logo

కారు బీభత్సం.. కార్మికురాలి దుర్మరణం

మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్‌పై పని చేస్తున్న కార్మికులను ఢీకొనడంతో ఓ కార్మికురాలు దుర్మరణం చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 27 Sep 2023 02:47 IST

విభాగినిపైకి  దూసుకొచ్చిన వాహనం

ప్రమాదానికి కారణమైన కారు

రాయదుర్గం: మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్‌పై పని చేస్తున్న కార్మికులను ఢీకొనడంతో ఓ కార్మికురాలు దుర్మరణం చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్‌పేట్‌ జిల్లా మద్దూరు మండలం నిరిజింత గ్రామానికి చెందిన కొత్తకొండ జయమ్మ(40) మణికొండ పోచమ్మ గుడి సమీపంలోని గుడిసెల్లో ఉంటోంది. నేచర్‌ కేర్‌ సర్వీసెస్‌ సంస్థ తరఫున ఆమెతోపాటు పద్మ(35), మరో మహిళ ల్యాంకోహిల్స్‌ హ్యాంగింగ్‌ గార్డెన్‌ విల్లాస్‌లో తోట పని చేస్తుంటారు. ముగ్గురూ మంగళవారం ఉదయం 11 గంటలకు విల్లాస్‌ ముందున్న  విభాగినిలో గడ్డి, చెత్తను తొలగిస్తున్నారు. ఆ సమయంలో ఖాజాగూడలో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దీప్తి(35) కారులో మణికొండ మర్రిచెట్టు వైపు నుంచి ఖాజాగూడ వైపు వెళ్తూ.. వేగంగా దూసుకొచ్చి డివైడర్‌పైకి ఎక్కించారు. అక్కడ పనిచేస్తున్న ముగ్గురినీ ఢీకొట్టారు. ఈ ఘటనలో జయమ్మ కొన్ని అడుగుల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పద్మకు తీవ్రగాయాలయ్యాయి. మరో మహిళ స్వల్పగాయాలతో బయటపడింది. పద్మను ఆసుపత్రికి తరలించారు.  రాయదుర్గం పోలీసులు.. ప్రమాదానికి కారణమైన దీప్తిని అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. జయమ్మ భర్త గతంలోనే చనిపోయాడని, ఆమెకు పిల్లలు లేరని పోలీసులు తెలిపారు.

అతివేగమే కారణం..: ప్రమాదానికి కారణమైన కారును నడిపిన దీప్తి యోగా తరగతులకు వెళ్లొస్తున్నారు. ప్రమాదం జరిగిన రోడ్డు కాస్త ఎత్తుగా ఉంటుంది. ఎత్తయిన ప్రాంతంలో వాహనాల వేగం తక్కువగా ఉంటుంది. ఆమె అతివేగంగా నడిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అదుపు తప్పి ఒక అడుగు ఎత్తున్న విభాగానిపైకి ఎక్కి దాదాపు 20 మీటర్ల దూరం దూసుకెళ్లి కార్మికులను ఢీకొట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు