logo

Hyderabad: అదంతా గతం సార్‌.. ఇప్పుడు మారిపోయా: డ్రగ్స్‌ నిందితుల విభిన్న సమాధానాలు

మాదక ద్రవ్యాల కేసులో లింకులు ఛేదించేందుకు టీఎస్‌న్యాబ్‌ పోలీసులు దూకుడు పెంచారు. మూలాలను గుర్తించి రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలను రవాణా పూర్తిస్థాయిలో కట్టడి చేయాలనుకుంటున్నారు.

Updated : 03 Oct 2023 08:37 IST

నగర పోలీసులు అరెస్ట్‌ చేసిన నైజీరియన్‌  

ఈనాడు, హైదరాబాద్‌: మాదక ద్రవ్యాల కేసులో లింకులు ఛేదించేందుకు టీఎస్‌న్యాబ్‌ పోలీసులు దూకుడు పెంచారు. మూలాలను గుర్తించి రాష్ట్రంలోకి మాదకద్రవ్యాలను రవాణా పూర్తిస్థాయిలో కట్టడి చేయాలనుకుంటున్నారు. ఇటీవల మాదాపూర్‌ రేవ్‌పార్టీలో తెలుగు సినీ నిర్మాతలు, నటీనటుల బండారం బయటపడటం సంచలనంగా మారింది. ఇక్కడ లభించిన ఆధారాలతో బెంగళూరులోని డ్రగ్స్‌ దందాలో కీలక సూత్రధారులు నైజీరియన్లను అరెస్టుచేశారు. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితులను పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మరికొందరిని మరోసారి విచారించేందుకు నోటీసులు జారీచేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకూ విచారించిన నిందితుల్లో అధికశాతం మంది విభిన్న సమాధానాలతో పోలీసులను కంగు తినిపించే ప్రయత్నం చేశారు. టీఎస్‌ న్యాబ్‌ పదేళ్లనాటి నిందితుల కాల్‌డేటా, ఛాటింగ్స్‌ బయటి తీసి ప్రశ్నించటంతో తాము అమాయకులమని, అప్పట్లో తెలియక మత్తుపదార్థాలు తీసుకున్నామంటూ ప్రాధేయపడినట్టు సమాచారం. తొలుత ఏవో సాకులు చెబుతూ తమకు డ్రగ్స్‌ అంటే తెలియవంటూ చెప్పబోయి వారి ఎదుట సాక్ష్యాలు ఉంచటంతో వాస్తవంలోకి వస్తున్నారు.

ఓర్నీ వేషాలో అనాల్సిందే..

పదేళ్లుగా కొకైన్‌, హెరాయిన్‌ వంటి ఖరీదైన డ్రగ్స్‌ తీసుకునే సినీ నటుడు అకస్మాత్తుగా మాట మార్చాడు. తాను అమాయకుడినంటూ బిక్కమొహం పెట్టాడు. పోలీసు విచారణ సమయంలో ఒళ్లంతా చెమట్లతో తడిసి ముద్దయిన అతడు బయట మీడియా ఎదుట మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు.

  • మాదాపూర్‌ రేవ్‌పార్టీలో ఐదు రకాల మాదకద్రవ్యాలు లభించాయి. కొకైన్‌, ఎండీఎంఏ డ్రగ్స్‌ వాడినట్టు ఓ సినీ నిర్మాత రక్త నమూనాల ద్వారా బట్టబయలైంది. కళ్లెదుట ఇన్ని ఆధారాలున్నా తాను అమాయకుడినంటూ పోలీసు కస్టడీలో నానాయాగీ చేశాడు. హుద్రోగ సమస్యలున్నాయని వెంటనే చికిత్స చేయకుంటే ప్రమాదమంటూ ఏమార్చే యత్నం చేయబోయాడు.
  • సినీరంగానికి చెందిన మరొకరు బుద్ధిగా వ్యాపార కార్యకలాపాలు చేసుకునే తనకు డ్రగ్స్‌ కేసు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించాడు. ఏ ఆధారాలతో నన్ను నిందితుడు అంటారంటూ నిలదీసినంత పనిచేసినట్టు తెలుస్తోంది. నాలుగైదేళ్ల క్రితం ప్రత్యేక పార్టీలు ఏర్పాటు చేసిన ఫొటోలు ముందుంచగానే అదంతా గతం సార్‌, ఇప్పుడు మారిపోయానంటూ కాళ్లబేరానికి వచ్చాడు. పోలీసు విచారణకు సహకరిస్తానంటూ వెళ్లిపోయాడు.

బాబోయ్‌.. నైజీరియన్లు

మాదకద్రవ్యాల కేసుల్లో విదేశీయులను విచారించటం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. నిత్యం మత్తులో ఊగిపోయే నైజీరియన్లు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారనేది అంతుబట్టని విషయం. గంజాయి తీసుకోవటం తమ దేశంలో సాధారణమైన విషయమంటూ ఎదురుతిరుగుతారు. ఆంగ్లం మాట్లాడటం వచ్చినా రానట్టు నటిస్తారు. అనువాదకులను పిలిపించి వారి నుంచి వాంగ్మూలం సేకరిస్తున్నారు. రోజూ బిర్యానీ కావాలంటూ డిమాండ్‌ చేస్తారు. కొన్నిసార్లు కేకలు, అరుపులతో హోరెత్తిస్తారు. అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలంటూ కిందపడిపోతుంటారు. వీటన్నిటినీ తట్టుకొని వీరి నుంచి ఆధారాలు రాబట్టడం అంత తేలిక కాదంటారు నగర పోలీసులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని