
సమావేశంలో మాట్లాడుతున్న ఉక్కు సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు నారాయణ
కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: కడప ఉక్కు పరిశ్రమ సాధనకు మరో పోరాటానికి సిద్ధమవుతామని, ప్రభుత్వ రంగంలోనే కర్మాగారాన్ని నిర్మించాలని ఉక్కు సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు బి.నారాయణ తెలిపారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ కడప ప్రెస్‌క్లబ్‌లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రైవేటు రంగంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని పేర్కొన్నారు. గౌరవాధ్యక్షుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఉక్కు కర్మాగారం కోసం 200 రోజుల ఉద్యమాన్ని చేపట్టామని, ‘కడప ఉక్కు...ఆంధ్రుల హక్కు’ నినాదంతో మరోసారి ఉద్యమిస్తామన్నారు. దీనిపై ఎంపీలు, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులకు వినతి పత్రాలు అందజేస్తామని, ధర్నాలు, సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. సమావేశంలో వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు సత్తార్, శివకుమార్, రాజేంద్ర, దస్తగిరిరెడ్డి, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.