logo

Ap News: పౌరుషాల గడ్డ.. సైనికుల అడ్డాదేశభక్తిని చాటుతున్న గ్రామాలు

ఆ పల్లెలు వీరులగన్న గడ్డలు... సైనికులనుగన్న వీరమాతల అడ్డాలు... ఊరి పేరు చెన్నగానే మీ పల్లెలో సైనికులు ఎక్కువంట కదా! అని అడిగే అంతమందిని దేశ రక్షణకు అందించిన పుణ్యభూమి మన జిల్లా. ఆర్మీ అంటే ఆషామాషీ కాదు ఎముకలు కొరికే చలిలో... కంటి మీద రెప్పవాలకుండా తుపాకీ నీడలో అనుక్షణం కాపలా కాస్తూ

Updated : 15 Jan 2022 08:41 IST

సైనిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం

కలసపాడు: ఎక్కువ మంది ఆర్మీ ఉద్యోగులున్న ఎగువ రామాపురం గ్రామం

ఆ పల్లెలు వీరులగన్న గడ్డలు... సైనికులనుగన్న వీరమాతల అడ్డాలు... ఊరి పేరు చెన్నగానే మీ పల్లెలో సైనికులు ఎక్కువంట కదా! అని అడిగే అంతమందిని దేశ రక్షణకు అందించిన పుణ్యభూమి మన జిల్లా. ఆర్మీ అంటే ఆషామాషీ కాదు ఎముకలు కొరికే చలిలో... కంటి మీద రెప్పవాలకుండా తుపాకీ నీడలో అనుక్షణం కాపలా కాస్తూ ఉండాలి. ఉగ్రవాదుల మందుపాతరకు మన జిల్లాకు చెందిన బిడ్డ అమరుడయ్యాడు. ముంబయి తాజ్‌ హోటల్‌లో జరిగిన ఉగ్రదాడులను తిప్పికొట్టిన వారిలోనూ మనవారున్నారు. నేటికీ ప్రత్యేకంగా చెప్పే ఎన్‌ఎస్‌జీ కమెండోలుగా అనేక మంది విధులు నిర్వర్తిస్తున్నారు. నేడు సైనిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

కలసపాడు మండలంలోని ఎగువ రామాపురంలో ఎక్కువ మంది రైతులు, రైతు కూలీలు ఉన్నారు. 30 ఏళ్ల క్రితం పంటలు సరిగా పండక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. ఈనేపథ్యంలో ఇంటికొకరు చొప్పున అప్పట్లో సైన్యంలో చేరి దేశానికి సేవ చేశారు. గ్రామంలో 3,858 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 150 మందికి పైగా ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. 50 మంది విశ్రాంతి పొందారు. ఇదే గ్రామానికి చెందిన బండి ప్రతాపరెడ్డి బ్లాక్‌ కమెండో, ఎన్‌ఎస్‌జీగా పనిచేశాడు. తాజ్‌ హోటల్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో పాల్గొన్నాడు. షేక్‌ బాలాయపల్లె దస్తగిరి కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నాడు.

ఎగువ రామాపురానికి చెందిన ఆర్మీ ఉద్యోగి ఎస్‌.నాయబ్‌ రసూల్‌. ప్రస్తుతం ఈయన 19 ఏళ్లుగా ఆర్మీలో హవల్‌దార్‌గా పనిచేస్తున్నాడు. ఇతని సోదురుడు సయ్యద్‌ఖాసీం కూడా ఆర్మీలో సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. పేదరికంతో తల్లిదండ్రులు పెద్దసయ్యద్‌మియా, మహబూబ్‌బీ ఎంతో కష్టపడి చదివించారని నాయబ్‌రసూల్‌ తెలిపాడు. చాలా కాలం కుటుంబానికి దూరంగా ఉన్నాననే బాధ ఉండేది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో పాటు దేశానికి సేవ చేస్తున్నాని గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జిల్లాకు చెందిన సైనికుడు షేక్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌

కొర్రపాడులో 30 మంది

కొర్రపాడు (రాజుపాళెం): రాజుపాళెం మండలంలోని కొర్రపాడుకు కొన్నేళ్ల క్రితం సైనికుల గ్రామంగా పేరొచ్చింది. గ్రామంలో దాదాపు 30 మంది వరకు దేశ సైనికుల విధులు నిర్వహించారు. నిత్యం దేశ సరిహద్దులో మంచుగడ్డలలో కొరికే చలిలో విధులు నిర్వర్తించారు. ఈ విధుల్లో భాగంగా కార్గిల్‌ యుద్ధంలో కొర్రపాడుకు చెందిన సింగా హేమానందరెడ్డి విధులు నిర్వహిస్తుండగా 2003 జూన్‌ 12వ తేదీన ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి అమరువీరుడయ్యాడు. తమ శిబిరంలో ఉండే వారి కోసం రేషన్‌ తీసుకు పోతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్యారా కమెండో-10 రెజిమెంట్‌లో విధులు నిర్వహించేవాడు. దీంతో గ్రామంలో అప్పట్లో విషాదం నెలకొంది. నేటికీ చాలామంది విశ్రాంత సైనికులు గ్రామంలో ఉన్నారు.

వేముల మండలంలో ఎక్కువ మంది నిరుద్యోగులు దేశ రక్షణ వైపు వెళ్లారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుకున్న నిరుద్యోగులకు మిలటరీ, సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ ఉద్యోగాలే కల్పతరువులు. కుటుంబ జీవన అవసరాలే వీరిని ఈవైపు మళ్లించాయి. నల్లచెరువుపల్లెలోనే 48 మంది వరకు ఈ ఉద్యోగాల్లో ఉన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న చింతలజూటూరు, వేల్పుల, అమమ్మగారిపల్లె, వేముల, గొల్లల గూడూరు తదితర గ్రామాలకు చెందిన 59 మంది యువత ఈ రంగంలోకి ప్రవేశించింది. వీరు జమ్ముకాశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. దేశరక్షణకు పాటుపాడుతున్నామన్న సంతోషంతోపాటు కుటుంబ అవసరాలు తీరుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రొద్దుటూరు గ్రామీణ : చెన్నమరాజుపల్లెకు చెందిన ముగ్గురు యువకులు మాతృదేశ రక్షణ కోసం సైనికులుగా పనిచేస్తున్నారు. సొంతూరు, కుటుంబాన్ని వదిలిపెట్టి రాష్ట్రం కాని రాష్ట్రాల్లో వీర జవాన్లుగా పనిచేస్తూ దేశభక్తి చాటుతున్నారు. వ్యవసాయంపై ఆధారపడిన తల్లిదండ్రులు తమ బిడ్డలు సైనికులుగా వెళ్లేందుకు మనస్ఫూర్తిగా ఆశీర్వాదం అందించారు.

దేశ సేవ గర్వకారణం

నా పేరు షేక్‌ కమాల్‌బాషా. కమలాపురం మండలం, కె.కొత్తపల్లె మా స్వగ్రామం. పదో తరగతి చదివా. నేను పాఠశాలలో ఉన్నప్పుడే ఉపాధ్యాయులు దేశ రక్షణ కోసం సైనికుల త్యాగాలను తెలియజేయడంతో ఆసక్తి పెంచుకున్నా. దేశ రక్షణకు సైనికుడిగా చేరాలని నిర్ణయించుకున్నా. 1984లో ఆర్మీలో చేరాను. జమ్ము, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, కశ్మీర్‌లో విధులు నిర్వహించా. 2001లో ఉద్యోగ విరమణ పొందాను. 17 ఏళ్లు దేశానికి సేవ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది.

కాశినాయన మండలంలో..

కాశినాయన : మండల కేంద్రమైన నరసాపురం గ్రామంలో 64 మంది, ఉప్పలూరు గ్రామంలో 45 మందికి పైగా సైనికోద్యోగులు ఉన్నారు. మూలపల్లెలో 5 మందికి పైగా ఉన్నారు. మండలంలో ప్రతి గ్రామం నుంచి ఒకరు లేదా ఇద్దరు సైనిక ఉద్యోగులు ఉండడం విశేషం.

తల్లిదండ్రుల త్యాగం

తమ పిల్లలను సైనికులుగా పంపటానికి చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపరు. నరసాపురం, గంగనపల్లె ఉప్పలూరు గ్రామాలకు చెందిన పదిమంది తమకున్న ఇద్దరు పిల్లలను కూడా సైనికులుగా పంపించారు.దేశభక్తిని చాటుతున్నారు.

28 ఏళ్లుగా సేవలు

నరసాపురం గ్రామానికి చెందిన ముడమాల గురయ్య 28 ఏళ్లుగా సైన్యంలో సేవలు అందిస్తున్నారు. అతను సిపాయిగా ఎంపికై ప్రస్తుతం సుభేదారు హోదాలో పనిచేస్తున్నారు. దేశ సేవ చేయాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. అందరూ 17 ఏళ్లకే ఉద్యోగ విరమణ పొంది ఇంటకి వస్తున్నా 28 ఏళ్లుగా సేవలందిస్తున్నట్లు గురయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని