logo

ఖేలో ఇండియా...ఒక్క అడుగూ పడలే!

ఖేలో ఇండియా ప్రాజెక్టు కింద రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక పాఠశాల డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రాష్ట్ర క్రీడాపాఠశాల. ఈ ప్రాజెక్టు కింద అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పాటు జాతీయ శిక్షకులొస్తారని, క్రీడాపాఠశాలకు మహర్దశ పట్టనుందని గత 15 నెలలుగా క్రీడాకారులు

Published : 21 Jan 2022 01:56 IST

కలగానే మిగిలిపోతున్న ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌

15 నెలలుగా పట్టించుకోని క్రీడాధికారులు

హాకీ సాధన చేస్తున్న క్రీడాకారులు (దాచిన చిత్రం)

ఖేలో ఇండియా ప్రాజెక్టు కింద రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక పాఠశాల డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రాష్ట్ర క్రీడాపాఠశాల. ఈ ప్రాజెక్టు కింద అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పాటు జాతీయ శిక్షకులొస్తారని, క్రీడాపాఠశాలకు మహర్దశ పట్టనుందని గత 15 నెలలుగా క్రీడాకారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కింద ఒక్క అడుగూ పడకపోవడం గమనార్హం. - న్యూస్‌టుడే, కడప క్రీడలు

కేంద్ర ప్రభుత్వ నిధులతో మూడేళ్ల పాటు నిర్వహించే ఖేలో ఇండియా స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కింద కడప క్రీడా పాఠశాల ఎంపికైంది. దేశ వ్యాప్తంగా మొత్తం పది ప్రాంతాలను కేంద్రం ఎంపిక చేయగా, అందులో రాష్ట్ర నుంచి ఒక్క క్రీడా పాఠశాలకే స్థానం దక్కింది. ప్రాజెక్టు కింద భవిష్యత్తులో అత్యున్నత ప్రమాణాలతో క్రీడలు అభివృద్ధి చెందడమే కాకుండా జాతీయ స్థాయి పోటీలకు కడప వేదిక కానుంది. కేంద్ర యువజన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో భారత క్రీడా ప్రాధికార సంస్థ ఖేలో ఇండియా స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కింద దేశంలోని పలు క్రీడా పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తుంది. మూడేళ్ల పాటు క్రీడలకు కావాల్సిన నిధులు, శిక్షకులను నియమించడం, మౌలిక వసతులను కల్పించడం తదితర సౌకర్యాలను భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్‌) ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే 2020-21 సంవత్సరానికి కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ దేశంలోని 10 క్రీడా పాఠశాలలకుగానూ రాష్ట్రం నుంచి జిల్లాలోని డాక్టరు వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాల ఒకటిగా ఎంపిక చేస్తూ 2020, అక్టోబరు 16న ఉత్తర్వులు విడుదల చేసింది.

ఏటా రూ.3 కోట్లు

ఖేలో ఇండియా ప్రాజెక్టుకు కడప క్రీడా పాఠశాల ఎంపిక కావడంతో ఏటా రూ.3 కోట్ల నిధులను శాయ్‌ విడుదల చేస్తుంది. నిధులతో జాతీయ శిక్షకులు, అత్యున్నత క్రీడాపరికరాలు, మైదానాలు, స్పోర్ట్స్‌ సైన్సెస్‌ అభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా మూడేళ్ల పాటు ఈ నిధులను వెచ్చించి జాతీయ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావడంతో పాటు ఇండోర్‌ స్టేడియం, బాస్కెట్‌బాల్‌, అన్ని ఆటలు అభివృద్ధి చెందుతాయి. నిష్ణాతులైన శిక్షకుల పర్యవేక్షణలో తర్ఫీదు పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏటా దేశంలో జరిగే ఖేలో ఇండియా క్రీడా పోటీలను కూడా క్రీడాపాఠశాలలో నిర్వహించే వీలుంటుంది. క్రీడాశిబిరాల నిర్వహణకు అవకాశం ఉంటుంది.

ప్రత్యేక శిక్షకులొచ్చారు

ఖేలో ఇండియా ప్రాజెక్టులో భాగంగా వెయిట్‌లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌ క్రీడాంశాలకు ప్రత్యేక శిక్షకులతో పాటు న్యూట్రిషనిస్ట్‌, ఫిజియోథెరపిస్ట్‌, మస్సాజర్‌ ప్రతినిధులు వచ్చారు. ప్రస్తుతం ఉన్న శిక్షకులతోనే శిక్షణ నడుస్తోంది. భవిష్యత్తులో మరింత విస్తరిస్తాం. - ఎం.రామచంద్రారెడ్డి, స్టెప్‌ సీఈవో, క్రీడా పాఠశాల ప్రత్యేకాధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని