logo
Published : 29 Nov 2021 06:39 IST

సర్వజన దోపిడీ !

 ఎమ్మార్పీపై రెట్టింపు వసూలు

 ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకం

రోగులు, సహాయకుల ఆందోళన

 

సర్వజన ఆసుపత్రిలోని దుకాణాల సముదాయం

నాగరాజుపేట(కడప), న్యూస్‌టుడే : కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఆస్పత్రికి ఎక్కువ శాతం నిరుపేదలు వస్తున్నా.. అన్నివిధాలుగా వారి నుంచి అక్రమ పద్ధతిలో లబ్ధిపొందే యత్నాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆస్పత్రిలో వైద్య సేవలు బాగుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా ప్రసవాలు, శస్త్రచికిత్సలు, సాధారణ జబ్బులు, జ్వరాలతో బాధపడుతున్నవారు ఎక్కువగా వస్తున్నారు. కడప నగరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో రవాణా సౌకర్యం అంతగాలేని చోట ఆసుపత్రి ఏర్పాటవటం అక్రమార్కులకు కలసి వస్తోంది. ఇక్కడ రోగులు, వారి సహాయకులకు అవసరమైనవి అందుబాటులో ఉండటంలేదు. దీంతో సర్వజన ఆసుపత్రి ఐపీ విభాగం ఎదుట దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేశారు. n రోగులకు అవసరమైన అన్నిరకాల వస్తువులు సాధారణ ధరలకు విక్రయించాలని, అధిక ధరలకు అమ్మకూడదనే నిబంధనతో గదులు అప్పగించారు. దుకాణదారులు మాత్రం నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. n దుకాణాల్లో వస్తువులను ఎమ్మార్పీపై రెండింతలు వసూలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఇష్టముంటే తీసుకో.. లేదంటే నగరానికి వెళ్లి తెచ్చుకోవాలంటూ దబాయిస్తున్నారని రోగుల సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. n ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చిన వారికి నీళ్ల సీసాలు, పేస్టు, బ్రష్‌, సబ్బులు, బక్కెట్లు, మగ్గులు, పచ్చి టెంకాయలు, డెటాల్‌ లిక్విడ్‌, శీతల పానీయాలు, బిస్కెట్లు, బ్రెడ్డు తదితరాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ప్రశ్నిస్తే ఆగ్రహిస్తున్నారు : ఆరోగ్యం బాగుచేయించుకోవడానికి అప్పులు చేసి ఆసుపత్రికి వస్తే ఇక్కడి దుకాణదారులు లాక్కుంటున్నారు. అడిగితే జులుం చూపుతున్నారు. ఆసుపత్రిలో పని చేసే సిబ్బందికి మాత్రం ఎమ్మార్పీ ధరలకు ఇస్తున్నారు. మేము అడిగితే రెట్టింపు ధర చెబుతున్నారు. ప్రశ్నిస్తే నువ్వు ఇచ్చే పది రూపాయలకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక్కడ నుంచి వెళ్లాలంటూ దబాయిస్తున్నారు. - నవనీతమ్మ, పులివెందుల

దుకాణాల సంఖ్య పెంచాలి : ఇక్కడ మరిన్ని దుకాణాలు ఏర్పాటు చేస్తే రోగులకు సౌకర్యంగా ఉంటుంది. అధికారులు ఆలోచించి పేదలు ఇబ్బంది పడకుండా చూడాలి. దుకాణదారులకు అధికారులు సహకరిస్తున్నారు తప్పితే రోగుల ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదు. నగరానికి వెళ్లలేక వారు చెప్పిన ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది.- సరస్వతి, రాయచోటి

ఇక్కడ ఇంతే! : మా సొంతూరు మైదుకూరు. మనవరాలు ప్రసవం కోసం వచ్చాం. సబ్బు, కొబ్బరి నూనె కావాలంటే దుకాణానికి వచ్ఛా ఇక్కడ ఒక్కో దానిపై రెండింతలు తీసుకున్నారు. అడిగితే ఇక్కడ ధరలు ఇంతే. వేల రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నాం. సాధారణ ధరలకు అమ్మితే మాకు గిట్టుబాటుకాదు. అందుకే అధిక ధరలకు అమ్ముతున్నామని చెబుతున్నారు. - నాగమ్మ, రోగి బంధువు

చర్యలు తీసుకుంటాం...

దుకాణాల సముదాయంలో వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. వెంటనే పరిశీలించి ఎమ్మార్పీ ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకుంటాం. రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.

- డాక్టర్‌ ప్రసాదరావు, సూపరింటెండెంట్‌, సర్వజన ఆసుపత్రి

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని