logo

Hyderabad: నాయకులు అటు.. అనుచరులు ఇటు: పార్టీ మారిన అభ్యర్థులకు కొత్త సవాలు

రాజకీయాల్లో నేతలు ఎన్ని కండువాలు మార్చినా.. అసలు సిసలైన అభిమానులు, కార్యకర్తలు మాత్రం ఒకే జెండాకు జై కొడుతుంటారు. ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు.. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తినపుడు మాత్రమే మరో పార్టీ వైపు మొగ్గుచూపుతుంటారు.

Updated : 21 Nov 2023 07:44 IST

ఈనాడు, హైదరాబాద్‌, బోరబండ న్యూస్‌టుడే: రాజకీయాల్లో నేతలు ఎన్ని కండువాలు మార్చినా.. అసలు సిసలైన అభిమానులు, కార్యకర్తలు మాత్రం ఒకే జెండాకు జై కొడుతుంటారు. ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు.. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తినపుడు మాత్రమే మరో పార్టీ వైపు మొగ్గుచూపుతుంటారు. తమ నాయకుల వెంట నడుస్తుంటారు. తమ స్వలాభం కోసం సదరు నాయకులు పదేపదే పార్టీలు మారుతుంటే మాత్రం వీళ్లంతా మౌనంగా ఉండిపోతుంటారు. ప్రస్తుతం నగరంలోని పలు శాసనసభ నియోజకవర్గాల్లో ఇటువంటి వాతావరణం కనిపిస్తోంది. గెలుపోటములను ప్రభావితం చేసే వీరి ఓట్లు ఎటువైపు పడతాయనేది అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

ప్రతి‘సారీ’ అలా కుదరదన్నా..

జూబ్లీహిల్స్‌ పరిధిలో నామినేషన్ల పర్వం తరువాత ప్రధాన పార్టీ నాయకుడు ప్రత్యర్థి పార్టీలోకి చేరారు. ఆయనతోపాటు సుమారు 200 మంది కీలక అనుచరులు కండువాలు కప్పుకొన్నారు. రోజుల వ్యవధిలోనే సదరు నాయకుడు మరో పార్టీకి జై కొట్టడంతో అనుచరులు ఆలోచనలో పడ్డారు. కొందరు మౌనం వహిస్తే.. మరికొందరు ‘సారీ’ అన్నా అంటూ దూరం జరిగారు. అదే నియోజకవర్గ పరిధిలో ద్వితీయశ్రేణి నాయకులు తమ పార్టీ నాయకుడి వ్యవహారశైలి నచ్చక పక్క పార్టీకి మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. వారంతా ఎవరు నచ్చక పార్టీ మారారో.. ఆ నేత కూడా అదే పార్టీలోకి రావటంతో ఏం చేయాలో పాలుపోకుండా ఉందంటూ రెహ్మత్‌నగర్‌కు చెందిన చోటానాయకుడు ఆవేదన వెలిబుచ్చారు. ఖైరతాబాద్‌ పరిధిలో తాము చేరిన పార్టీ నాయకుడి వ్యవహారశైలి నచ్చక కొన్నాళ్లకు పాత పార్టీలో చేరారు. ఎన్నికల వేళ పాత పార్టీ అధిష్టానం తమ నాయకుడికి టిక్కెట్‌ ఇవ్వనందున ఆగ్రహించిన సదరు నేత హఠాత్తుగా పార్టీ మారి కండువా మార్చుకున్నాడు. ఎల్బీనగర్‌ పరిధిలో వింత పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో  ప్రధాన పార్టీ తరపున పోటీ చేసిన నాయకుడి నోటి దురుసు నచ్చక కొందరు సీనియర్‌ నేతలు మరో పార్టీలోకి చేరారు. ప్రస్తుతం సదరు నాయకుడు కూడా వీరున్న పార్టీ కండువా కప్పుకోవటంతో ప్రచారానికి దూరంగా జరిగారు. సీనియర్లు ఎంత నచ్చజెప్పినా లాభం లేకపోయింది. జూబ్లీహిల్స్‌ సీటు తనకే కేటాయిస్తుందంటూ ప్రధాన పార్టీపై నమ్మకం పెట్టుకున్న ఒక నాయకురాలికి చుక్కెదురైంది. నాయకులు మారినంత తేలికగా కేడర్‌ మారరని గుర్తించిన నేతలు.. కార్యకర్తలను ప్రసన్నం చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని