logo

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నట్లు కలెక్టరు విజయరామరాజు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప పోలీసు మైదానంలో బుధవారం ఆయన జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

Published : 27 Jan 2022 01:45 IST

 కలెక్టరు విజయరామరాజు
 ఘనంగా గణతంత్ర దినోత్సవం


 మాట్లాడుతున్న  కలెక్టర్‌ విజయరామరాజు

ఈనాడు డిజిటల్, కడప, న్యూస్‌టుడే, సచివాలయం, చిన్నచౌకు (కడప)  జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నట్లు కలెక్టరు విజయరామరాజు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప పోలీసు మైదానంలో బుధవారం ఆయన జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘దేశంలోనే ఆదర్శవంతంగా అన్ని వర్గాల ప్రజలకు సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళుతున్నాం. ఆర్థిక రంగాన్ని కుదేలు చేసిన కొవిడ్‌ విపత్తును ప్రభుత్వం పటిష్టంగా అమలు చేసిన నియంత్రణ చర్యలతో సమర్థంగా ఎదుర్కొనగలిగాం. జిల్లాలో సాధారణ వర్షపాతం 647 మి.మీ కాగా.. అత్యధికంగా 1,008 మి.మీ నమోదుతో జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 64 శాతం అధికంగా నమోదైంది’ అని వివరించారు. 


కడప పోలీసు పరేడ్‌ మైదానంలో కవాతు చేస్తున్న పోలీసు సిబ్బంది  

* ‘జిల్లాలోని జలాశయాల్లో జలకళ సంతరించుకుంది. కరవు నివారణకు 12 నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఫలితంగా గండికోట జలాశయంలో పూర్తి సామర్థ్యంలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నాం. గండికోట జలాశయానికి కృష్ణా జలాలను తరలించడానికి రూ.604 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో కూడా తొలిసారిగా పూర్తి సామర్థ్యం మేరకు 10.29 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నాం’ అని తెలిపారు. 

* ‘ఉపాధిహామీ పథకం అనుసంధానంతో రూ.250 కోట్ల అంచనాతో 631 గ్రామ సచివాలయ భవనాలు, రూ.135 కోట్లతో 621 రైతు భరోసా కేంద్రాలు, రూ.88 కోట్లతో 500 వైఎస్‌ఆర్‌ గ్రామ ఆరోగ్య కేంద్రాలు, రూ.91.44 కోట్లతో 581 పాలసేకరణ భవనాలు, రూ.50.40 కోట్లతో 365 డిజిటల్‌ లైబ్రరీ కేంద్రాల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు. 

 *‘నాడు- నేడు పనుల కింద తొలి విడతలో 1,040 పాఠశాలల్లో 6,591 పనులు చేపట్టి రూ.275 కోట్లతో 6,584 పనులు పూర్తిచేశాం. రెండో విడతలో 789 పాఠశాలలు గుర్తించాం. అన్ని నియోజకవర్గాల్లో 32 ఆదర్శ పాఠశాలలను సిద్ధం చేశాం. రూ.125 కోట్లతో 1,040 అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. నవరత్నాలు కింద పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు చేపట్టాం. జల  సంరక్షణ చర్యల్లో భాగంగా జాతీయ స్థాయిలో మూడోసారి జాతీయ పురస్కారం అందుకున్నాం. జిల్లాలో రూ.603 కోట్ల పెట్టుబడితో వివిధ రకాలైన 7 ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలు స్థాపించి 7,491 మందికి ఉపాధి కల్పించనున్నాం. వివిధ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నాం.’ అని వివరించారు. 


క్రీడాపాఠశాల విద్యార్థిని విన్యాసం

* ‘రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అయిదేళ్లకు రూ.67,500 పెట్టుబడి సాయం అందజేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,89,834 మంది రైతులకు 3 విడతలుగా రూ.394 కోట్ల సాయం అందించాం. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద గతేడాది ఖరీఫ్‌లో 27,791 మంది రైతులకు రూ.5.74 కోట్లు, పంట రుణాలు రూ.4,733 కోట్లు అందించాం. దీంతో పాటు ప్రకృతి వ్యవసాయం చేపట్టేవిధంగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఉద్యాన రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడంతోపాటు ఈ ఏడాది రూ.25 కోట్లతో వివిధ పథకాలను అమలుచేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గానికొక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమను నెలకొల్పనున్నాం. పులివెందులలో రూ.100 కోట్లతో అరటి ఉత్పత్తి ఆహార శుద్ధి పరిశ్రమ, రాయచోటిలో రూ.8.60 కోట్లతో టమోటా, చిరు ధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాం’ అని వెల్లడించారు. 

* ‘పాడాను రూ.100 కోట్లతో పునరుద్ధరించడంతో పాటు రూ.500 కోట్లతో పులివెందులలో వైద్య కళాశాల నిర్మిస్తాం. పలు సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రతిపాదనలు తయారు చేశాం. కరోనా మహమ్మారి కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. కొవిడ్‌తో మృతిచెందినవారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు అనాథ పిల్లలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశాం. టీకా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం.’ అని వివరించారు. వేడుకల్లో ఎస్పీ అన్బురాజన్, సంయుక్త కలెక్టర్లు గౌతమి, సాయికాంత్‌వర్మ, ధ్యానచంద్ర, రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్, తదితరులు పాల్గొన్నారు.   


బాలికల సంప్రదాయ నృత్యం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు