logo

పద్దు మారక... వైద్యం పడక

ప్రజారోగ్య పరిరక్షణలో కీలమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ)ల నిర్వహణపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. వీటిని కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దుతున్నామని, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉంచి రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని పాలకులు పదేపదే చెబుతున్నారు.

Published : 17 Jan 2022 04:30 IST

పీహెచ్‌సీల అభివృద్ధిపై నీలినీడలు


ఇది బి.కోడూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం. ఈ ఆసుపత్రి ఖాతాలో అభివృద్ధి నిధులు రూ.30,000 ఉన్నాయి.
ఇదే సందర్భంలో ఆరు నెలలుగా వినియోగించిన రూ.50,000 బిల్లులను మంజూరు చేయలేదు. 

పోరుమామిళ్ల, బి.కోడూరు, న్యూస్‌టుడే  ప్రజారోగ్య పరిరక్షణలో కీలమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ)ల నిర్వహణపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. వీటిని కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దుతున్నామని, ఆధునిక పరికరాలు అందుబాటులో ఉంచి రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని పాలకులు పదేపదే చెబుతున్నారు. వాస్తవంలో వీటికి అవసరమైన నిర్వహణ, అభివృద్ధి నిధులను అందుబాటులో ఉంచే విషయంలో జాప్యం చోటుచేసుకుంటోంది. కొత్తగా మంజూరు అటుంచితే అందుబాటులో ఉన్న నిధులు కూడా వెనక్కి తీసుకుంటున్నారని వైద్యులు ఆవేదన చెందుతున్నారు. హెచ్‌డీఎస్‌ పద్దు కింద జిల్లావ్యాప్తంగా వీటికి గతంలో మంజూరైన నిధుల్లో లక్షల మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు మళ్లించారు. ఇదే సందర్భంలో వాటి ఖర్చులకు చేసిన బిల్లులు మంజూరుకాకపోవటం విమర్శలకు దారితీస్తోంది. 
* జిల్లాలో 75 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 629 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ప్రజారోగ్య పరిరక్షణలో వీటి సేవలు కీలకం. 
* వీటి అభివృద్ధికి ఏటా ఆర్‌సీహెచ్‌-2, హెచ్‌డీఎస్‌ నిధులు మంజూరు చేస్తారు. ఇందులో ఆసుపత్రి అభివృద్ధికి హెచ్‌డీఎస్‌ (ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ) కింద ఏటా రూ.1.75 లక్షలు చొప్పున మంజూరు చేస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని 75 పీహెచ్‌సీలకు రూ. 1.31 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులను పీహెచ్‌సీ అభివృద్ధి, అత్యవసరమైన వైద్య పరికరాల కోసం వినియోగించాల్సి ఉంది. 

* ఈ నిధులను పీడీ ఖాతాల్లో జమ చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ పద్దు కింద సత్వరం బిల్లులు చెల్లించటంలేదు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులు, వైద్యులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. పరిష్కరించేందుకు వీలుగా ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి యూనియన్‌ బ్యాంకులో సున్నా ఖాతాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పీహెచ్‌సీల నిర్వాహకులు సున్నా ఖాతాలను ప్రారంభించారు. ఇదే సందర్భంలో పీహెచ్‌సీల్లోని 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయని నిధులను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వినియోగించని నిధులను ప్రభుత్వ ఖాతాలోకి జమచేయాలని కోరారు. ఇలా దారి మళ్లిన నిధులు సున్నా ఖాతాల్లోకి జమచేస్తారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆ నిధులను ఎప్పుడు సున్నా ఖాతాల్లోకి జమ చేస్తారో తెలియని పరిస్థితి. 
* ఏటా జూన్‌-జులై నెలల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల అభివృద్ధికి రూ.1.75 లక్షల చొప్పున మంజూరు చేస్తారు. సంవత్సర కాలం నుంచి నిధులే మంజూరు కాలేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీడీ ఖాతాల్లో నిధులు ఉన్నాయని వైద్యులు సొంతంగా ఖర్చు పెట్టారు. ప్రస్తుతం బిల్లులు చేసేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. దీంతో వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనవరి వచ్చినా ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. ఉన్న నిధులను వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. సేవలు మెరుగు పరచాలన్నా నిధులు అవసరం ఉంది. అన్నింటినీ సున్నా ఖాతాలుగా మార్చి నిధులు జమ చేస్తారని ఈ ప్రక్రియ జరిగేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. 

పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రమిది. ఇక్కడ ఆసుపత్రి అభివృద్ధికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. ఆస్పత్రి ఖాతాలో ఉన్న నిధులను కూడా వెనక్కి తీసుకున్నారు. నాడు-నేడు కార్యక్రమం కింద ఆసుపత్రిని ఆధునికీకరించారు. ఒక్కటే పడక ఉంది. అది కూడా చిరిగిపోయి వినియోగానికి పనికిరాకుండా ఉంది. 

అందుబాటులోని నిధులు 
అట్లూరు పాథ్రమిక ఆరోగ్యకేంద్రంలో రూ. 2.75 లక్షలు ఖర్చు చేయకుండా మిగిలిపోయి ఉన్నాయి. వీటిని సున్నా ఖాతాలోకి జమ చేసిన తరువాతనే వ్యయం చేయటానికి అవకాశం ఉంది. ఖాతాలకు నిధులు జమ అయ్యే వరకు బిల్లులు మంజూరుకావని వైద్యులు పేర్కొంటున్నారు. 
* తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఖాతాలో రూ. 4 లక్షల నిధులు ఉన్నాయి. వీటి వినియోగానికి ప్రస్తుతం అడ్డంకులు ఎదురవుతున్నాయి.
* కలసపాడు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పరిధిలో హెచ్‌డీఎస్‌ మిగులు నిధులతో రూ. 35,000 వెచ్చించి కంప్యూటర్లు కొనుగోలు చేశారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కొనుగోలుకు వీలుగా రూ.75,000 బిల్లులను పీడీ ఖాతాలకు పెట్టినా మంజూరు కాలేదు.
ఆందోళన అనవసరం 
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వస్తున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వైద్యఆరోగ్యశాఖలో జీరో ఖాతాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. నిధులు వెనక్కి వెళ్లడం కాదు. జీరో ఖాతాల్లో జమ చేస్తారు. వైద్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- శేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌ంవో, రాజంపేట 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు