logo

రహదారులా.. నీటి గుంతలా..!

ప్రజా ప్రయోజనార్ధం చేపట్టే నిర్మాణాలు మన్నికతో ఉండాలి. ముఖ్యంగా రోడ్లు తప్పనిసరిగా నాణ్యతతో పదికాలాలపాటు ఉపయోగపడాలి. ఇందుకోసం ప్రభుత్వం రూ.కోట్లు కుమ్మరిస్తోంది. కానీ ఏం లాభం.

Updated : 27 Sep 2023 05:07 IST

రూ.75 కోట్ల వ్యయం
మాదిరి వర్షాలకే అధ్వానం
న్యూస్‌టుడే, తాండూరు

తాండూరు -తొర్మామిడి మార్గంలో నిలిచిన వర్షపు నీరు

ప్రజా ప్రయోజనార్ధం చేపట్టే నిర్మాణాలు మన్నికతో ఉండాలి. ముఖ్యంగా రోడ్లు తప్పనిసరిగా నాణ్యతతో పదికాలాలపాటు ఉపయోగపడాలి. ఇందుకోసం ప్రభుత్వం రూ.కోట్లు కుమ్మరిస్తోంది. కానీ ఏం లాభం. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారుల ఇష్టారాజ్యం.. వెరసి వేసిన మూణ్ణాళ్లకే గుంతలు తేలి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. ఇందుకు రూ.24 కోట్లు పోసి తాండూరులో నిర్మించి రోడ్లు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి.

కేవలం కంకరపరిచి, మట్టిపోసి..

తాండూరు నియోజకవర్గంలో మూడు రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రోడ్లు అధ్వానంగా మారాయి. గుంతలమయంగా మారిన రహదారులపై వర్షం నీరు చేరడంతో వాహనాలు వెళ్లాలంటే వీలుకాని పరిస్థితి. తాండూరు నుంచి తొర్మామిడి వరకు 2017-18 లో రూ.24 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించారు. మార్గమధ్యలోని ఇందూరు గ్రామం వద్ద కేవలం కంకర పరిచి మట్టిని పోసి వదిలేశారు. తారు వేయాల్సి ఉన్నా వేయలేదు. తాజా వర్షాలకు మట్టి కొట్టుకు పోయింది. రోడ్డు గుంతలుగా మారడంతో వాన నీరు నిలిచి వాహనం కదలాలంటే తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. వాహనదారులు ఆపసోపాలు పడుతున్నారు.

తాండూరు నుంచి తట్టేపల్లి, తొర్మామిడి, బొపునారం, మల్‌చల్మా, షేకాపూర్‌ జహీరాబాద్‌తో పాటు కర్ణాటక రాష్ట్రం కుంచవరం తదితర గ్రామాలకు ఇది రోడ్డుపై నుంచి నిత్యం వందలకొద్దీ వాహనదారులు ప్రయాణాలు చేస్తారు. ఇదే రోడ్డు మార్గంలోని అత్కూరు గుట్ట పై భాగాన  వేసిన ఒక వరుస తారు రోడ్డు రెండు వైపులా కొసలు కోసుకు కోసుకుపోయాయి. గుట్టపై నుంచి ప్రయాణం చేయాలంటే ప్రమాదకరంగా మారింది. కొన్నిచోట్ల తారు లేచిపోయి గుంతలు పడింది. వేసవిలో రహదారిని బాగు చేయడానికి వాతావరణం అనుకూలంగా ఉన్న అధికారులు పట్టించుకోలేదని విమర్శలున్నాయి.

హైదరాబాద్‌ వైపు వెళ్లేది ఇప్పటికీ అసంపూర్ణం

తాండూరు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే ప్రధాన రోడ్డు కూడా అధ్వానంగా మారింది. 2017లో రూ.51 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు అసంపూర్తిగానే ఉంది. వికారాబాద్‌, హైదరాబాద్‌ వైపు వెళ్లే వేలకొద్ది వాహనదారులు అధ్వాన రోడ్డు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రహదారి గుంతలమయంగా మారింది. ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడిపోతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా అధికారులు తగు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. తమ అవస్థలు చూసైనా అధికారులు స్పందించాలని వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు. వర్షాలు తెరిపివ్వగానే రహదారిని బాగు చేయాలని రహదారులు, భవనాల శాఖ అధికారులకు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు