logo
Published : 05/12/2021 03:02 IST

ఆపన్నులకు అండ... సేవల దండ

 నేడు స్వచ్ఛంద సేవకుల దినోత్సవం 


అనాథకు క్షవరం చేస్తున్న రామకృష్ణారెడ్డి  

ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరో వైపు సమాజ సేవలో స్వచ్ఛందంగా పాల్గొంటూ పలువురి మన్ననలు పొందుతున్నారు కొందరు ఉద్యోగులు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని నిరుపేదలు, యాచకులకు ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సమకూర్చుతూ ఆదుకుంటున్నారు. అనాథలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలు లాంటి విపత్కర సమయాల్లోనూ నిత్యావసరాలు అందిస్తూ తమ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. వివరాలు పరిశీలిస్తే... 
- న్యూస్‌టుడే, యోగి వేమన విశ్వవిద్యాలయం 

మూడు వేల మంది విద్యార్థులకు చదువు...
కలసపాడు మండలం తెల్లపాడు గ్రామానికి చెందిన పాపిజెన్ని రామకృష్ణారెడ్డి రైల్వే విభాగంలో చిరుద్యోగం చేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇతను 2010లో వివేకానంద సేవాశ్రమాన్ని స్థాపించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదట్లో యువకుల ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో వివేకానందుని బోధనలపై ప్రచారం నిర్వహించారు. రక్తదానం, సామాజిక బాధ్యత తదితర అంశాలపై విద్యార్థులకు చైతన్యం కలిగిస్తున్నారు. జీతంలో 80 శాతం పైగా సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నారు. పేదలు, అనాథలైన మూడు వేల మంది విద్యార్థులకు చదువుపరంగా చేయూతనిచ్చారు. రోడ్డుపక్కన ఉన్న అభాగ్యులను ఆదుకుంటూ అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో కాశినాయన మండలం ఓబుళాపురం గ్రామం పరిసర ప్రాంతాల్లో వృద్ధులు, నిస్సహాయుల కోసం ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. కొవిడ్‌తో మృతిచెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించారు. 

నాలుగు నెలల జీతం విరాళం 
కడప నగర శివారులోని ఎర్రమాచుపల్లెకి చెందిన పట్టెం కిరణ్‌ గంగిరెడ్డి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇతని స్వస్థలం అట్లూరు మండలం చెండువాయి. 2009లో అమృత హస్తం సేవా సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆత్మహత్యల నివారణకు యువత, రైతులకు అవగాహన, మంత్రణం ఇస్తున్నారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో వందల సంఖ్యలో అవగాహన సదస్సులు నిర్వహించారు. 11 ఏళ్లుగా అలుపెరగకుండా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల వరదలకు దెబ్బతిన్న మందపల్లె, పులపుత్తూరు గ్రామస్థులకు నాలుగు నెలల జీవితాన్ని విరాళంగా అందించారు. రూ.50 వేల నిత్యావసరాలను కూడా సమకూర్చారు. ఇతర సంస్థల ప్రతినిధులతో కలిసి రూ.3 లక్షల మేర నిధులు సేకరించి వరద బాధితులకు అందించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో దోసెడు బియ్య కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నుంచి 1000 కిలోల బియ్యం సేకరించి బాధితులకు అందించారు. 


అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరమాత్మా
సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మలిశెట్టి వెంకటరమణ  

600 మందికి అంత్యక్రియలు...
కడప నగర శివారులోని సుబ్బన్నగారి పల్లి నివాసి అయిన మలిశెట్టి వెంకటరమణ నందలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. మొదట్లో విధుల్లో భాగంగా పోరుమామిళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెడ్డి కొట్టాల గ్రామంలో ఒక అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఎవరూ లేని అనాథలకు అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత 50 నుంచి 60 మంది వరకు అంత్యక్రియలు నిర్వహించారు. 2006లో పరమాత్మా సేవా సంస్థను స్థాపించి అనాథలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 597 మందికి అంత్యక్రియలు చేశారు. 1993లో ఒక్కో అంత్యక్రియకు అయ్యే ఖర్చు రూ.600గా ఉండేదని, ఇప్పుడు ఒక్కో అంత్యక్రియకు దాదాపు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చు అవుతోందన్నారు. దీనికి అయ్యే ఖర్చు మొత్తం తనకు వచ్చే జీతం నుంచే భరిస్తున్నాని రమణ తెలిపారు. ఇప్పటి వరకు 48 సార్లు రక్తదానం చేశాడు. సిద్దవటం, భాకరాపేట మధ్య  పరమాత్మా సేవా నిరాధారుల ఆశ్రయం స్థాపించి 26 మందికి ఆశ్రయం ఇస్తున్నారు. 

కువైట్‌లో ఉంటూ...
ఒంటిమిట్ట మండలానికి చెందిన సిద్దవటం నాగముని మొదట్లో చలివేంద్రాలు నిర్వహించేవారు. ఒంటిమిట్ట, సిద్దవటం, బద్వేలు మండలాల్లోని పేదలకు ఆర్థిక సహాయం అందించారు. తరువాత తన జీవన భృతి, కుటుంబ పోషణ కోసం కువైట్‌ వెళ్లిన నాగముని సేవా కార్యక్రమాలు ఆగకుండా ఉండేందుకు మేము సైతం సేవా సంస్థను స్థాపించి అందులో వాలంటీర్లను నియమించి  కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు. కువైట్‌లో ఇబ్బంది పడుతున్న వారికి వసతి, అవుట్‌పాస్‌ ఇప్పించి ఇండియాకు పంపడం, జిల్లాలోని వివిధ వృద్ధాశ్రమాలకు నిత్యావసరాలు, ఇతర సామగ్రి అందిస్తున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలు, వస్త్రాలు అందించారు. కరోనా సమయంలో మాస్కులు, మందులు, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలం అయిన మందపల్లె, పులపుత్తూరు  గ్రామవాసులకు రూ.1.25 లక్షల నిత్యావసర సరకులు అందించారు. 

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని