logo

Hyderabad: బోర్డు తిప్పేసిన కుబేర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

వ్యవసాయ భూములపై రూ.కోట్లలో రుణాలు ఇస్తామని నమ్మించి, ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో సుమారు రూ.2 కోట్లకుపైగా దండుకొని బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. బాధితులు శనివారం సైఫాబాద్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Updated : 24 Sep 2023 08:26 IST

రూ.2 కోట్లపైగా వసూలు చేశారని బాధితుల ఆవేదన
పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు

సంస్థ కార్యాలయం

నారాయణగూడ, న్యూస్‌టుడే: వ్యవసాయ భూములపై రూ.కోట్లలో రుణాలు ఇస్తామని నమ్మించి, ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో సుమారు రూ.2 కోట్లకుపైగా దండుకొని బోర్డు తిప్పేసింది ఓ సంస్థ. బాధితులు శనివారం సైఫాబాద్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాజశేఖర్‌, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన అమిత్‌కుమార్‌ కొంపల్లిలో నివశిస్తూ బషీర్‌బాగ్‌లోని బాబుఖాన్‌ ఎస్టేట్‌ నాలుగో అంతస్తులోని ఫ్లాట్‌ నెంబరు 407లో ‘కుబేర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ నిర్వహిస్తున్నారు.  వ్యవసాయ భూములపై తక్కువ వడ్డీకి, ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రుణాలు ఇస్తామని ప్రకటించుకున్నాడు. ఓ వెబ్‌సైట్‌ రూపొందించి దేశవ్యాప్తంగా 28 శాఖలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉందని పేర్కొన్నాడు. దాంతో చాలా మంది రుణాల కోసం ఆసక్తి చూపారు. దరఖాస్తుదారులు ముందుగా రూ.5 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, దరఖాస్తు నింపి కావాల్సిన రుణ మొత్తం వివరిస్తూ ఆధార్‌, పాన్‌ కార్డు, వంటగ్యాస్‌ రశీదు జత చేయాలని సూచించాడు. తర్వాత సీఏ రిపోర్టు, ఇతరాత్ర పత్రాలు, ప్రాసెసింగ్‌ ఫీజు అంటూ రూ.25వేల నుంచి రూ.30 వేలు (రుణాన్ని బట్టి) వసూలు చేశాడు. కొందరు అధిక రుణం కోసం రూ.లక్ష నుంచి రూ.4లక్షలకుపైగా చెల్లించారు. బంధన్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ, ఐడీబీఐ బ్యాంక్‌ల ద్వారా రుణాలు వస్తాయని వారిని నమ్మించాడు. కంపెనీ బోర్డు తిప్పేసిందని తెలియక శనివారం ఓ వ్యక్తి డిపాజిట్‌ చెల్లించడానికి రూ.2 లక్షలు తీసుకురావడం గమనార్హం.

అప్రమత్తం చేసినా..: కుబేర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ పనితీరుపై అనుమానం వచ్చి బాబుఖాన్‌ ఎస్టేట్‌ బిల్డింగ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.వేణుమాధవ్‌ ఈనెల 21న సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించ లేదని ఆయన పేర్కొన్నారు.

పత్రాలు ధ్వంసం?

రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు గత కొద్ది రోజులుగా అమిత్‌కుమార్‌ను ప్రశ్నిస్తుండగా, సెప్టెంబరు 26 నాటికి రుణాలకు సంబంధించిన చెక్కులు ఇస్తామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సిబ్బందిని ఇంటికి పంపించి, దరఖాస్తులు, అగ్రిమెంట్‌లు తదితర 700-800 ఫైళ్లకు నిప్పుపెట్టారు. సీసీ కెమెరాలు విరగొట్టి ఆధారాలు లేకుండా చేశాడని బాధితులు వాపోయారు. శనివారం ఉదయం వచ్చిన కొందరు బాధితులు కార్యాలయంలోని ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. మరికొందరు ఏసీలు, కంప్యూటర్లు తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని