logo

Hyderabad-ORR: వరుస తప్పింది.. ఆయువు తీరింది

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మేడ్చల్‌ జిల్లా మేడిపల్లిలోని పీ అండ్‌ టీ కాలనీకి చెందిన సింగిరెడ్డి జీవన్‌రెడ్డి(23) మృతిచెందాడు. కారు నుజ్జునుజ్జవడంతో ఘటనా స్థలం భీతావహంగా మారింది.

Updated : 27 Sep 2023 10:41 IST

ఔటర్‌పై కంటైనర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యానికి యువకుడి బలి

ప్రమాదం (ఊహాచిత్రం)

అబ్దుల్లాపూర్‌మెట్‌, బోడుప్పల్‌, న్యూస్‌టుడే: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మేడ్చల్‌ జిల్లా మేడిపల్లిలోని పీ అండ్‌ టీ కాలనీకి చెందిన సింగిరెడ్డి జీవన్‌రెడ్డి(23) మృతిచెందాడు. కారు నుజ్జునుజ్జవడంతో ఘటనా స్థలం భీతావహంగా మారింది. కంటైనర్‌ లారీ డ్రైవర్‌ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం ఘటనకు కారణమైంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల వివరాల ప్రకారం.. జీవన్‌రెడ్డి సోమవారం సాయంత్రం తన కారులో ఔటర్‌ రింగురోడ్డు మీదుగా చాంద్రాయణగుట్ట ప్రాంతానికి బయలుదేరాడు. ఆయన నాలుగో వరుసలో ప్రయాణిస్తున్నాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌ ప్రాంతంలోని ఎగ్జిట్‌ 10 సమీపానికి చేరుకున్న వేళ.. ముందు వెళ్తున్న కంటైనర్‌ లారీ డ్రైవర్‌ ఎలాంటి సిగ్నల్‌ ఇవ్వకుండా వాహన వేగం ఒక్కసారిగా తగ్గించి మూడో వరుస నుంచి నాలుగో వరుసలోకి వచ్చాడు. వెనుక నుంచి జీవన్‌రెడ్డి కారు లారీని బలంగా ఢీకొట్టి చొచ్చుకొని వెళ్లింది. అందులో ఇరుక్కుని అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్‌ దినేష్‌కుమార్‌ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న జీవన్‌రెడ్డి చదువులు పూర్తి కాగానే విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడని తండ్రి నరేందర్‌రెడ్డి తెలిపారు.

సింగిరెడ్డి జీవన్‌రెడ్డి


నిబంధనలు పాటించకే రక్తచారికలు

ఇలా వెళ్తే ఔటర్‌పై సాఫీ ప్రయాణమే
నిపుణుల సూచనలివి..

ఔటర్‌ రింగురోడ్డుపై అతివేగంగా వెళ్తూ తరచూ ప్రమాదాలు జరిగి వాహనదారులు మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల బారినపడకుండా రహదారి భద్రతా నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. కనీస నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

  • ఔటర్‌ రింగురోడ్డుపై ఒక్కోవైపు నాలుగు వరుసల చొప్పున రహదారులున్నాయి. నిబంధనల ప్రకారం 1-2 లేన్లలో కార్లు, 3,4 వరుసల్లో లారీలు, ఇతర భారీ వాహనాలు మాత్రమే ప్రయాణించాలి. ఈ నిబంధన అతిక్రమించిన సందర్భాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.
  • 1, 2 లేన్లలో ప్రయాణించే వాహనాలు కనిష్ఠంగా 100 నుంచి గరిష్ఠంగా 120 కిలోమీటర్లు, 3, 4 వరుసల్లో కనిష్ఠంగా 80 నుంచి గరిష్ఠంగా 100 కి.మీ. వేగంతో ప్రయాణించాలి.
  • లేన్లపై వాహనాలు అడ్డదిడ్డంగా(జిగ్‌జాగ్‌) ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఒకవేళ వాహనాలు లేన్లు మారాలనుకుంటే అకస్మాత్తుగా తీసుకోకుండా.. కచ్చితంగా ఇరువైపులా, వెనుక గమనించాలి.
  • వెనుక నుంచి వచ్చే వాహనదారులు అప్రమత్తమయ్యేలా ఇండికేటర్లు, ఇతర సంజ్ఞలు వేయాలి. ఇవేవీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పక్కలేన్లలోకి దూసుకెళ్లకూడదు. ఔటర్‌పై జరిగే 50 శాతం ప్రమాదాలకు అడ్డదిడ్డంగా లేన్లు మారడమే కారణం.
  • సాధారణంగా ఔటర్‌ చూసేందుకు ఖాళీగా వేగంగా దూసుకెళ్లేందుకు అనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా వాహనాన్ని అదుపుచేసే అవకాశాలు 90 శాతం తక్కువగా ఉంటాయి.
  • ఈ పరిస్థితుల్లో ముందు వెళ్తున్న వాహనం వేగం తగ్గితే అదుపు చేయలేక ఒక్కసారిగా ఢీకొడతాయి. వేగం పెరిగే కొద్దీ ప్రమాదశాతం పెరుగుతున్నట్లు వాహనదారులు గుర్తించాలి.
  • ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం నిలపాలనుకుంటే పూర్తిగా ఎడమవైపున సర్వీస్‌ లేన్‌పై ఆపాలి. ఇందుకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పార్కింగ్‌ లైట్లు ఆన్‌లో ఉంచాలి. రాత్రివేళ ఎక్కువ సమయం వాహనాన్ని నిలపకూడదు.
  • ఓఆర్‌ఆర్‌ ప్రవేశం, నిష్క్రమణ మార్గాల్లో అపసవ్య దిశ(రాంగ్‌రూట్‌)లో ప్రయాణించకూడదు.

ప్రమాదాలకు  ఇవీ కారణాలు

  • 158 కిలోమీటర్ల ఔటర్‌పై రోజూ 1.5 లక్షకుపైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎక్కువ మంది వాహనదారులకు ఏయే లేన్లలో ప్రయాణించాలనే విషయంపైనే అవగాహన ఉండదు. సగటున 65 శాతం వాహనాలు లేన్‌ డ్రైవింగ్‌ను(వరుస క్రమం) పాటించడంలేదని ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో తేలింది.
  • ఓఆర్‌ఆర్‌పై రాత్రి దాటాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహన డ్రైవర్లు అవగాహన లోపంతో పక్కన నిలిపేస్తుంటారు. అతివేగంతో ముందు ప్రాంతాన్ని అంచనా వేయలేని కొందరు వీటిని ఢీకొట్టి.. మృత్యువాతపడుతున్నారు.
  • కొన్నిసార్లు వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపుచేయలేక.. నెమ్మదిగా వెళ్లే ముందున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. ఇంకొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి డివైడర్లను ఢీకొట్టుకుంటున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని