logo

ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగాల విలీనం

ఇంజినీరింగ్‌ విద్యకు చిరునామాగా పేరొందిన జేఎన్‌టీయూ అధికారులు ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగ కేంద్రాలను తొలగించి వాటిని ఇతర విభాగాల్లో విలీనం చేస్తున్నారు. ఆయా విభాగాల అధిపతులు, ఆచార్యులకు చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Updated : 24 Sep 2023 03:45 IST

ఏకపక్షంగా జేఎన్‌టీయూ నిర్ణయాలు

ఈనాడు,హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ విద్యకు చిరునామాగా పేరొందిన జేఎన్‌టీయూ అధికారులు ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగ కేంద్రాలను తొలగించి వాటిని ఇతర విభాగాల్లో విలీనం చేస్తున్నారు. ఆయా విభాగాల అధిపతులు, ఆచార్యులకు చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీ ప్రత్యేక కేంద్రాలు ఇకపై ఉండవు.. మీరంతా ఫలానా విభాగంలో విధులు నిర్వహించండి... ఇందులో సంతకాలు చేయండని ఆచార్యులకు వివరించి విలీనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెంటర్‌ ఆఫ్‌ వాటర్‌ రీసోర్సెస్‌, సెంటర్‌ ఆఫ్‌ ఫార్మాస్యుటికల్‌ సైన్సెస్‌లను తొలగించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగ కేంద్రాల్లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. రెండు, మూడేళ్ల నుంచి సరైన సంఖ్యలో విద్యార్థులు చేరడంలేదని సమర్థించుకుంటున్నారు. 

లాభనష్టాల బేరీజు

జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో కొందరు ఉన్నతాధికారులు విశ్వవిద్యాలయం ఘనత, ప్రతిష్ఠను పట్టించుకోకుండా వ్యాపార కోణంలో విభాగాల పనితీరును పరిశీలిస్తున్నారు. ఒక్కో విభాగంలో విద్యార్థుల నుంచి ఏటా ఎంత ఫీజు వసూలు చేస్తున్నాం..? ఆచార్యులకు వేతనాలు ఎంత ఇస్తున్నాం..? నిర్వహణ ఖర్చులు ఎంత వస్తున్నాయని లెక్కలు తీస్తున్నారు. సంప్రదాయ కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదు.. ఖర్చులు పెరుగుతున్నాయంటూ లాభనష్టాలను బేరీజు వేసుకుని ఆయా విభాగాలు, ప్రత్యేక పరిశోధన కేంద్రాలను తొలగిస్తున్నారు. జేఎన్‌టీయూలో పేరొందిన సెంటర్‌ ఆఫ్‌ వాటర్‌ రీసోర్సెస్‌ను కొన్ని రోజుల క్రితం సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో విలీనం చేశారు. ఆ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆచార్యులను సివిల్‌ ఇంజినీరింగ్‌లో పనిచేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. జేఎన్‌టీయూ క్యాంపస్‌లో కొనసాగుతున్న సెంటర్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ను యూనివర్సిటీ నుంచి సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూకు తరలించారు. అక్కడికి వెళ్లాలంటూ అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజినీరింగ్‌ అంటే అన్ని విభాగాలు ఉంటేనే సంపూర్ణంగా ఉంటుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నేళ్ల నుంచి సీఎస్‌సీ కోర్సుకు డిమాండ్‌ ఉందని, సివిల్‌ ఇంజినీరింగ్‌లో తక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారని.. సివిల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలు నిలిపివేయలేం కదా అని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని