logo

తల్లికి సందేశం పంపి.. తనువు చాలించాడు

రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని మై హోం భూజా అపార్ట్‌మెంట్స్‌లో 35 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  మాదాపూర్‌ ఏసీపీ శ్రీనివాస్‌, రాయదుర్గం సీఐ మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 27 Sep 2023 02:22 IST

35 అంతస్తుల భవనంపై నుంచి దూకి బాలుడి ఆత్మహత్య

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలోని మై హోం భూజా అపార్ట్‌మెంట్స్‌లో 35 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  మాదాపూర్‌ ఏసీపీ శ్రీనివాస్‌, రాయదుర్గం సీఐ మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ముంబయిలో ఫైౖనాన్స్‌ అనలిస్ట్‌గా పనిచేస్తుంటారు. గతేడాది భార్య, ఇద్దరు కుమారులతో కలిసి నగరానికి వచ్చి మై హోం భూజాలో నివసిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు (14) పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో అతను ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయాడు. వ్యక్తిగత కారణాలు, మానసిక ఒత్తిడితో తాను చనిపోతున్నట్లు తల్లి చరవాణికి సంక్షిప్త సందేశం పంపించాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె వెతకడం ప్రారంభించారు. అపార్ట్‌మెంట్లలో అన్ని గేట్ల చెంత ఉన్న సీసీటీవీలను పరిశీలించారు. భర్తకు సమాచారం అందించడంతో ఆయన రాత్రే విమానంలో ఇంటికి చేరుకున్నారు. అర్ధరాత్రి దాటాక రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాలుడు రాత్రి 7.15 గంటలకు హెచ్‌ బ్లాక్‌ నుంచి జే బ్లాక్‌లోకి వచ్చి లిఫ్ట్‌లో పైకి వెళ్లినట్లు కనిపించింది. పోలీసులు పైకి వెళ్లి చూసినా ఫలితం లేదు. మంగళవారం ఉదయం 7 గంటలకు సెక్యూరిటీ సిబ్బందితో కలిసి పోలీసులు వెతుకుతుండగా జే బ్లాక్‌ మెట్ల డక్ట్‌ వద్ద రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉండడం గమనించారు. లిఫ్ట్‌లో పైకి చేరుకుని కిందికి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలుడు చదువులో చురుకైనవాడని పోలీసుల విచారణలో తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని