logo

రాజకీయ చట్రంలో రక్షణ గోడ

రైల్వేకోడూరు పట్టణంలో గుంజనేటి ఒడ్డున ఉన్న నరసరాంపేటలో వర్షం కురిసినప్పుడల్లా ముంపునకు గురవుతోంది. 2005, డిసెంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఇక్కడి ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. అప్పటి మంత్రులు, నాయకులు ఇక్కడ స్వయంగా పర్యటించి ఈ ప్రాంతానికి రక్షణ గోడ అవసరమని నిర్ధారించారు.

Published : 05 Dec 2021 03:02 IST

నిర్మించకుండా విమర్శలతోనే కాలయాపన


కూలిన ఇల్లు  

-న్యూస్‌టుడే, రైల్వేకోడూరు రైల్వేకోడూరు పట్టణంలో గుంజనేటి ఒడ్డున ఉన్న నరసరాంపేటలో వర్షం కురిసినప్పుడల్లా ముంపునకు గురవుతోంది. 2005, డిసెంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఇక్కడి ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి. అప్పటి మంత్రులు, నాయకులు ఇక్కడ స్వయంగా పర్యటించి ఈ ప్రాంతానికి రక్షణ గోడ అవసరమని నిర్ధారించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది ఎన్నికల హామీగానే మిగిలిపోతోంది. శేషాచలం అడవుల నుంచి వరద పోటెత్తిన ప్రతిసారీ ఇక్కడ ఏటి ఒడ్డున ఉన్న నివాసాలు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతింటూనే ఉన్నాయి. 
గత ప్రభుత్వంలోనే నరసరాంపేటకు రూ.21.87 కోట్లతో రక్షణ గోడ మంజూరైంది.  వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసింది. ప్రజలు ఇబ్బంది పడడానికి ఇప్పటి నేతలే కారణం.- బత్యాల చెంగల్రాయుడు, 
తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి 
సుమారు 12 ఏళ్లపాటు అధికారంలో ఉన్న ఇక్కడి నేత ఒకరు నరసరాంపేటకు రక్షణ గోడ నిర్మించలేకపోయారు. ఆ వైఫల్యాన్ని మా మీదకు తోసే ప్రయత్నం మంచిది కాదు. జగన్‌ ప్రభుత్వంలో రూ.37 కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తాం.  
- కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ 
పక్కా గృహాలకు ప్రణాళిక : నరసరాంపేటలో మొత్తం 21 నివాసాలు అత్యంత ప్రమాదకరమని గుర్తించాం. 16 కుటుంబాల వారికి ఇప్పటికే ఇంటి స్థలాలు మంజూరయ్యాయి. మరో అయిదుగురికి విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న కారణంతో జాగా మంజూరు కాలేదు. అందరికీ పక్కా గృహాలు కట్టించే ఏర్పాట్లు చేస్తున్నాం. - రామమోహన్, తహసీల్దారు 
రూ.37 కోట్లతో నివేదిక: రక్షణ గోడ నిర్మించడానికి రూ.37 కోట్లతో అంచనా నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం. నిధులు, అనుమతులు రాగానే పనులు చేపడతాం. - చెంగల్రాయుడు, డీఈ,  నీటిపారుదలశాఖ 
సమస్యను విన్నవిస్తూనే ఉన్నాం
ఓట్లకు వచ్చిన ప్రతి నాయకుడికీ మా సమస్యలు విన్నవిస్తూనే ఉన్నాం. మాటలు చెప్పడం తప్ప రక్షణ గోడ నిర్మించలేదు. నీటి ఉద్ధృతికి మా రెండంతస్తుల భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. కట్టుబట్టలతో మిగిలాం. పిల్లా పాపలతో నడిరోడ్డుపై నిలబడాల్సి వచ్చింది.  
- షేక్‌ నూర్జహాన్, ఆయేషా
మాటలతో సరిపెడుతున్నారు
వర్షం కురిసిన ప్రతిసారీ ఇక్కడ గండమే. ఇళ్లు కొద్దికొద్దిగా ఏట్లోకి జారిపోతుంటే ప్రాణాలు అరచేత పట్టుకుని వీధుల్లోనే ఉంటున్నాం. అందరం పేదవాళ్లం. ప్రభుత్వం, పాలకులు చర్యలు తీసుకుని గోడ కట్టిస్తే ఏట్లోని నీళ్లు ఇళ్లలోకి రాకుండా ఉంటాయి. కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు
- రామాంజులమ్మ  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని