 200.. ఇంకొన్ని 300 గృహాల నుంచి వ్యర్థాలను సేకరిస్తున్నాయి. నగరంలో 22 లక్షల ఇళ్లు ఉండగా.. పది లక్ష ఇళ్ల నుంచే ఆటోలు ఓ రోజు చెత్త సేకరిస్తున్నాయి. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం.. ఒక్కో ఆటో రోజుకు మూడు నుంచి ఐదు ట్రిప్పులు నడవాలని నిబంధన పెట్టింది. ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలు సగటున ఒకటిన్నర ట్రిప్పులు వేస్తున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి.

నిత్యం 500 ఇళ్లే

ఒక ఆటో రోజుకు 650 ఇళ్లను చుట్టడం సాధ్యం కాదని బల్దియాకు అర్థమైంది. దీంతో ఒక ఆటో రోజుకు 3 ట్రిప్పులు నడవాలనే నిబంధనను కఠినంగా అమలు చేయడం.. దానికి 500 ఇళ్లనే కేటాయించాలన్న తాజా నిర్ణయాన్ని అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సర్వే చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని