logo
Published : 06 Dec 2021 03:18 IST

ఇసుక కొండంత..సాయం గోరంత !

ఆరడుగుల మేర మేటలు

 హెక్టారుకు రూ.12,500

 సరిపోదని అన్నదాతల ఆందోళన

ఎగువ మందపల్లిలో చెయ్యేరు ఒడ్డున పసిడి నేలల్లో వొసేన ఇసుక మేటలు

చెయ్యేరు వరదతో బంగరు పంటలు పండే నేలలు ఇసుకార్పణం అయ్యాయి. దీంతో కర్షకుల కంట కన్నీరు సుడులు తిరుగుతోంది. చెయ్యేరు నది పరివాహక పరిధిలోని రైతుల పొలాల్లో భారీగా ఇసుక చేరింది. జల ప్రళయంతో నేల పైపొర మన్ను పూర్తిగా కొట్టుకుపోయి ఇసుక మేటలు వేసింది. ప్రస్తుతం సైకతం తొలగింపు రైతులకు ఆర్థికంగా పెనుభారం కానుంది. ఒకటి, రెండు కాదు... ఆరేడు అడుగులకు పైగా మేటలను ఎలా తొలగించుకోవాలని రైతులు గుబులు చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన హెక్టారుకు రూ. 12,500 సాయం ఏమాత్రం సరిపోదని పెదవి విరస్తున్నారు. - న్యూస్‌టుడే, రాజంపేట పట్టణం

జిల్లాలో గత నెల 19న అన్నమయ్య జలాశయం మట్టి కట్ట తెగిపోయింది. దీంతో రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. సాగులోని పంటలు నీటిపాలయ్యాయి. సాగు భూముల్లోకి భారీగా వరద రావడంతో ఇసుక దిబ్బలు చేరాయి. ఈ మూడు మండలాల్లో 486 మందికి చెందిన 328.52 హెక్టార్లలో ఇసుక, రాళ్లు మేటలు చేరాయి. చెయ్యేరు నదికి సమీప పొలాల్లోకి 5-8 అడుగుల మేర సైకతం వచ్చింది. కాస్త దూరంగా ఉన్న ప్రాంతాల్లో 2-3 అడుగుల మేర చేరింది. దీంతో ఏరు, భూములు ఒక్కటైనట్లు కనిపిస్తున్నాయి. n రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మేటల తొలగింపునకు హెక్టారుకు రూ.12,500 చెల్లిస్తామని ప్రకటించింది. ఈ తక్కువ మొత్తంతో పొలాలను బాగు చేసుకోవడం కష్టమని అన్నదాతలు వాపోతున్నారు. n రాజంపేట మండలంలో 396 మందికి చెందిన 273.08 హెక్టార్లలో ఇసుక మేటలు వేశాయి. పులపుత్తూరు రైతు భరోసా కేంద్రం పరిధిలో 54.22 హెక్టార్లు, మందరం 40, ఎంజీ పురం 40, మందపల్లి గుండ్లూరు 40, మందపల్లి 76.06, ఆర్‌.బుడుగుంటపల్లి 6.8, తాళ్లపాక 16 హెక్టార్లను మెరుగుపరచుకోవాల్సి ఉందని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. n నందలూరు మండలంలో 27.44 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. పాటూరు 3.23, కుందానెల్లూరు 3, టంగుటూరు 1, నల్లతిమ్మాయపల్లె 19.4 హెక్టార్లలో ఈ సమస్య ఉంది. పెనగలూరు-1లో 8, కొండూరు-1లో ఆరు, సిద్దవరం 6, కోమంరాజుపురం 4, ఓబలి ఆర్‌బీకే పరిధిలో నాలుగు హెక్టార్లలో ఇసుక చేరి నేల స్వభావాన్ని అధ్వానంగా మార్చేసినట్లు అధికార యంత్రాంగం గుర్తించింది.

రవాణా హక్కు.. చిక్కు

చెయ్యేరు నది పరివాహక వ్యవసాయ భూముల్లోకి భారీగా ఇసుక చేరింది. ఇక్కడి నుంచి ఇసుక రవాణా చేసే హక్కు ఎవరికీ ఉందనే అంశంపై అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వలేదు. తమ భూమిలోని ఇసుకను రైతులు విక్రయించుకోవచ్చా, దీనికి అనుమతి ఇస్తారా లేదా అనే సందేహం తలెత్తుతోంది. పంట పొలాల్లోని ఇసుకను అమ్ముకునే వెసులుబాటు ఇస్తే తమకు ఆర్థికంగా కొంత ఊరట ఇచ్చినట్లు అవుతుందని రైతులు భావిస్తున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం - జె.మురళీకృష్ణ, జేడీ, వ్యవసాయశాఖ, కడప

చెయ్యేరు నది పరివాహకంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో వరద రావడంతో వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు చేరాయి. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించాం. జిల్లా వ్యాప్తంగా 483 హెక్టార్లలో ఇసుక చేరినట్లు గుర్తించాం. ఇదే విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించాం. హెక్టారుకు రూ.12,500 చెల్లిస్తామని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మొత్తం మరికొంత పెంచాలని రైతుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. ఉన్నత స్థాయి నంచి అందే ఉత్తర్వులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

ఆరు అడుగుల ఎత్తున చేరిన ఇసుక మేటలను చూపుతున్న రైతు పేరు కామటం రాజా. ఈయన సొంతూరు రాజంపేట మండలం సాలిపేట. ఇటీవల చెయ్యేరు వరద రావడంతో ఎకరా విస్తీర్ణంలో 5-6 అడుగులకు పైగా ఇసుక చేరింది. మరో ఎకరాలో 2-3 అడుగుల మేర సైకతం పేరుకుపోయింది. బాగు చేసుకోవాలంటే కనీసం రూ.రెండు లక్షలు కావాలని రైతు చెబుతున్నారు. హెక్టారుకు రూ.12,500 చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఈయన పెదవి విరుస్తున్నారు.

ఆ మొత్తం సరిపోదు...

మా ఊరి పక్కనే చెయ్యేరు నది ప్రవహిస్తోంది. అన్నమయ్య మట్టి కట్ట తెగిపోవంతో మహోగ్రరూపంతో పరవళ్లు తొక్కుతూ భూములను నాశనం చేసింది. మా భూమిలో మూడు అడుగుల మేర ఇసుక మేటలు వేశాయి. ఎలా తొలగించాలో అర్థం కావడం లేదు. హెక్టారుకు రూ.12,500 ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. అది ఎలా సరిపోతుందో ఆలోచించాలి. ఇంత తక్కువ మొత్తంతో ఏవిధంగా బాగు చేసుకోవాలి. ఎకరాకు రూ.25 వేలు సాయం చేస్తే మా డబ్బులను కొంత పెట్టుకొని భూములను సాగులోకి తెచ్చుకుంటాం. దీనిపై ఉన్నతాధికారులు సానుకూల దృక్ఫథంతో ఆలోచించాలి. - తోట సుబ్బరాయుడు, రైతు, ఎగువ మందపల్లి

పంటలను నాశనం చేసింది

అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోవడంతో ఎల్లవొచ్చి పంటలను నాశనం చేసింది. ఎకరా పసుపు పూర్తిగా దెబ్బతింది. ఇందుకోసం పెట్టిన పెట్టుబడి రూ.50 వేలు గంగ పాలైంది. వరి ఎకరా, వేరుసెనగ ఎకరాలో సాగు చేశా. రెండు బోర్లకు ఏర్పాటు చేసిన మోటార్లు నీటిపాలయ్యాయి. ఊర్లో ఒక ఎకరా మిగల్లేదు. అంతా కోతకు గురై ఇసుక మేటలు వేయడంతో పంటలు సాగు చేసుకోవడం కష్టంగా ఉంది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. - వెంగని వెంకటరమణ, రైతు, ఏకిరిపల్లి

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని