logo

ప్రోత్సాహకం.. అందక నిరుత్సాహం

పాల ఉత్పత్తి వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. లీటరు పాల ధర బయట రూ.60 నుంచి రూ.80 దాకా పలుకుతోంది. దీంతో చాలా మంది పాడి పశువుల పెంపకాన్ని చేపట్టి పరిశ్రమవైపు దృష్టి సారిస్తున్నారు.

Published : 27 Sep 2023 02:47 IST

రూ.10.75కోట్ల బకాయిలు పేరుకుని పాల ఉత్పత్తిదారుల అగచాట్లు
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌

పాల ఉత్పత్తి వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. లీటరు పాల ధర బయట రూ.60 నుంచి రూ.80 దాకా పలుకుతోంది. దీంతో చాలా మంది పాడి పశువుల పెంపకాన్ని చేపట్టి పరిశ్రమవైపు దృష్టి సారిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు, సహకారం అందితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయంలో ఆశించన పురోగతి లభించక అన్నదాతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

24 శీతలీకరణ కేంద్రాలు, 28,755 మంది ఉత్పత్తిదారులు

ప్రభుత్వం తరచుగా యూనియన్‌ పాల సేకరణ ధరను పెంచుతోంది. ఇది కొంత ఊరటనిచ్చే విషయం.

ఉమ్మడి నల్గొండ - రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య యూనియన్‌ లిమిటెడ్‌ (నార్ముల్‌) ఆధ్వర్యంలో 97రూట్ల పరిధిలో 24పాల శీతలీకరణ కేంద్రాలున్నాయి. 28,755 మంది ఉత్పత్తిదారుల నుంచి మదర్‌ డెయిరీ నిత్యం లక్ష లీటర్ల పాలను సేకరిస్తోంది. గతేడాదితో పోల్చితే ఇప్పటివరకు సుమారు 40శాతం పాలు అధికంగా వస్తున్నాయి. 

కొత్త పథకాలతో ఆకర్షణ

పెరుగుతున్న పాల దిగుబడిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు డెయిరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొత్తకొత్త ఆకర్షణీయ పథకాలతో మదర్‌ డెయిరీ నిర్వాహకులు ఉత్పత్తిదారులను ఆకట్టుకుంటున్నారు. ఆ తరువాత ముందుగా ప్రకటించిన రాయితీలను అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ ప్రభావం మొత్తంగా డెయిరీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో రైతులు తగ్గిపోవడం, ఆశించిన స్థాయిలో పాలు రాకపోవడంతో చికిత్స చేయడం ప్రారంభించారు.

25లీటర్ల నుంచి 49లీటర్ల వరకు ఒక ఉత్పిత్తిదారుడు పాలు పోస్తే రూ.2అదనంగా చెల్లిస్తున్నారు.

50లీటర్ల నుంచి ఆపైన పోసే వారికి రూ.3చొప్పున యూనియన్‌ చెల్లిస్తోంది. ఈలెక్కన 530 మంది రైతులకు ప్రతినెలా రూ.22లక్షలు ప్రోత్సాహకంగా చెల్లిస్తోంది.

2017నుంచి లీటర్‌కు రూ.4 అదనం

ఉత్పత్తిదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చి పాల దిగుబడిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబరు నుంచి లీటరుకు రూ.4చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించింది. ఈమేరకు అడపాదడపా నిధులు విడుదలవుతున్నా సకాలంలో అందడం లేదు. 28నెలలుగా సుమారు రూ.10.75కోట్లు విడుదల కావాల్సి ఉంది.


రూ.50వేలు రావాలి

- ఎన్‌.శంకర్‌, రైతు, నజీరాబాద్‌ తండా

లీటరు పాలపై అందించే నాలుగు రూపాయల ప్రోత్సాహకం ప్రతినెలా వచ్చేలా చూడాలి. దాణా ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటివరకు దాదాపు రూ.50వేలు అందాల్సి ఉంది.


రాయితీపై పశువులు అందించాలి

- శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, సుల్తాన్‌పూర్‌

వ్యవసాయానికి అనుబంధంగా పాడిని చేపట్టా. నిత్యం 6లీటర్ల పాలు గ్రామంలోని సేకరణ కేంద్రంలో పోస్తున్నాం. రూ.30వేల నుంచి రూ.35వేల వరకు ప్రోత్సాహక నిధులు అందాలి.  


త్వరలో వచ్చే అవకాశం

- బి.కృష్ణ, ఎండీ, మదర్‌డెయిరీ

ప్రోత్సాహక నిధులు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. రైతులను ప్రోత్సహించడంలో భాగంగా కేవలం యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు