logo

పీఆర్సీపై తగ్గేదేలే!

‘ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్‌ 27 శాతం కన్నా అధికంగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. పాత శ్లాబుల హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలి. పీఆర్సీ అయిదేళ్లకొకసారి ఉండేటట్లు నిర్ణయం తీసుకోవాలి. సీపీఎస్‌ రద్దుపై స్పష్టమైన ఉత్తర్వులివ్వాలి’ అంటూ ఉపాధ్యాయులు గళమెత్తారు. ప్రభుత్వ

Published : 21 Jan 2022 01:56 IST

కలెక్టరేట్‌ను ముట్టడించిన వేలాదిమంది ఉపాధ్యాయులు

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు

ఉద్రిక్త పరిస్థితుల మధ్య తోపులాటలు... వాగ్వాదాలు

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఫ్యాప్టో నాయకుల అరెస్టు

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

‘ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్‌ 27 శాతం కన్నా అధికంగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. పాత శ్లాబుల హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలి. పీఆర్సీ అయిదేళ్లకొకసారి ఉండేటట్లు నిర్ణయం తీసుకోవాలి. సీపీఎస్‌ రద్దుపై స్పష్టమైన ఉత్తర్వులివ్వాలి’ అంటూ ఉపాధ్యాయులు గళమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాలపై తమ వ్యతిరేకతను చాటారు. అర్ధరాత్రి తీసుకొచ్చిన ఏకపక్ష జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని, తప్పుడు ప్రకటనలు మానుకుని మెరుగైన పీఆర్సీ అమలయ్యేవిధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. - న్యూస్‌టుడే, కడప విద్య, జిల్లా సచివాలయం

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ పీఆర్సీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాదిమంది ఉపాధ్యాయులు గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల నుంచి జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. మహావీర్‌ కూడలి నుంచి కలెక్టర్‌ కార్యాలయం మీదుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) రహదారిని పోలీసులు బారికేడ్లతో మూసి వేశారు. కలెక్టర్‌ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద రహదారిపైనే పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు బైఠాయించి పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఫ్యాప్టో నాయకులు, ఉపాధ్యాయులకు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వీరందరినీ పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజాను పోలీసులు పోలీసుస్టేషన్‌కు తరలించగా, ఫ్యాప్టో జిల్లా కోఛైర్మన్‌, ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌ కంభం బాలగంగిరెడ్డిని గురువారం ఉదయమే గృహనిర్బంధం చేశారు. ముట్టడి కార్యక్రమానికి ఆర్‌యూపీపీ, ఆర్జేయూపీ, ఏపీసీపీఎస్‌ఈఏ, ఏపీసీపీఎస్‌యూఎస్‌, రూట, ఆపస్‌, ఏపీపీఈటీ, ఎస్‌ఏపీఈటీ, పీఆర్టీయూ, ఏపీటీజీ, పీడీ సంఘాల నాయకులు మద్దతు పలికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, సెక్రటరీ జనరల్‌ హరిబాబు, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరాజు, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు కొండూరు శ్రీనివాసరాజు, రామకృష్ణమరాజు, ఆర్జేయూపీ రాష్ట్ర నాయకుడు గునిశెట్టి శ్రీనివాసులు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఫ్యాప్టో జిల్లా కోఛైర్మన్లు జాబీర్‌, రమణారెడ్డి, అబ్దుల్లా, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్‌, రాష్ట్ర మున్సిపల్‌ విభాగం కన్వీనర్‌ రవిశంకర్‌రెడ్డి, బీటీఏ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రామచంద్ర, వివిధ సంఘాల నాయకులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పింఛనుదారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న ఉపాధ్యాయినులు

‘ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదు’

ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమం చేస్తున్న ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఈశ్వరయ్య, చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. పెన్షన్‌దారులు నష్టపోయే విధంగా ప్రభుత్వం పీఆర్సీ జీవోలు విడుదల చేసిందని, దీంతో ఉద్యోగులలో ఆందోళనలు అధికమై కలెక్టరేట్‌ల ముట్టడితో మిన్నంటాయన్నారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా విడుదల చేసిన జీవోలను వెనక్కి తీసుకుని, మెరుగైన పీఆర్సీ ఇవ్వాలన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం

పీఆర్సీలో జరిగిన అన్యాయాన్ని సరిచేయకపోతే భవిష్యత్తులో మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేస్తాం. ఐఆర్‌ 27 శాతం కన్నా అధిక శాతంతో ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. పాత హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను యధావిధిగా కొనసాగించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు సీపీఎస్‌ విధానం రద్దు చేయాలి. న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. - సుబ్బారెడ్డి, జిల్లా ఛైర్మన్‌, ఫ్యాప్టో

ప్రభుత్వం పునరాలోచన చేయాలి

ఉపాధ్యాయుల ఉద్యమ తీవ్రతను చూసైనా పీఆర్సీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. న్యాయంగా రావాల్సిన డీఏలు, ఐఆర్‌ కొనసాగించాలి. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి. అయిదేళ్లకొకసారి రావాల్సిన పీఆర్సీని పదేళ్లకు పొడిగించడానికి ప్రభుత్వానికున్న హక్కు ఏమిటి? గత ప్రభుత్వాల హయాంలో పోరాడి సాధించుకున్న పలు సౌలభ్యాలను కోల్పోవడమే 11వ పీఆర్సీ ఉద్దేశమా? రెండేళ్లు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమర్పించిన అశుతోష్‌మిశ్రా నివేదికను బయటకు ఇవ్వడానికి భయమెందుకు? సీపీఎస్‌ రద్దు హామీ ఏమైంది ? రెండేళ్లకే టైమ్‌స్కేల్‌ పొందాల్సిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో 9 నెలలకు వాయిదా వేయడం ధర్మమా ? ఒప్పంద,. పొరుగుసేవల ఉద్యోగులు ఉద్యోగ భద్రతకు ఎంతకాలం ఎదురుచూడాలి? న్యాయంగా రావాల్సిన డీఏలను పీఆర్సీగా చూపించి మభ్యపెట్టడం సమంజసమేనా? ప్రభుత్వం ఉద్యోగ సంఘ నాయకులను చర్చలకు ఆహ్వానించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. - కత్తి నరసింహారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

ప్రభుత్వ నిరంకుశ ధోరణి సరికాదు

ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించడం సరికాదు. పీఆర్సీకి సంబంధించి ఏకపక్షంగా జీవోలు విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రివర్స్‌ పీఆర్సీ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాడతాం. బకాయి డీఏలిచ్చి జీతాలు తగ్గవని చెప్పడం హాస్యాస్పదం. ఇది పే రివర్స్‌ కమిషన్‌లా ఉంది. పాత శ్లాబుల ప్రకారమే హెచ్‌ఆర్‌ఏ కొనసాగించాలి. - జాబీర్‌, జిల్లా కోఛైర్మన్‌, ఫ్యాప్టో

స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులను 11వ పీఆర్సీ తీవ్రంగా నిరాశపరిచింది. 17.01.2022న విడుదలైన 1,2,9 జీవోలను పూర్తిగా రద్దు చేయాలి. ఇవి చాలా మోసపూరితంగా ఉన్నాయి. తక్షణమే రద్దు చేసి మెరుగైన పీఆర్సీకి జీవోలివ్వాలి. లేకపోతే ఉద్యమం తీవ్రతరం కాకతప్పదు. ప్రభుత్వం తన నిర్ణయాలపై పునఃసమీక్షించాలని డిమాండు చేస్తున్నాం. - కంభం బాలగంగిరెడ్డి, జిల్లా కోఛైర్మన్‌, ఫ్యాప్టో

అరెస్టులు అప్రజాస్వామికం

కలెక్టరేట్‌ ముట్టడికి బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేయడం అప్రజాస్వామికం. ఎక్కడికక్కడ పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా వేల మంది ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొని విజయవంతం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను అణచివేయాలని చూడడం సరికాదు. - శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్‌లోకి వెళ్తున్న గురువులు

పోలీసులు ఏర్పాటు చేసిన ఇనుప కంచె వద్ద ఉపాధ్యాయినుల నిరసన

బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న

ఉపాధ్యాయులను అడ్డుకుంటున్న పోలీసులు

ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని