logo

గండికోట ఉత్సవాలకు కొవిడ్‌ గండం

 జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో వరుసగా రెండోసారి వారసత్వ ఉత్సవాలు రద్దు కానున్నాయి.. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు. గండికోటలో ఏటా వారసత్వ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా

Published : 23 Jan 2022 02:32 IST

రెండూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు

ఈ నెల 25న జాతీయ పర్యాటక దినోత్సవం

గండికోటలోని జుమ్మా మసీదు అందాలు

- న్యూస్‌టుడే, జమ్మలమడుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో వరుసగా రెండోసారి వారసత్వ ఉత్సవాలు రద్దు కానున్నాయి.. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు. గండికోటలో ఏటా వారసత్వ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలోని కళాకారులు, సినీ ప్రముఖులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి కోట ఖ్యాతిని ఇనుమడింపజేసేవారు. కరోనా కారణంగా గతేడాది గండికోట ఉత్సవాలను రద్దు చేశారు. ఈ ఏడాది సైతం ఒమిక్రాన్‌ వ్యాప్తితో ఉత్సవాల రద్దుతోపాటు ఈ నెల 25న జాతీయ పర్యాటక దినోత్సవం సైతం జరపకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత శాఖాధికారులు తెలిపారు.

అయిదుసార్లు వారసత్వ ఉత్సవాలు...

గండికోటలో ఇప్పటి వరకు అయిదు సార్లు వారసత్వ ఉత్సవాలను నిర్వహించారు.తొలిసారి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2015, సెప్టెంబరు 26, 27, 28 తేదీల్లో జరిగాయి. ముందుగా రెండు రోజులే ఉత్సవాలను జరపాలనుకున్నారు. భారీ వర్షం కారణంగా మొదటి రోజు కార్యక్రమాలు జరగలేనందున మూడు రోజులపాటు జరపాల్సి వచ్చింది. రెండోసారి 2016లో జరిపేందుకు అధికారులు ప్రయత్నించినా వీలుకాకుండా పోయింది. 2016లో గండికోటలో ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పి ఎనిమిది సార్లు వాయిదా వేశారు. 2017, ఫిబ్రవరి 18, 19 తేదీల్లో రెండో సారి వారసత్వ ఉత్సవాలను నిర్వహించడంతో పర్యాటక ప్రియులు, స్థానిక కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. మూడోసారి 2018, జనవరి 21, 22, 23 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించారు. నాలుగోసారి 2019, ఫిబ్రవరి 9, 10 తేదీల్లో వైభవంగా నిర్వహించారు. అయిదోసారి 2020 జనవరి 11, 12 తేదీల్లో ఘనంగా నిర్వహించి కోట చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పారు. అప్పుడు అక్కడి వాతావరణం సంక్రాంతి పండగను తలపించింది. తొలిసారిగా 2015, సెప్టెంబరులో వారసత్వ ఉత్సవాలు ప్రారంభం కాగా, 2020 వరకు అయిదు సార్లు గండికోటలో వారసత్వ ఉత్సవాలను నిర్వహించారు. కరోనా కారణంగా 2021, 2022లో ఆరు, ఏడోసారి ఉత్సవాలకు కరోనాతో అంతరాయం ఏర్పడింది.

పర్యాటక దినోత్సవం... ఉత్సవాలు రద్దు

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న కారణంగా గండికోటలో వారసత్వ ఉత్సవాలు నిలిపివేస్తున్నాం. ఈ నెల 25వ తేదీన జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరిపేందుకు కలెక్టర్‌ అనుమతివ్వలేదు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆ రెండు ఉత్సవాలు రద్దు చేస్తున్నాం. - పి.రాజశేఖర్‌రెడ్డి, జిల్లా పర్యాటకశాఖ అధికారి, కడప

2019లో 9న నిర్వహించిన వారసత్వ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నృత్యం (దాచిన చిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని