logo
Updated : 02/12/2021 06:15 IST

కష్టాలు చూడాలి...కన్నీళ్లు తుడవాలి!

ఆదుకోవాలంటూ వరద బాధితుల వేడుకోలు

నేడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన

వరద విధ్వంసం సృష్టించింది... జల విలయం అంతులేని విషాదం నింపింది... జల రాకాసి ఎంతోమందిని బలితీసుకుంది... ప్రకృతి ప్రకోపంతో పసిడి పంటలు నీటిపాలయ్యాయి... పేద, బడుగు జీవుల కలల గూడు నేలమట్టమైంది... పండ్ల తోటలను ముంచేసింది... ఆలయాలను కర్కశంగా కూలదోసింది. ప్రశాంత జీవనం సాగిస్తున్న పచ్చని పల్లెలు జల ప్రళయంతో చిగురుటాకులా వణికిపోయాయి. ఒకటి, రెండు కాదు పదుల సంఖ్యలో గ్రామాలను ముంచెత్తింది. శిథిల శకలాల మధ్య గుడారాల్లో దయనీయ జీవనం సాగిస్తున్న బాధితులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు (గురువారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ప్రాణ, ఆస్తి, పంట నష్టాలతో కుదేలైన తమను ఆదుకోవాలని వరద బాధిత ప్రాంతాల ప్రజలు వేడుకుంటున్నారు. - న్యూస్‌టుడే, రాజంపేట పట్టణం, రాజంపేట, రాజంపేట గ్రామీణ, కడప సచివాలయం, కడప నగరపాలక

బాధితులు ఏం కోరుకుంటున్నారంటే...

ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, డోజర్లు, సైకిళ్లు, ఆటోలు, ఇతర వాహనాలు కోల్పోయినవారికి పరిహారం అందించాలి.చెయ్యేరు నదికిరువైపులా రక్షణ గోడ, కరకట్టలు నిర్మించాలి.పంట నష్టాలను పూర్తిస్థాయిలో గుర్తించి పరిహారమివ్వాలి.మృతుల కుటుంబాలకు అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సాయం పెంచడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలి.పంట పొలాల్లో కొట్టుకుపోయిన బిందు, తుంపర పరికరాలను తిరిగి రాయితీపై మంజూరు చేయాలి.వరదల్లో కొట్టుకుపోయిన వివిధ రకాల ధ్రువీకరణ, గుర్తింపు పత్రాలను సకాలంలో ఉచితంగా అందజేయాలి.పక్కాగృహాలు నేల మట్టం కావడంతో తిరిగి నిర్మించుకునే వరకు పునరావాసం వసతులు కల్పించడంతోపాటు ఉపాధికి ఇబ్బందులు లేకుండా పనులు చూపాలి. దెబ్బతిన్న రవాణా వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు గ్రామాల్లో అంటువ్యాధులు, ఇతర జబ్బులు ప్రబలకుండా మరికొన్ని రోజుల పాటు వైద్యశిబిరాలు నిర్వహించాలి. ● పాడి పశువులు, జీవాలు, కోళ్లు కోల్పోయిన వారికి పరిహారంతోపాటు ఉచితంగా లేదా ధనాగారాల్లో రుణాలు మంజూరు చేయాలి.రాయితీపై గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్లు అందించాలి.ఉద్యాన తోటలు దెబ్బతిన్న వారికి తిరిగి మొక్కలను ఉచితంగా లేదా అధిక శాతం రాయితీ వసతి కల్పించి సాగు చేయించాలి.ఇసుక మేటలు, భూమి కోతకు గురైన భూములను పూర్వస్థితికి తీసుకొచ్చేవిధంగా ప్రత్యేక నిధులివ్వాలి.

ఇళ్ల శిథిలాల వద్దే గుడారాలు వేసుకున్న బాధితులు

వరద నష్టాలిలా...

జిల్లాలో 48 మండలాల్లోని 866 గ్రామాలు, మరో 9 పట్టణాల్లో వరద నష్టం జరిగింది. సుమారు 25,142 మంది ఇబ్బందులు పడ్డారు. ఖరీఫ్‌, రబీలో 1,81,973.56 హెక్టార్లలో సాగైన వ్యవసాయ పంటలు దెబ్బతినగా, 401.80 హెక్టార్లలో ఇసుక మేటలు, 387.60 హెక్టార్లలో కోత గురైనట్లు గుర్తించారు. ఇందుకోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సాయం రూ.125.51 కోట్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధి రూ.169.39 కోట్ల నిధులు కావాలని నివేదించారు.ఉద్యాన పంటలు 17,705 హెక్టార్లలో నీటిపాలైనట్లు నిర్ధారించారు. బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ చెల్లించడానికి రూ.110.22 కోట్లు ఇవ్వాలని నివేదించారు.జలప్రళయంతో 2,580 పక్కాగృహాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. పాక్షికంగా పాడైనవి, నీరు చేరిన వారికి కలిపి రూ.6.80 కోట్లు చెల్లించాల్సి ఉంది.రహదారులు, భవనాలశాఖలకు చెందిన 583.91 కి.మీ రహదారులు కోతకు గురి కాగా,. కల్వర్టులు, వంతెనలు కూలిపోయాయి.వీటి తాత్కాలిక, శాశ్వత పనులకు రూ.539.95 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు.పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన రహదారుల మరమ్మతులకు రూ.104.85 కోట్లు కావాలి. జిల్లాలో గ్రామీణ తాగునీటి పథకాల పునరుద్ధరణకు రూ.28.36 కోట్లు ఇవ్వాలని కోరారు.పురపాలక శాఖకు రూ.8.95 కోట్ల మేర నష్టం వాటిల్లింది.చిన్ననీటివనరుల శాఖ పరిధిలో 194 పనులకు రూ.95.51 కోట్లు, మధ్యతరహా జలవనరులకు రూ.0.56 కోట్లు, పెద్ద తరహా పనులకు రూ.17.95 కోట్లు, అవసరం కానుంది.

పర్యటన సాగుతుందిలా....

గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10.15 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. హెలికాప్టర్‌లో 10.25 గంటలకు రాజంపేట మండలం మందపల్లికి బయలుదేరి 10.50 గంటలకు చేరుకుంటారు. ● ఉదయం 11.10 గంటలకు పులపుత్తూరుకు చేరుకుని బాధితులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12.10 గంటలకు పులపుత్తూరు సచివాలయానికి చేరుకుంటారు. 12.30 గంటల నుంచి ఒంటి గంట వరకు మందపల్లి గ్రామవీధుల్లో పర్యటిస్తారు.1.45 గంటలకు అన్నమయ్య జలాశయానికి చేరుకుని పరిశీలిస్తారు. 2.15 గంటలకు మందపల్లిలోని నవోదయ విద్యాలయానికి చేరుకుంటారు. 2.15 గంటల నుంచి 2.45 గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. 3.05 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళతారు.

ఎగువ మందపల్లిలో పచ్చని పొలాల్లో ఇసుక మేటలు

తెగిపోయిన అన్నమయ్య జలాశయం మట్టి కట్ట

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని