logo

వృథా నీరు...అరికట్టేదెవరు!

ఏకశిలానగరి చెరువు కట్ట రాళ్ల మధ్యలో నుంచి నీరు కారుతూ బయటికి వస్తోంది. కొన్ని రోజులుగా ఇలా జరుగుతున్నా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రామతీర్థం వద్ద తటాకం అంతర్భాగం నుంచి జలాలు కారిపోతున్నా అడ్డుకట్ట వేయలేదు. అయితే 2001 అక్టోబరు 2న వచ్చిన

Published : 15 Jan 2022 02:34 IST

మరమ్మతులు పట్టని అధికారులు

ఒంటిమిట్ట చెరువు కట్ట మధ్యలో కారుతున్న జలధార


చెరువు కట్ట రాళ్ల మధ్యలో బయటికి వస్తున్న నీరు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఏకశిలానగరి చెరువు కట్ట రాళ్ల మధ్యలో నుంచి నీరు కారుతూ బయటికి వస్తోంది. కొన్ని రోజులుగా ఇలా జరుగుతున్నా అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రామతీర్థం వద్ద తటాకం అంతర్భాగం నుంచి జలాలు కారిపోతున్నా అడ్డుకట్ట వేయలేదు. అయితే 2001 అక్టోబరు 2న వచ్చిన వరదలతో రామతీర్థం వద్ద చెరువు మట్టి దెబ్బతింది. అప్పట్లో అధికారులు, రైతులు అప్రమత్తమై బాగు చేయించారు. కడప-రేణిగుంట రహదారి విస్తరణ, అభివృద్ధిలో భాగంగా కట్టను మునుపటి కంటే మరింత బలోపేతం చేశారు. కాకపోతే కోనేరు ఎగువన గతంలో ఎక్కడైతే దెబ్బతిందో అక్కడి నుంచే కట్ట మధ్యలో రాళ్ల నుంచి కొన్నిరోజులుగా జలధార బయటికి వస్తోంది. రామ, లక్ష్మణ తీర్థాల చెంతకు వెళ్లడానికి తాపలు నిర్మించారు. కట్టకు మధ్యలో పిట్ట గోడను ఏర్పాటు చేశారు. మొక్కలు, తీగజాతి ఆకులు అల్లుకున్నాయి. దాంతో నీరు వృథాగా పోతున్నట్లు గుర్తించడం లేదు. మరిన్ని రోజులపాటు నీరు వృథాగా పోతే కట్ట మరింత బలహీనమై పెను ముప్పు జరిగే అవకాశం ఉందని అన్నదాతలు వాపోతున్నారు.

అడ్డుకట్ట వేయాలి..

తటాకం అంతర్గత భాగం నుంచి నీటి ఊట బయటికి రాకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. నీరు కారుతున్న కట్ట ప్రాంతాన్ని గత నెల 20న జలవనరుల శాఖ కడప రెగ్యులర్‌ డివిజన్‌ కార్యనిర్వాహక సాంకేతిక అధికారి వెంకట్రామయ్య, ఏఈ సుదర్శన్‌ పరిశీలించారు. రెండు వారాలు దాటినా ఇక్కడ ఎలాంటి కదలిక లేదు. పనులు చేసినా బిల్లులు సకాలంలో రావని గుత్తేదారులు కూడా చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఇప్పటికైనా జలవనరుల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై ఈఈ వెంకట్రామయ్యను వివరణ కోరగా చెరువు కట్ట మధ్య భాగంలో నీరు కారుతున్నట్లు తమ పరిశీలనలో గుర్తించినట్లు చెప్పారు. వెంటనే బాగు చేయిస్తామన్నారు.

గత నెల 20న లీకేజీ ప్రాంతాన్ని ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఈఈ వెంకట్రామయ్య (దాచిన చిత్రం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని