logo

విలీనం దిశగామరో 300 పాఠశాలలు

నూతన విద్యా విధానం అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటి నుంచి అవసరమైన ప్రక్రియకు ఉపక్రమించింది. ఇందులో 250 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత బడుల్లో పంపి విలీనం చేయడం ముఖ్యమైంది. జిల్లావ్యాప్తంగా 307 ప్రాథమిక

Published : 15 Jan 2022 02:25 IST

కి.మీ. పరిధి నేపథ్యం

వచ్చే విద్యా సంవత్సరంలో అమలు?

కడప విద్య, న్యూస్‌టుడే : నూతన విద్యా విధానం అమలుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటి నుంచి అవసరమైన ప్రక్రియకు ఉపక్రమించింది. ఇందులో 250 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలల 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత బడుల్లో పంపి విలీనం చేయడం ముఖ్యమైంది. జిల్లావ్యాప్తంగా 307 ప్రాథమిక బడుల్లోని 3, 4, 5 తరగతులను వాటి సమీపంలోని 246 ఉన్నత పాఠశాలల్లో విలీనం పూర్తి అయింది. ఈ ప్రక్రియ అమలు సందర్భంగా అనేకచోట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొన్ని పాఠశాలల్లో ప్రాథమిక బడుల నుంచి వెళ్లిన విద్యార్థులతో ఉన్నత పాఠశాలల్లో వసతులు సరిపడక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అదే ప్రాథమిక పాఠశాలల్లో తరగతులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇదే సమయంలో వచ్చే విద్యా సంవత్సరం ఈ ప్రక్రియను మరింత వేగంగా అమలు చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది బడుల మధ్య దూరాన్ని పెంచేలా కసరత్తు చేస్తోంది. ఒకటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో విలీనం చేయడానికి అనువైన పాఠశాలలు ఎన్ని, ఆ విధంగా అయితే ఉన్నత పాఠశాలలకు ఎంతమంది విద్యార్థులు వెళ్లే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల సంఖ్య తదితర అంశాలపై అధికారుల నుంచి ప్రభుత్వం నివేదికలు కోరుతోంది. l జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కిలోమీటరు దూరంలోని 300కుపైగా ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను ఉన్నత బడుల్లో విలీనం చేయాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలైతే ఈ విద్యా సంవత్సరం విలీనం అయిన 307 పాఠశాలలకు మరో 300 అదనం కానున్నాయి. అదే 2, 3 కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలను విలీనం చేస్తే మరో ఐదువందలకుపైగా బడులు విలీనం కానున్నాయి. ప్రస్తుతం కాగితాలకే పరిమితమైన ఈ అంచనాల వ్యవహారం వచ్చే ఏడాది అమలుకు సిద్ధమైతే విద్యార్థులు తమ పాఠశాలలను మార్చుకోవాల్సి ఉంటుంది. l ప్రాథమిక పాఠశాలల విలీనం వలన డ్రాపౌట్స్‌ పెరుగుతాయని ప్రాథమిక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. l ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారి శైలజ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం 250 మీటర్లలోపు ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశామని తెలిపారు. 1, 2, 3 కిలోమీటర్ల దూరంలో పాఠశాలల విలీనం చేయాల్సి వస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తనున్నాయన్న అంశాలపై ఉన్నతాధికారులు వివరాలు సేకరించమన్నారని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు అడిగిన సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని