భార్యను నదిలో తోసేసిన భర్త
జమ్మలమడుగు, న్యూస్‌టుడే: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త పెన్నా వంతెనపై నుంచి ఆమెను నదిలోకి తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు చెప్పిన సమాచారం మేరకు... ముద్దనూరు మండలం కమ్మవారిపల్లెకు చెందిన రాధిక (19), జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లె గ్రామానికి చెందిన పిచ్చమ్మగారి ప్రసాద్‌తో మూడేళ్ల క్రితం వివాహమైందన్నారు. అనుమానంతో వేధిస్తుంటే నవంబరు 20వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందన్నారు. భర్త ప్రసాద్‌తో పాటు అతని తమ్ముడు నవీన్ ఆచూకీ తెలుసుకుని అదేరోజు రాత్రి వాహనంలో ఇంటికి తిరిగి వెళ్తూ పెన్నా వంతెన వద్ద ఆపినట్లు చెప్పారు. నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా చూడమని చెప్పి ఆమెను నదిలో తోసేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయం తెలియని నిందితుడి అక్క రామాంజనమ్మ తన భర్తతో కలసి నవంబరు 28న జమ్మలమడుగు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ఆరా తీయగా నిందితుడు, అతని తమ్ముడు ఈ నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి రిమాండుకు పంపామన్నారు.