logo
Published : 02/12/2021 02:41 IST

శుభ్రత కనుమరుగు...భద్రత దేవుడెరుగు!

వరద బాధిత గ్రామాల్లోని తాత్కాలిక మరుగుదొడ్లు

కనీస నిర్వహణ లేకపోవడంతో భరించలేని దుర్వాసన

కాలకృత్యాలకు యువతులు, మహిళలకు ఇబ్బందులు

రాత్రివేళలో చెయ్యేరు నదీతీరాన భయంగా స్నానాలు

తొగురుపేటలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లు

ఘనమైన లక్ష్యం దారి తప్పింది... ఉన్నతాశయం ఆచరణకు నోచుకోవడంలేదు... నిర్వహణ అధ్వానంగా మారింది... లోపభూయిష్టంగా ఉన్నా సరిదిద్దే ప్రయత్నం చేయడంలేదు... ఫలితంగా వరద బాధితులకు ‘మరుగు’ కష్టాలు వెంటాడుతున్నాయి... స్వచ్ఛ స్ఫూర్తి మచ్చుకైనా కనిపించడంలేదు... తాత్కాలిక మరుగుదొడ్లకు నేరుగా నీటి సరఫరా చేయకపోవడంతో భరించలేదని దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.... ఇళ్లు నేలమట్టం కావడంతో ప్రస్తుతం గుడారాల్లో కింద బాధితులు దయనీయ జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా యువతులు, అతివలకు పగటి పూట స్నానం చేసే భాగ్యం లేకుండాపోతోంది... రాత్రివేళ నివాసాలకు సమీపంలోని చెయ్యేరు నదీతీరాన చలిలో స్నానాలు చేయాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. - న్యూస్‌టుడే, కడప

అన్నమయ్య జలాశయం మట్టి కట్ట గత నెల 19వ తేదీన తెగిపోవడంతో వరద పోటెత్తింది. దిగువ ప్రాంతంలో చెయ్యేరు నదీతీరాన పులపుత్తూరు, తొగురుపేట, రామచంద్రాపురం, ఎగువ, దిగువ మందపల్లి గ్రామాల్లోకి 8 నుంచి 10 అడుగుల మేర వరదనీరు చేరింది. గుండ్లూరు, శేషమాంబపురం, చొప్పవారిపల్లెకు వరద గాయం తగిలింది. జల ప్రళయంతో పక్కాగృహాలు పేకమేడల్లా కూలిపోవడంతో నిలువనీడ లేక ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. ప్రస్తుతం గుడారాల్లోనే బాధితులు తలదాచుకుంటున్నారు. పులపుత్తూరులో 65, తొగురుపేటలో 22, రామచంద్రాపురంలో 22 తాత్కాలిక సంచార మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. వీటికి పూర్తిస్థాయిలో నీటి వసతి కల్పించలేదు. మానవ విసర్జితాలు నింపడానికి తాత్కాలికంగా పొక్లెయిన్లు తీసుకొచ్చి హడావుడిగా ఇసుకలో గుంతలు తవ్వి గొట్టాలు ఏర్పాటు చేశారు. నేరుగా నీరు అందించలేదు. ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నీటిని నింపుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు యువతులు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతుండడమే కాకుండా నానా అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు కొన్ని ఇళ్లకు దగ్గరగా, చాలా నివాసాలకు దూరంగా ఉండటంతో పండుటాకులు అవస్థలు పడుతున్నారు. ●

గత నెల 19వ తేదీన వరదొచ్చి నష్టం జరిగితే ఈ నెల 1వ తేదీ నాటికి కూడా పూర్తిస్థాయిలో శౌచాలయాలను యంత్రాంగం సిద్ధం చేయలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని అధికారులే చెబుతుండడం గమనార్హం, పైసా ఇవ్వకుండా పనులు చేయమని ఒత్తిడి చేస్తే ఎలాగని దిగువ స్థాయి యంత్రాంగం వాపోతోంది. స్థానిక గుత్తేదారులను ప్రాథేయపడుతూ వసతులు కల్పించాలని చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పులపుత్తూరులో మహిళలు, పురుషులకు వేర్వేరుగా మరుగు, స్నానపు గదులు నిర్మిస్తున్నారు. తాత్కాలిక సంచార మరుగుదొడ్ల నుంచి దుర్వాసన వస్తుండడం, సరిపడా నీరు వాడని కారణంగా దుర్గంధంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇవి ఇళ్లకు దూరంగా ఉండటంతో వృద్ధులు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. ప్రతి మరుగుదొడ్డికి నేరుగా నీటి వసతి కల్పించి ఉంటే సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. ఆరుబయట డమ్ములు పెట్టి నీరు నింపుతుండడంతోనే పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొంది. కొన్ని మరుగుదొడ్లు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.

పులపుత్తూరులో నిర్మిస్తున్న స్నానపు గదులు, మరుగుదొడ్లు

అక్కడకు వెళ్లాలంటే కష్టం

నా భర్త అనారోగ్యంతో నడవడానికి అవస్థలు పడుతున్నారు. మా ఇల్లు దిగువ ప్రాంతంలో ఉండగా, అధికారులు ఎగువ ప్రాంతంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అంత దూరం వెళ్లడం కష్టంగా ఉంటుంది. అధికారులు ఆలోచించి ప్రజావసరాలను పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తే బాగుండేది. అన్నీ ఒకేచోట పెడితే ఏం ప్రయోజనం?- యు.కొండమ్మ, తొగురుపేట

బహిర్భూమికి కష్టాలు

బహిర్భూమికి వెళ్లాలంటే కష్టాలు పడుతున్నాం. మా ఇల్లు నేలమట్టం కావడంతో గుడారంలో ఉంటున్నాం. అధికారులు ఏర్పాటుచేసిన తాత్కాలిక మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. కొన్నింటికీ నీటి వసతి లేకపోవడంతో దుర్వాసన వస్తోంది. డమ్ముల్లో నీటి నింపుతుండడంతో స్నానమెలా చేయాలి. - ఎస్‌.వెంకటసుబ్బమ్మ, పులపుత్తూరు

దూరంగా మరుగుదొడ్లు

మహిళలకు ప్రత్యేకంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పడంతో సంతోషించాం. అవి మా ఇళ్లకు దూరంగా అన్నీ ఒకేచోట పెట్టారు. దీంతో అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. మాకు అనువైన ప్రాంతంలో పెట్టాలని అడిగితే ఎవరూ స్పందించలేదు. - ఉప్పుటూరు ఈశ్వరమ్మ, తొగురుపేట

నానా తంటాలు పడుతున్నాం

మరుగు వసతి లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇంటికి దూరంగా సంచార మరుగుదొడ్లు పెట్టడంతో అక్కడికి వెళ్లాలంటే తంటాలు పడుతున్నాం. శుభ్రంగా లేకపోవడంతో దుర్వాసన భరించలేకపోతున్నాం. స్నానం చేయాలన్నా చేయలేకపోతున్నాం. యువతులు పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. - పల్లం రత్నమ్మ, పులపుత్తూరు

రాత్రి వేళ భయంభయంగా

అధికారులు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినా నీటి సరఫరా కల్పించలేదు. పైగా దుర్గంధం వెదజల్లుతున్నాయి. గుడారాల్లో స్నానం చేయడానికి కుదరడం లేదు. రాత్రివేళ భయంభయంగా సమీపంలోని చెయ్యేరు నదిలో స్నానం చేయాల్సి వస్తోంది. ఇలా ఎన్నిరోజులు అవస్థలు పడాలి.  - సిగమాల శ్యామలమ్మ, పులపుత్తూరు

ప్రత్యేక దృష్టి సారించాం

వరద బాధిత గ్రామాల్లో మరుగుదొడ్లు సమస్య లేకుండా ప్రత్యేక దృష్టిసారించాం. పులపుత్తూరు, తొగురుపేట, రామచంద్రాపురంలో 100 పైగా తాత్కాలిక సంచార మరుగుదొడ్లు ఏర్పాటు చేసి నీటివసతి కల్పించాం. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. - వీరన్న, బాధ్య ఎస్‌ఈ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, కడప

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని