logo

అన్నమయ్యకురాయచోటిచ్చారు!

రాయచోటి పద కవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు ‘అన్నమయ్య’ పేరిట జిల్లా అవతరించబోతోంది. ప్రస్తుత జిల్లాలో రెండు పార్లమెంటు, పది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు, మూడు రెవెన్యూ డివిజన్లు, 51 మండలాలున్నాయి. కడప కేంద్రంగానే 34 మండలాలు,

Published : 27 Jan 2022 01:45 IST


 రాయచోటిలో శిథిలావస్థలో ఉన్న బ్రిటీష్‌ కాలం నాటి సబ్‌ కలెక్టరు కార్యాలయం

-ఈనాడు డిజిటల్, కడప, న్యూస్‌టుడే, రాయచోటి పద కవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు ‘అన్నమయ్య’ పేరిట జిల్లా అవతరించబోతోంది. ప్రస్తుత జిల్లాలో రెండు పార్లమెంటు, పది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు, మూడు రెవెన్యూ డివిజన్లు, 51 మండలాలున్నాయి. కడప కేంద్రంగానే 34 మండలాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా కేంద్రం ఉండనుంది. దీని పరిధిలో కడప, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లు ఉండగా, మూడోది బద్వేలు డివిజన్‌ కూడా ఆవతరించడానికి మార్గం సుగమమైంది. అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలోని పీలేరు (6), తంబళ్లపల్లె (6), మదనపల్లె (3)తో 15 మండలాలు, రాజంపేట (6), రైల్వేకోడూరు (5), రాయచోటి (6)తో 17 మండలాలు కలిపి మొత్తం 32 మండలాలు, కొత్తగా ఏర్పాటయ్యే రాయచోటితో పాటు రాజంపేట, మదనపల్లెతో కలిపి మూడు రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. నూతన జిల్లాలో అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక, ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట, బ్రిటీష్‌ కాలంలో జిల్లా కేంద్రంగా భాసిల్లిన సిద్దవటం కోట, శేషాచలం అడవులు, మంగంపేట ముగ్గురాయి గనులున్నాయి. 
జిల్లా ఆవిర్భావానికి కారణాలివే!
రాయచోటి జిల్లా ప్రధాన కేంద్రం కావడానికి పలు కారణాలు లేకపోలేదు. ప్రభుత్వం నియమించిన జిల్లా కమిటీ ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగానే పరిశీలించింది. ఇక్కడి మౌలిక వసతులు, పట్టణానికి అనుబంధంగా ఉన్న రహదారులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై సుదీర్ఘమైన నివేదిక ప్రభుత్వానికి చేరినట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు సమ దూర ప్రాంతంగా ఉంది. రైల్వేకోడూరు, మదనపల్లి మినహా మిగిలిన తంబళ్లపల్లె, పీˆలేరు, రాజంపేట నియోజకవర్గాలు ఇంచుమించు 55 కిలోమీటర్ల దూరం లోపే ఉన్నాయి. రాజంపేట- మదనపల్లి మధ్య 125 కిలోమీటర్ల దూరం ఉంది. జిల్లా కేంద్రంగా రాయచోటి ఎంపికతో సుమారు 60 కిలోమీటర్ల మేర దూరం తగ్గింది. రాయచోటి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం ఇటీవల సుమారు వెయ్యి ఎకరాల వరకు పట్టణ, గ్రామాల పరిసరాలలో ప్రభుత్వ స్థలాలను గుర్తించింది. రానున్న 30 ఏళ్ల అభివృద్ధి, విస్తరణను దృష్టిలో ఉంచుకుని వెలిగల్లు నుంచి రెండు బహృత్తర తాగునీటి పథకాలు రూపొందించారు. రోళ్లమడుగు నుంచి మరో పథకం పట్టణానికి సరిపడా నీరందించనుంది. జిల్లాలో మూడో ఆర్థిక, వ్యాపార రంగాలు బలపడిన పట్టణంగా పేరుంది. చిత్తూరు- కడప జాతీయ రహదారిపైనే రాయచోటి పట్టణం ఉంది. కొత్తగా ప్రతిపాదించిన నెల్లూరు- అనంతపురం రహదారి పట్టణ నడిబొడ్డున వెళ్లబోతోంది. ఇటీవల ప్రతిపాదించి టెండర్ల దశకు వచ్చిన రాయచోటి-చాగలమర్రి హైవేతో అనుసంధానం కానుంది. రాయచోటి పట్టణం 68.74 చ కి.మీ విసీˆ్తర్ణంతో చదునైన ప్రాంతాన్ని కలిగి ఉంది.
కార్యాలయాల ఏర్పాటుకు ప్రయత్నాలు
అంతా సవ్యంగా జరిగితే రానున్న ఉగాది నుంచి కొత్త జిల్లాలు అవతరించనున్నాయి. తాత్కాలిక భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పట్టణానికి సమీపంలోనే వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు సేకరించినా ఇప్పట్లో భవనాల నిర్మాణం సాధ్యమయ్యేది కాదు. జాతీయ రహదారికి అనుబంధంగా ఉండే విద్యాసంస్థలు లేదా ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. కొందరు భవనాలు ఇచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో భవనాల సమస్య తలెత్తే అవకాశం లేదని స్థానికుల అభిప్రాయం. బ్రిటీష్‌ పాలనలోనే రాయచోటిలో సబ్‌ కలెక్టరు కార్యాలయం ఉండేది. కొంత కాలానికి కడపకు తరలించారు. అప్పటి నుంచి రెవెన్యూ డివిజన్‌ కోసం ఎదురు చూస్తున్న రాయచోటి వాసులకు జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజన్‌ రావడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ఆశలు మొలకెత్తాయి. 

జిల్లా పేరు: అన్నమయ్య
జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు: రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె

రెవెన్యూ డివిజన్లు: రాజంపేట (11), రాయచోటి (10), మదనపల్లె (11) మొత్తం 
మండలాలు: 32
వైశాల్యం: 8,459 చ.కి.మీ
జనాభా: 17.68 లక్షలు
ఓటర్లు: 13,71,357 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని