logo
Published : 02/12/2021 02:41 IST

టీకా...రక్షించుగాక!

ఒమిక్రాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం చర్యలు

- న్యూస్‌టుడే, కడప వైద్యం

కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో

టీకా వేస్తున్న వైద్యసిబ్బంది (దాచిన చిత్రం)

కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కొన్ని దేశాల్లో ఉనికి చాటుతుండడం కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ డెల్టా వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తుందని వైద్యరంగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ దేశంలోకి ప్రవేశించకుండా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వణుకు పుట్టిస్తున్న కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనడానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్ధ మవుతోంది. ఈ క్రమంలో తొలి ప్రాధాన్యం టీకాలిస్తూ సాధ్యమైనంత త్వరగా 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి కనీసం తొలిడోసైనా వేయాలని నిర్ణయించింది.

జిల్లాలో కొవిడ్‌ టీకాల కార్యక్రమం ప్రారంభమైన అనంతరం హెల్త్‌కేర్‌ వర్కర్లకు తొలి ప్రాధాన్యమిస్తూ టీకాలు వేశారు. అనంతరం ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు దాటినవారు, 45 ఏళ్ల వయసు దాటి వివిధ దీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రాధాన్యమిస్తూ టీకాలు వేశారు. తదనంతరం 45 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి టీకాలు వేయడం ఆరంభించారు. చివరి దశలో 18 ఏళ్ల వయసు దాటిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. జిల్లాలో 18 నుంచి 44 ఏళ్ల వయసు మధ్య వయో విభాగం మినహా మిగిలిన అన్ని విభాగాల్లో దాదాపుగా నూరు శాతం టీకాల లక్ష్యం పూర్తయింది. ఈ ఒక్క విభాగంలో మాత్రమే మూడింట రెండొంతుల మంది తొలి డోసు వేయించుకోవడం గమనార్హం. ఈ గణాంకాలను పరిశీలిస్తే 18-44 వయో విభాగంలో తొలి డోసు వేయించుకోవాల్సినవారు 4,02,671 మంది ఉన్నారు. ఈ విభాగంలో ఇప్పటి వరకు 68.8 శాతం మంది టీకాలు వేయించుకున్నారు. కరోనా విస్తరణలో కీలకమైన ఈ వయోవిభాగంలోని వారు తొలి డోసు వేయించుకోవడానికి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖకు సహకరించకపోవడం గమనార్హం. జిల్లాలోని ప్రతి సచివాలయ పరిధిలోనూ అవసరమైననన్ని టీకాలు అందుబాటులో ఉన్నాయి. తొలి డోసు వేయించుకోనివారిని సచివాలయాల పరిధిలో ఓటరు జాబితాల ఆధారంగా గుర్తిస్తున్న వైద్యసిబ్బంది నేరుగా వారి ఇళ్లకు వెళ్లి టీకాలు వేస్తున్నారు. టీకా వేయించుకోవడానికి విముఖత చూపుతున్నవారికి వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రణాళిక రూపొందించుకున్నాం...

గతంలో వచ్చిన వేరియంట్లను గానీ, కొత్త వేరియంట్లను గానీ ఎదుర్కోవాలంటే టీకా వేయించుకోవడం ఒక్కటే మార్గం. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి ఈ నెలాఖరులోగా టీకాలు వేయడానికి ప్రణాళిక రూపొందించాం. ఒమిక్రాన్‌పై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పెంచనున్నాం. కొవిడ్‌-19 ప్రొటొకాల్‌ ప్రకారం వైద్యం అందించడానికి అన్ని వనరులను సిద్ధంగా ఉంచాం. జిల్లావాసులందరూ టీకాలు వేయించుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలి. - డాక్టర్‌ నాగరాజు, డీఎంహెచ్‌వో, కడప

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని