logo

గంట వర్షం.. మూడు గంటల నరకం

నగరంలో గంటపాటు కురిసిన భారీ వర్షం వాహనదారులకు నరకం చూపించింది. బుధవారం సాయంత్రం దాదాపు ఏకధాటి వర్షంతో రహదారులు నీట మునిగాయి.

Updated : 28 Sep 2023 07:38 IST

ఈనాడు-హైదరాబాద్‌, రాయదుర్గం, న్యూస్‌టుడే: నగరంలో గంటపాటు కురిసిన భారీ వర్షం వాహనదారులకు నరకం చూపించింది. బుధవారం సాయంత్రం దాదాపు ఏకధాటి వర్షంతో రహదారులు నీట మునిగాయి. ప్రధాన జంక్షన్లు, కూడళ్లు వాహనాలతో కిక్కిరిసి పోయాయి. బంజారాహిల్స్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మెహదీపట్నం, టోలీచౌకి, సోమాజిగూడ, మాదాపూర్‌, షేక్‌పేట, ఖాజాగూడ చౌరస్తా, చాదర్‌ఘాట్‌, అమీర్‌పేట ప్రాంతాల్లో ఎటుచూసినా వాహనాలే కనిపించాయి. మాదాపూర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉంది. మాదాపూర్‌ శిల్పారామం నుంచి సోమాజిగూడ మధ్య దాదాపు 12 కిలోమీటర్ల ప్రయాణానికి 2 గంటల సమయం పట్టింది. అత్తాపూర్‌లో పిల్లర్‌ 191 దగ్గర భారీగా వరద చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. మాదాపూర్‌ నుంచి సైబర్‌ టవర్స్‌, బాటా షోరూం, గచ్చిబౌలి డాగ్స్‌ పార్కు చౌరస్తాలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

ఐటీ కారిడార్‌లో అస్తవ్యస్తం

బయో డైవర్సిటీ కూడలి, ఖాజాగూడ చౌరస్తా, గచ్చిబౌలి పిస్తా హౌస్‌ల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐటీ కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడం.. ఒక్కసారిగా లక్షలాది వాహనాలు రహదారి మీదకు చేరడంతో కిలోమీటరు ప్రయాణానికి అరగంట సమయం వరకు పట్టింది. షేక్‌పేట పైవంతెన మీదుగా మెహదీపట్నంకు వెళ్లే మార్గంలోని బృందావన్‌ కాలనీ దగ్గర బుల్కాపూర్‌ నాలా పొంగి ప్రధాన రహదారి మీదకు వరద చేరింది. మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలు షేక్‌పేట పైవంతెన మీద ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బయో డైవర్సిటీ పార్కు పైవంతెన దగ్గర భారీగా నీరు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని