logo

ఓటీఎస్‌ అనిపించాలని...

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకుని నిర్మించుకున్న ఇళ్లకు ‘జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం’ ద్వారా ఏకకాలం చెల్లింపులు (ఓటీఎస్‌) పేరుతో చేపట్టిన వసూళ్లకు ప్రభుత్వం అతివల అప్పు సర్దుబాటు అస్త్రం ప్రయోగించింది. మహిళలకు డ్వాక్రా రుణం

Published : 21 Jan 2022 01:56 IST

మహిళలకు డ్వాక్రా రుణాల మంజూరు

ఏకకాల చెల్లింపులకు ఆ సొమ్మే వసూలు

మండలానికి 200 మంది లబ్ధిదారుల లక్ష్యం

ముందుకు రావాలంటూ వనితలపై ఒత్తిడి

- న్యూస్‌టుడే, రాజంపేట పట్టణం

లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తున్న అధికారులు

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా రుణం తీసుకుని నిర్మించుకున్న ఇళ్లకు ‘జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం’ ద్వారా ఏకకాలం చెల్లింపులు (ఓటీఎస్‌) పేరుతో చేపట్టిన వసూళ్లకు ప్రభుత్వం అతివల అప్పు సర్దుబాటు అస్త్రం ప్రయోగించింది. మహిళలకు డ్వాక్రా రుణం మంజూరు చేసి జమ చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. తొలుత గుర్తించిన లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తారని ఆశిస్తే.. క్షేత్రస్థాయిలో స్పందన తక్కువగా వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళా స్వయం సహాయ సంఘాల సభ్యుల ద్వారా రాబట్టుకునేందుకు అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రతి మండలం నుంచి 200 మంది ద్వారా రాబట్టాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదు. కేవలం నోటి మాటను పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారుల ద్వారా ఒత్తిడి పెంచినా కొన్ని మండలాల్లో చాలామంది స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం గమనార్హం.

అప్పు తీసుకోండి... జమ చేయండి

పేద, మధ్యతరగతి వర్గాల లబ్ధిదారుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడంతో లక్ష్యం చేరుకోవడం కష్టమని భావించిన అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. సామాజిక పెట్టుబడినిధి, గ్రామ, మండల సమాఖ్య, పొదుపు నిల్వలు, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.10 వేలు ఇస్తామని, ఓటీఎస్‌కు జమ చేయాలని క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఒత్తిడి పెంచింది. ఊరూరా పర్యటించి కొన్ని మండలాల్లో రూ.10 వేలు పరపతిని నగదు రూపంలో డ్వాక్రా సభ్యులకు అందజేశారు. అక్కడే గ్రామ సచివాలయాల సిబ్బంది ద్వారా వసూలు చేసే ప్రక్రియను సైతం చేపట్టారు. మరికొన్ని మండలాల్లో ఆన్‌ లైన్‌ రూపంలో సర్దుబాటు చేశారు. అయినా కొన్నిచోట్ల 50 శాతం ప్రగతి సాధించలేదు. ఒంటిమిట్ట మండలంలో 200 మందికి 81 మంది, రాజంపేట మండలంలో 89, నందలూరులో 87, సిద్దవటంలో 73 మంది ముందుకొచ్చారు. మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా తీసుకున్న రుణాన్ని 10, 24, 36 నెలల్లో కంతులు చెల్లించేవిధంగా ప్రణాళికను రూపొందించారు. ధనాగారాల్లో పరపతి పొందితే 9 శాతం, పొదుపు ద్వారా రుణం తీసుకుంటే 12 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఈ భారం ఎలా భరించాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

అధికారుల తీరుతో కినుక

డ్వాక్రా సంఘాల సభ్యులను ఓటీఎస్‌ అమలులో భాగస్వాములను చేయాలని ఉన్నతాధికారులు మౌఖికంగా డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. సంక్రాంతి పండగకు ముందు లక్ష్యాలను నిర్దేశించారు. వెనుకబడిన మండలాలను గుర్తించి అక్కడి సిబ్బందిని గట్టిగా మందలించినట్లు సమాచారం. పనిచేస్తే చేయండి.. లేదంటే వెళ్లిపోండి అనే ధోరణిలో మాట్లాడటంతో సిబ్బంది తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. అధికారిక ఉత్తర్వులివ్వకుండా నోటి మాటగా చెబితే ఎలా ముందుకెళ్లాలని సీనియర్‌ అధికారి ఒకరు వాపోయారు. జిల్లాలో లక్ష్యాలు చేరుకోని 29 మంది సచివాలయ సిబ్బందికి సంజాయిషీ తాఖీదులు జారీ చేసినట్లు తెలిసింది.

ఎవరిపై ఒత్తిడి తీసుకురాలేదు - ఎ.మురళీమనోహర్‌, పీడీ, డీఆర్‌డీఏ

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలులో భాగంగా ఏకకాల చెల్లింపులకు డ్వాక్రా సంఘాల సభ్యులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి నగదు చెల్లించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి రుణాలు మంజూరు చేయించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని