బిల్లులు పెంచినా వసతులు కల్పించరా?
యోవేవి విద్యార్థుల ఆందోళన
నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
యోవేవి(కడప), న్యూస్‌టుడే : ‘మరుగుదొడ్ల తలుపులు విరిగిపోయాయి. స్విచ్ బోర్డులు పగిలిపోయాయి. వాటిని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతోంది. వసతి గృహం మెస్ బిల్లు 80 శాతం పెంచారు. వసతులు మాత్రం సమకూర్చలేదు. భోజనం పెట్టడంలోనూ కక్కుర్తి చూపిస్తే ఎలా’ అని యోగి వేమన విశ్వవిద్యాయం అధికారులను విద్యార్థులు ప్రశ్నించారు. ఆదివారం ఉదయం ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులను ప్రశ్నించకుండా అణగదొక్కుతోందని, ఏమైనా మాట్లాడితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదన్నారు. తక్షణమే మెస్ బిల్లులు తగ్గించి, వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండు చేశారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకుని వీసీ సూర్యకళావతి, రిజిస్ట్రార్ విజయరాఘవప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.