logo

రేషన్‌ లబ్ధిదారులకు కేవైసీ తిప్పలు

రేషన్‌ లబ్ధిదారులకు కేవైసీ తిప్పలు తప్పడం లేదు.. వేలిముద్రలు పడక పోవడంతో వారంతా మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సెప్టెంబరు 1న ప్రారంభమైన కేవైసీ ప్రక్రియ నెలాఖరులోగా ముగుస్తుండటంతో.. లబ్ధిదారులంతా రేషన్‌ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు.

Published : 24 Sep 2023 03:03 IST

వేలిముద్రలు పడకపోవడంతో ‘మీసేవా’ చుట్టూ ప్రదక్షిణలు

రేషన్‌ దుకాణంలో కేవైసీ పునరుద్ధరించుకుంటున్న లబ్ధిదారుడు

ఈనాడు, హైదరాబాద్‌: రేషన్‌ లబ్ధిదారులకు కేవైసీ తిప్పలు తప్పడం లేదు.. వేలిముద్రలు పడక పోవడంతో వారంతా మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సెప్టెంబరు 1న ప్రారంభమైన కేవైసీ ప్రక్రియ నెలాఖరులోగా ముగుస్తుండటంతో.. లబ్ధిదారులంతా రేషన్‌ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో వేలిముద్రలు పడక, సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెళ్లిళ్లు చేసుకొని దూరప్రాంతాలకు వెళ్లినవారికి.. వారి ప్రాంతాల్లో కొత్త కార్డులు ఇవ్వకపోవడంతో కేవైసీ పునరుద్ధరణ కోసం నగరానికొస్తున్నారు. కుటుంబాల్లో మృతిచెందినవారి పేర్లను కార్డుల నుంచి తొలగిస్తున్న పౌరసరఫరాలశాఖ.. మ్యుటేషన్ల(కార్డుల్లో పేర్ల చేర్పు)పై అలసత్వం ప్రదర్శించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

సర్వర్‌ సమస్యలు..

ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేస్తున్న రేషన్‌ సరకులు, బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఇటీవలే కేవైసీ పునరుద్ధరణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ప్రతిఒక్కరూ కేవైసీ చేయించుకునేలా పర్యవేక్షించాలన్న ఆదేశాలతో.. అధికారులు లబ్ధిదారులకు సమాచారం పంపారు. కుటుంబ సభ్యులంతా బయోమెట్రిక్‌ ద్వారా వివరాలను పునరుద్ధరించుకోవాలని సూచించడంతో వారంతా రేషన్‌ దుకాణాలకు పోటెత్తుతున్నారు. దీంతో అనేక రేషన్‌ దుకాణాల్లో సర్వర్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్నారులు, వృద్ధుల వేలిముద్రలు పడకపోవడంతో వారి కేవైసీ ప్రక్రియ నిలిచిపోతోంది. దీంతో ఆధార్‌కార్డుల్లో మార్పులు(అప్‌డేట్‌) చేసుకుంటేనే కేవైసీ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పడంతో వారంతా మీసేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఉన్నచోటే పునరుద్ధరించుకోండి

హైదరాబాద్‌ జిల్లాలో 6,36,617, రంగారెడ్డిలో 5,59,788, మేడ్చల్‌లో 5,24,449 కార్డుదారులుండగా... ఇందులో పెళ్లిళ్లు చేసుకొని, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు 10 నుంచి 15 శాతం మేరకు ఉన్నారని పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, నగరానికి రాకుండానే వారంతా తాము నివసించే ప్రాంతాల్లోని రేషన్‌ దుకాణాలకు వెళ్లి కార్డు నంబర్‌ చెప్పి కేవైసీ చేయించుకోవచ్చని తెలిపారు.

కొత్త కార్డుల కోసం నిరీక్షణ

కార్డుల్లో మార్పులు చేస్తున్న క్రమంలో కొత్త పేర్ల నమోదుపైనా దృష్టిపెట్టాలంటూ లబ్ధిదారులు కోరుతున్నారు. కొత్తగా కుటుంబంలో అడుగుపెట్టిన వారికి, వారి పిల్లలకు ఆరోగ్య పథకాలు వర్తించడం లేదని ఆందోళన చెందుతున్నారు. మూడు జిల్లాల్లో 90వేలకు పైగా అభ్యర్థనలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అనుమతిచ్చిన వెంటనే సంబంధిత ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని