logo

కాసుల వేట...ప్రైవేటు కోత!

అమ్మ అవ్వాలని ప్రతి మహిళ కల. ఎన్ని కష్టాలనైనా అనుభవించి బిడ్డకు ఆరోగ్యకరమైన జన్మనివ్వాలని ఆరాట పడతుందామె. ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తలు పాటించి ప్రసవానికి సిద్ధమవుతారు. వారికిది ఒక అపురూప ఘట్టం. దీనిని ప్రైవేటు ఆసుపత్రులు

Published : 21 Jan 2022 01:56 IST

మాతృత్వంతో వ్యాపారం... సిజేరియన్లకే ప్రాధాన్యం

అధిక వసూళ్లపై దృష్టి సారించని అధికారులు

పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థిక భారం

న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు వైద్యం

అమ్మ అవ్వాలని ప్రతి మహిళ కల. ఎన్ని కష్టాలనైనా అనుభవించి బిడ్డకు ఆరోగ్యకరమైన జన్మనివ్వాలని ఆరాట పడతుందామె. ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తలు పాటించి ప్రసవానికి సిద్ధమవుతారు. వారికిది ఒక అపురూప ఘట్టం. దీనిని ప్రైవేటు ఆసుపత్రులు డబ్బుతో ముడి పెట్టడం సమాజాన్ని బాధిస్తోంది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండేందుకు కుటుంబ సభ్యులు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. దీనిని అందిపుచ్చుకుని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు కాసుల పంట పండిస్తున్నారు. ఇష్టానుసారంగా శస్త్రచికిత్సలు (సిజేరియన్లు) చేస్తున్నారు. వీటి విషయంలో ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనను ఆసుపత్రులు పాటించడం లేదని తెలుస్తోంది. అధికారులు వీటిపై దృష్టి సారించక పోవడంతోనే ప్రైవేటు కాన్పుల ఆసుపత్రులు డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పేద, ధనిక తేడా లేకుండా శస్త్రచికిత్సలు చేసి బాధితుల నుంచి రూ.వేలకు వేలు గుంజుతున్నారని బాధితులు వాపోతున్నారు. పలు ఆసుపత్రుల్లో చివరి నిమిషంలో వివిధ కారణాలు చూపి గర్భిణి బంధువులను భయానికి గురిచేసి శస్త్రచికిత్సే మార్గంగా చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసేదేమి లేక వైద్యులు చెప్పిన దానికి తలూపి డబ్బును సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు.

ప్రసవానికి రూ.50 వేలు వసూలు

సిజేరియన్‌ కాన్పుకు పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రసవమైతే రూ.20 వేల వరకు తీసుకుంటున్నారు. దీంతో పోలిస్తే సిజేరియన్‌కే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తుండటంతో అవసరం లేకున్నా శస్త్రచికిత్సకే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో దాదాపుగా సిజేరియన్‌ కాన్పు జరగవచ్చని అంచనాతో ముందే దానికి సరిపడా నగదును సిద్ధం చేసుకుంటున్నామని పలువురు చెబుతున్నారు. మొదటిసారి సిజేరియన్‌ జరిగితే రెండవ సారి గర్భం దాల్చినపుడు దాదాపుగా సిజేరియన్‌ చేయాలి.

నైపుణ్యం తగ్గిందా... డబ్బు కోసమే చేస్తున్నారా?

అధునాతన వైద్యం అందుబాటులో లేని రోజుల్లో ఇళ్ల వద్దే సాధారణ కాన్పులు జరిగేవి. అనుభవం కలిగిన వారే (మంత్రసానులు, ఏమీ చదువుకోని వారు) సాధారణ ప్రసవాలు చేసేవారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తల్లీబిడ్డను దక్కించుకోవడం కష్టంగానే ఉండేది. ప్రస్తుతం అధునాతన వైద్య విధానాలు, సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నా ఎక్కువ శాతం సాధారణ ప్రసవాలు జరగడంలేదు. కాన్పు కూడా యాంత్రికంగా మారిపోయింది. తల్లీబిడ్డ ప్రాణాలకు హాని కలిగినప్పుడో, ఉమ్ము నీరు పోయినప్పుడో, బిడ్డ అడ్డంగా తిరిగినప్పుడో ఇలా తప్పని పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్‌కు మోగ్గు చూపాలి. అయితే పలువురు వైద్యులు అవసరం లేకున్నా సిజేరియన్‌ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గర్భంలో ఉన్న శిశువును క్షుణ్ణంగా పరిశీలించే స్కానింగ్‌ పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. పలుమార్లు బిడ్డ స్థితిగతులను తెలుసుకుంటున్నారు. సకల సదుపాయాలతో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ కూడా సాధారణ ప్రసవాలు తగ్గిపోతుండటంతో నైపుణ్యం తగ్గిందా? లేక డబ్బు కోసమే శస్త్రచికిత్సలు చేస్తున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. చేసిన ప్రసవాల సంఖ్యలో 30 శాతం వరకు మాత్రమే సిజేరియన్‌ కాన్పులు ఉండాలనే నిబంధన ఉంది. అయితే చాలా వరకు ఆసుపత్రులు దానికి భిన్నంగా చేస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో సైతం సిజేరియన్ల శాతం ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పటికీ సాధారణ ప్రసవాలకు పేరు మోసిన ప్రైవేటు ఆసుపత్రులు లేకపోలేదు. అవి చాలా తక్కువగా ఉన్నాయి.

తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 శాతం మాత్రమే శస్త్రచికిత్స ప్రసవాలు చేయాలి. గరిష్టంగా 30 శాతం వరకూ చేయవచ్ఛు ప్రతి ఆసుపత్రిలో సిజేరియన్ల సంఖ్యను నమోదు చేసుకుంటాం. కొన్నిచోట్ల ఎక్కువ శాతం జరుగుతున్నాయి. ప్రతి సిజేరియన్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందనే పూర్తి వివరాలు సేకరిస్తాం. డీఎంహెచ్‌వో ఆసుపత్రులు తనిఖీ చేస్తుంటారు. వైద్యులకు సూచనలు చేస్తుంటాం. ఎక్కువ శాతం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. సిజేరియన్ల సంఖ్యను తగ్గించే దిశగా చర్యలు చేపడతాం. - రామేశ్వరుడు, డీసీహెచ్‌ఎస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని