logo

2,67,317 మందికి జగనన్న విద్యా కానుక

ఉమ్మడి కడప జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ఇతర ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు సుమారు 3,338 ఉన్నాయి. వీటి పరిధిలో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ ‘జగనన్న విద్యా కానుక’ను 2,67,317 మంది విద్యార్థులకు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్ర

Updated : 20 May 2022 03:24 IST

జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు


 జగనన్న విద్యా కానుక సామగ్రి

 న్యూస్‌టుడే, కడప ఉమ్మడి కడప జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ఇతర ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు సుమారు 3,338 ఉన్నాయి. వీటి పరిధిలో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ ‘జగనన్న విద్యా కానుక’ను 2,67,317 మంది విద్యార్థులకు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు నిర్ణయించారు. వీరిలో బాలురు 1,32,582, బాలికలు 1,34,735 మంది లబ్ధి పొందనున్నారు. వేసవి సెలవులు ముగిసిన అనంతరం ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించనున్నారు. ప్రైవేటు నుంచి సర్కారు సరస్వతి నిలయాల్లోకి ప్రవేశాలు అదనంగా పెరిగితే అందుకు అనుగుణంగా తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల పాదాల కొలతలు సేకరించారు. బూట్ల పరిమాణం (సైజు)లో వ్యత్యాసం రాకుండా కొలతలు తీసి పంపించాలని అధికారులు చెప్పడంతో ఉపాధ్యాయులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. రెండేళ్లుగా చూస్తే విద్యార్థుల కోసం తెప్పించి అందజేసిన బూట్ల సైజులు సరిపోలేదు. 2021-22లో ఒక్కో విద్యార్థికి మూడు జతల ఏకరూప వస్త్రాలు ఇచ్చారు. కుట్టు కూలి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నెలలకొద్దీ ఎదురుచూసినా చెల్లించలేదు. సంచుల్లో నాణ్యత లోపించింది. పాఠ్య పుస్తకాలను అందరికీ ఒకేసారి ఇవ్వలేదు. దశలవారీగా ఇవ్వడంతో పిల్లల చదువుపై ప్రభావం చూపింది. ఈసారి అన్నిరకాలు ఒకేసారి ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 2019-2020లో తొలి ఏడాదిలో 2,63,717 మందికి, 2020-21లో రెండో సంవత్సరం 2,69,143 మందికి కానుకను ఇచ్చారు. ఈ విషయమై సమగ్ర శిక్ష ఏపీసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జేవీకే సామగ్రిని పాఠశాలలు తెరవగానే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని