logo

ఆర్టీసీ అద్దె బస్సుల దూకుడు

ఈనెల 18న కడప కోటిరెడ్డి కూడలి వద్ద ఆర్టీసీ అద్దెబస్సులో ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఎక్కారు. కొద్ది దూరం రాగానే డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఆమె బస్సులో నుంచి కింద పడి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మృతి చెందింది.

Published : 27 Jan 2022 01:45 IST

20 రోజుల్లో ఏడు ప్రమాదాలు


రాయచోటి వద్ద ప్రమాదానికి గురైన ఆర్టీసీ అద్దె బస్సు (దాచిన చిత్రం)

 న్యూస్‌టుడే, చిన్నచౌకు(కడప)* ఈనెల 18న కడప కోటిరెడ్డి కూడలి వద్ద ఆర్టీసీ అద్దెబస్సులో ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఎక్కారు. కొద్ది దూరం రాగానే డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఆమె బస్సులో నుంచి కింద పడి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మృతి చెందింది.
* ఈ నెల 22న రాయచోటి నుంచి చక్రాయపేటకు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు లక్ష్మీపురం వద్ద లారీని ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఆ సమయానికి బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు.
* జనవరి 14న ప్రొద్దుటూరు సమీపంలోని నాగులపల్లె వద్ద ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 
జిల్లా వ్యాప్తంగా ఎనిమిది డిపోల పరిధిలో 250 ఆర్టీసీ అద్దె బస్సులున్నాయి. ఈ బస్సుల చోదకులు తరచూ రోడ్డు ప్రమాదాలు చేస్తుండడంతో ఆర్టీసీకి చెడ్డపేరు వస్తోంది. ఈ నెలలో 20 రోజుల్లో ఏడు ప్రమాదాలు చేయగా అందులో ఇద్దరు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. అద్దె బస్సు డ్రైవర్లు నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆర్టీసీ డ్రైవర్లంటున్నారు. గతంలో ఏకదాటిగా ఒకే డ్రైవరు బస్సు నడిపేవాడు. దీంతో ప్రమాదాలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఆర్టీసీ యాజమాన్యం మూడు రోజుల ఒకరు, మరో మూడు రోజులు ఒకరు చొప్పున బస్సు నడపాలని సూచించారు. ఆ నిబంధన సక్రమంగా అమలు కావడం లేదు. హెవీ డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకుని ఒకటిన్నర సంవత్సరం అనుభవం కలిగి ఉన్న వారినే చోదకులుగా తీసుకోవాలి. చాలా మంది చోదకులకు అనుభవం లేదు. అద్దె బస్సు చోదకులకు తొలుత వారం రోజులు సంస్థ నిపుణులు శిక్షణ ఇస్తారు. ప్రయాణికులతో ఎలా ఉండాలి, డ్రైవింగ్‌ ఎలా చేయాలి, ఆర్టీసీ నిబంధనల గురించి వివరిస్తారు. ఇప్పుడు శిక్షణ తరగతులు నిర్వహించడం లేదు. మద్యం మత్తులో, చరవాణి మాట్లాడుతూ బస్సులు నడుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం
ప్రమాదం ఎవరు చేసిన ఒక్కటే. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ప్రమాదాలు చేస్తే వెంటనే వారిని తొలగించి వారి స్థానంలో అనుభవం ఉన్న వారిని నియమిస్తున్నాం. సంస్థ నిర్వహించే వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినే చోదకులుగా నియమిస్తున్నాం. ప్రతి రోజు జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.   - భాస్కర్, ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం అధ్యక్షుడు, కడప

వారిని పక్కన పెడుతున్నాం
ఆర్టీసీ అద్దె బస్సుల ప్రమాదాలు ఇటీవల పెరిగినది వాస్తవం. ప్రమాదాలపై దృష్టి పెట్టాం. ఎక్కువగా ప్రమాదాలు చేసే వారిని, చరవాణి మాట్లాడుతూ బస్సు నడిపే చోదకులను పక్కన పెడుతున్నాం. ప్రమాదాలు నివారణకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. - భాస్కర్, ఆర్టీసీ డిప్యూటీ సీఎంఈ, కడప 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని