logo

శనగకు అదనపు వసూలు బెడద

అసలే పంట నష్టంతో ముప్పుతిప్పలు పడుతున్న రైతులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. శనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 80 శాతం రాయితీతో విత్తనం అందిస్తోంది. దీనిపై స్పష్టమైన ధరను పేర్కొనగా రైతు భరోసా కేంద్రాల్లో

Published : 06 Dec 2021 03:18 IST

క్వింటాకు రూ.20

అసలే పంట నష్టంతో ముప్పుతిప్పలు పడుతున్న రైతులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. శనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 80 శాతం రాయితీతో విత్తనం అందిస్తోంది. దీనిపై స్పష్టమైన ధరను పేర్కొనగా రైతు భరోసా కేంద్రాల్లో మాత్రం క్వింటాకు అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారు. - న్యూస్‌టుడే, ఎర్రగుంట్ల, ఒంటిమిట్ట, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు

జిల్లాలో రబీ సీజన్‌లో శనగ సాధారణ విస్తీర్ణం 95,489 హెక్టార్లు. నల్లరేగడి భూములున్న కమలాపురం, పులివెందుల, ముద్దనూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, పోరుమామిళ్ల వ్యవసాయ డివిజన్ల పరిధిలో విస్తారంగా సాగు చేస్తారని అధికారులు ముందస్తుగా గుర్తించారు. అన్నదాతలకు జె.జి-11 రకం 65,648 క్వింటాళ్ల విత్తనాలను ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. కాకపోతే ఈసారి రాయితీ 25 శాతానికి పరిమితం చేశారు. క్వింటా పూర్తి ధర రూ.6,900 కాగా అందులో ప్రభుత్వ వాటా రూ.1,725 (25 శాతం), రైతు రూ.5,175 (75 శాతం) చెల్లించాలని ధరలను ఖరారు చేశారు. విపణిలో ఇంతకంటే తక్కువ ధరకే విత్తనాలు లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థకు సేకరణ, సరఫరా బాధ్యతలు అప్పగించారు. l జిల్లాలో గత నెలలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. నల్లరేగడి భూముల్లో సాగు చేసిన శనగ పంట నీటిలో మునిగి, తేమ ఎక్కువై దెబ్బతింది. జిల్లావ్యాప్తంగా సుమారు 88,209.63 హెక్టార్లలో ఈ పైరు వర్షార్పణం అయినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో శనగ పంటను మళ్లీ సాగు చేసేందుకు ఆసక్తి చూపే అన్నదాతలకు ఆర్థికంగా విత్తన రూపంలో ఊతమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. l 53,102 క్వింటాళ్లు అదనంగా తెప్పించాలని ఏపీ సీడ్స్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే 32,850 క్వింటాళ్లను ఆయా మండలాల్లోని ఆర్‌బీకేలకు చేర్చారు. రైతులు 44,250 క్వింటాళ్లు కావాలని తమ పేర్లను నమోదు చేసుకున్నారు. l పెద్దముడియం మండలంలో అత్యధికంగా 35 వేల ఎకరాల్లో పంట దెబ్బతినగా రాయితీ శనగల పంపిణీ జరుగుతోంది. క్వింటా రూ.6,900 ధర నిర్ణయించగా, 80 శాతం రాయితీపోనూ రైతు వాటా రూ.1380 చెల్లించాలి. కొన్ని ఆర్బీకేల్లో రూ.1,400 వసూలు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఒక్కో ప్యాకెట్‌ (25 కిలోలు) రూ.345 అయితే రూ.350 తీసుకుంటున్నట్లు సమాచారం. l ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి రైతు భరోసా కేంద్రంలో క్వింటాకు రూ.1,400 వసూలు చేస్తున్నారు. విత్తనం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా తగ్గించి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.

ఫిర్యాదు చేస్తే చర్యలు

ప్రభుత్వ నిర్ణీత ధర మేరకు శనగ విత్తనాలకు తమ వాటా కింద రైతులు నగదు చెల్లించాలి. ఎక్కడైనా క్షేత్రస్థాయి సిబ్బంది అదనంగా వసూలు చేస్తుంటే మా దృష్టికి తీసుకు రావాలి. ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. - జె.మురళీకృష్ణ, జిల్లా సంయుక్త సంచాలకులు, వ్యవసాయశాఖ, కడప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని