logo

ఎస్సీ రుణ బకాయిలపై ప్రత్యేక దృష్టి

రుణ బకాయిల వసూలుపై ఎస్సీ కార్పొరేషన్‌ దృష్టిసారించింది. రుణ వసూళ్లకు జిల్లా అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. స్వయం ఉపాధికి రుణాలు పొంది తిరిగి చెల్లించని జాబితాను సిద్ధం చేశారు.  

Published : 27 Jan 2022 01:45 IST

వసూలుకు ప్రత్యేక బృందాల నియామకం

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : రుణ బకాయిల వసూలుపై ఎస్సీ కార్పొరేషన్‌ దృష్టిసారించింది. రుణ వసూళ్లకు జిల్లా అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. స్వయం ఉపాధికి రుణాలు పొంది తిరిగి చెల్లించని జాబితాను సిద్ధం చేశారు.  షెడ్యూల్డు కులాల సహకార సంఘం పరిధిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జాతీయ ఎస్సీల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ), 2015-16 నుంచి జాతీయ సఫాయి కర్మచారీల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ) పథకాన్ని 2016-17 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పట్లో రవాణా, రవాణేతర విభాగాల్లో స్వయం ఉపాధికి రుణాలు పొంది తిరిగి చెల్లించని వారి జాబితాను సిద్ధం చేశారు. వీరికి హామీనిస్తూ ష్యూరిటీ సంతకాలు చేసిన వారికి తాఖీదులు పంపిస్తున్నారు. రవాణా విభాగంలో కార్లు, ట్రాక్టర్లతో పాటు రవాణేతర విభాగంలో కిరాణా దుకాణాల ఏర్పాటుకు స్వయంఉపాధి యూనిట్లు మంజూరు చేశారు. సుమారు రూ.10 లక్షల వరకు రుణం మంజూరు చేశారు. ఇందులో రెండు శాతం లబ్ధిదారుడి వాటా కాగా, మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా రుణాలు మంజూరు చేశారు. అయిదేళ్లలోపు రుణాలను చెల్లించాలనే నిబంధనలను లబ్ధిదారులు ఉల్లంఘించారంటూ తాజాగా లబ్ధిదారులకు తాఖీదులు పంపించారు. జిల్లాలో రూ.10.48 కోట్లు వసూలు లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు రూ.3.54 కోట్లు మాత్రమే వసూలు కాగా, మిగిలిన రుణాల వసూలుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 447 మంది లబ్ధిదారులకుగాను 250 మందికి తాఖీదులు పంపారు. ఈ విషయమై ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డాక్టర్‌ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ రుణాల వసూలుకు చర్యలు చేపట్టింది వాస్తవమేనన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని