అందని బిల్లులు... విద్యార్థులకు పాట్లు
కస్తూర్బాల్లో పరిస్థితి ఇది
కేజీబీవీలో భోజనం చేస్తున్న విద్యార్థులు
పోరుమామిళ్ల, న్యూస్‌టుడే కస్తూర్బాగాంధీ, నమూనా పాఠశాలల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీలకు బకాయిలు రోజురోజుకీ పేరుకుపోతున్నాయి. దీంతో నిర్వాహకులు ఇబ్బందిపడుతున్నారు. ఇదే సందర్భంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందటంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 29 కస్తూర్బాగాంధీ బాలికల, 9 నమూనా పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 7800 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి అవసరమైన భోజన సదుపాయాలకు అవసరమైన సరకులను ఏజెన్సీలు సమకూర్చుతున్నాయి. ఈ ఏజెన్సీలకు ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలకు బిల్లులు చెల్లించాల్సి ఉంది.
నెలకు సుమారు రూ. 70 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి ప్రభుత్వం జ్ఞానభూమి పోర్టల్‌ను తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌లో పాఠశాలకు సంబంధించిన బిల్లులు అప్లోడు చేయాల్సి ఉంది. ప్రారంభం నుంచే బిల్లులు ఆన్లైన్లో అప్లోడు కావటంలేదు. దీంతో బకాయిలు సుమారు నాలుగు కోట్లకు చేరాయి. ప్రతి పాఠశాలలో బిల్లులు తయారు చేసి సిద్ధం చేశారు. అప్లోడు కోసం ఎదురు చూస్తున్నారు. బిల్లులు రాకపోవడంతో ఏజెన్సీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. ఫలితం విద్యార్థులపై పడుతోంది.
జిల్లాలో పది ఏజెన్సీలు వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాయి. ప్రస్తుతం పెరిగిన ధరలకు అప్పులు చేసి వంటకు సరకులను సరఫరా చేస్తున్నట్లు వాటి నిర్వాహకులు తెలిపారు.
పోర్టల్‌లోనే సమస్య
జ్ఞానభూమి పోర్టల్‌లో బిల్లులు అప్లోడు చేసేందుకు సమస్య తలెత్తింది. ఈ పోర్టల్‌లో మార్పులు అవసరం. అప్పులు చేసి పాఠశాలలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నాం. అధికారులు బిల్లుల అప్లోడు చేస్తే చాలు. ఒక్కనెల బిల్లులు పడితే తరువాత అప్లోడు సమస్యలు తలెత్తవు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని సరకులు సరఫరా చేస్తున్న గుత్తేదారులు తెలిపారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఏప్రిల్ నుంచి కేజీబీపీ, నమూనా పాఠశాలలకు సంబంధించిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు జరగలేదు. సుమారు నాలుగు కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. జ్ఞానభూమి పోర్టల్‌లో బిల్లులు అప్‌లోడుకు అనుమతి రాలేదు. బిల్లులను సిద్ధం చేసి పెట్టాం. బిల్లులు చెల్లింపునకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. - ప్రభాకర్‌రెడ్డి, సమగ్రశిక్షా పథక అధికారి, కడప.