logo

చిన్నారుల భవితకు నిమ్స్‌ ఊపిరి

చిన్నారుల భవితకు నిమ్స్‌ ఊపిరి పోస్తోందని.. వారి గుండె సమస్యలు నయం చేసేందుకు ఆసుపత్రి వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ అన్నారు.

Updated : 27 Sep 2023 05:14 IST

చిన్నారులకు చాక్లెట్లు అందిస్తున్న గారెత్‌ విన్‌ ఓవెన్‌, పక్కన డా.రమణ, అమరేశ్వరరావు, వైద్యులు

ఈనాడు, హైదరాబాద్‌: చిన్నారుల భవితకు నిమ్స్‌ ఊపిరి పోస్తోందని.. వారి గుండె సమస్యలు నయం చేసేందుకు ఆసుపత్రి వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ అన్నారు. బ్రిటన్‌ వైద్య నిపుణులు ధన్నపనేని రమణ సహకారంతో ఆస్పత్రిలో ‘చార్లీస్‌ హార్ట్‌ హీరోస్‌’ పేరుతో ప్రత్యేక శస్త్ర చికిత్సల శిబిరం కొనసాగుతోంది. కార్డియోథొరాసిక్‌ విభాగాధిపతి అమరేశ్వరరావు, వైద్య బృందంతో కలిసి రెండు రోజుల వ్యవధిలో నలుగురు చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక్కడ జరుగుతున్న వైద్యంపై ఆరా తీసేందుకు మంగళవారం గారెత్‌ నిమ్స్‌ని సందర్శించారు. పీడియాట్రిక్‌ వార్డులోకి వెళ్లి చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సొంత గడ్డకు సాయం చేయాలనే తపనతో రమణ తన వైద్య బృందాన్ని వెంట తెచ్చుకొని ఇక్కడ సేవలందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సాహిస్తూ ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్సలు అందించే ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయమన్నారు. అనంతరం రమణ మాట్లాడుతూ..శస్త్ర చికిత్సలు చేయడంతోపాటు సాంకేతికత సాయంతో చేసే వైద్య విధానాలపై ఇక్కడ వైద్యులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సల తీరును తెలుసుకునేందుకు ఈనెల 30న మంత్రి హరీశ్‌రావు వస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు చెప్పారు.

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ సోమవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పాపకి జన్మనిచ్చారు. పాపకి గుండె సమస్య ఉన్నట్లు గుర్తించి వెంటిలేటర్‌పై ఉంచారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నిమ్స్‌కు తీసుకొచ్చారు. పరీక్షలు చేసి గుండెకు రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. బ్రిటన్‌ వైద్యుల సాయంతో మొత్తం ఎనిమిది మంది వైద్య బృందం 5 గంటలపాటు శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు