logo

చారిత్రక నగరం.. ఘనత చాటుదాం

సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం భాగ్యనగరం. 440 ఏళ్లకు పైగా చరిత్ర ఈ నగరం సొంతం. ఏ ప్రాంతానికి వెళ్లినా చారిత్రక ఆనవాళ్లు.  ప్యాలెస్‌లు, పరిపాలనా కార్యాలయాలు, కోటలు.. నగరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి.

Published : 27 Sep 2023 02:47 IST

సౌకర్యాలు.. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే మరింత అభివృద్ధి
ఈనాడు, హైదరాబాద్‌

సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం భాగ్యనగరం. 440 ఏళ్లకు పైగా చరిత్ర ఈ నగరం సొంతం. ఏ ప్రాంతానికి వెళ్లినా చారిత్రక ఆనవాళ్లు.  ప్యాలెస్‌లు, పరిపాలనా కార్యాలయాలు, కోటలు.. నగరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. చారిత్రక ఆనవాళ్లతో పాటు.. అభివృద్ధికి చిరునామాగా నగరం మారింది. జంటనగరాలకు మూడో నగరంగా సైబరాబాద్‌ వెలసింది. ఆధునిక ప్రపంచాన్ని చూడాలనుకుంటే సైబరాబాద్‌ పరిసరాలను చూడాల్సిందే. వీటికి తోడు.. నగరానికి తూర్పున ఉన్న రామోజీ ఫిల్మ్‌సిటీ పర్యాటక ప్రపంచానికి చిరునామాగా నిలుస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో ప్రపంచంలో ఏ మూలనుంచైనా 24 గంటల్లో నగరానికి చేరుకునే వెసులుబాటు సమకూరింది.

మారాల్సినవెన్నో..

దక్కను పీఠభూమికి కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్‌ సంస్కృతి, చరిత్ర, ఆధునికతల సంపూర్ణ సమ్మేళనాన్ని అందిపుచ్చుకోవాలి. చార్మినార్‌, గోల్కొండ, రాచకొండ చరిత్రను చాటడమే కాదు.. పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి. నగరం మధ్యనుంచి ప్రవహించే మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావాలి. మురుగు నీరు కాదు.. అనంతగిరి కొండల్లోని ఔషధ మొక్కల గుణాలను మోసుకువచ్చే నదీప్రవాహంలా మలచుకోవాలి. పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్‌లో రాచరికపు ఆనవాళ్లను కాపాడుకోవాలి. ఫలక్‌నుమా ప్యాలెస్‌ పర్యాటక ప్రాంతంగా మారాలి.రాచకొండ పరిసరాల్లోని సరస్సులు, ఆలయాలు, ఆహ్లాదకర వాతావరణం అందరికీ పరిచయం కావాలి. హుస్సేన్‌ సాగర తీరం ఇప్పుడు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంది. దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన, ఫౌంటెయిన్ల ఏర్పాటుతో రూపురేఖలే మారిపోయాయి.ఇదేమాదిరి మీరాలం చెరువు అభివృద్ధి చేయాల్సి ఉంది.

పరిశుభ్రతతోనే పర్యాటకం..

ఏడాదంతా ఆహ్లాదకరమైన వాతావరణం నగరం సొంతమైనా.. అపరిశుభ్ర వాతావరణం ఆందోళన కలిగిస్తోంది. యునెస్కో గుర్తింపునకు అన్ని అర్హతలున్నా.. చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర  పరిస్థితులు ప్రపంచ గుర్తింపునకు ఆమడదూరంలో నిలబెడుతున్నాయి. దశాబ్దాల క్రితం తలచిన పాదచారుల ప్రాజెక్టు తూతూమంత్రంగానే పూర్తయ్యింది. పర్యాటకులు సేదదీరడానికే కాదు.. కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా అక్కడ అవకాశం లేదు. ఇదే పరిస్థితి గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ, పాయిగా టూంబ్స్‌, సికింద్రాబాద్‌లోని సైదనుమా టూంబ్స్‌ వద్ద నెలకొంది. ఆయా పరిస్థితుల్లో మార్పు రావాలి.

ఆహార రాజధానే కానీ..

నవాబుల కాలం నుంచి  నగరం ఆహార రాజధాని. భిన్న మతాలు,  సంప్రదాయాలు, వివిధ రాష్ట్రాల ప్రజల నిలయంగా మినీ భారత్‌ను తలపిస్తోంది. ఇలా అన్ని రాష్ట్రాల వంటకాలు పర్యాటక ప్రాంతాల్లో ఆస్వాదించడానికి అనువైన వాతావరణం లేదు. వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శించే ప్రాంతా ల్లో హైదరాబాద్‌ రుచులను ఆస్వాదించేలా ఏర్పాట్లు జరగాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు