logo

ట్రేడింగ్‌ సంస్థ పేరిట మోసం

లులు ట్రేడింగ్‌ సంస్థ పేరిట దంపతులు ప్రజలకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశ చూపించి వారి నుంచి లక్షల రూపాయలు పెట్టుబడులుగా పెట్టించి.. చివరకు బోర్డు తిప్పేసిన సంఘటన కడప తాలూకా ఠాణా పరిధిలో ఇటీవల చోటు చేసుకుంది.  పెట్టుబడి పెట్టిన

Published : 20 May 2022 03:36 IST

ఘటనలో ఎస్‌.ఐ.తో పాటు   దంపతులపై కేసు నమోదు
బాధితుడి ఫిర్యాదుతో  వెలుగులోకి వచ్చిన వైనం


విలేకరులతో మాట్లాడుతున్న బాధితుడు ఇమ్రాన్‌బాషా

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: లులు ట్రేడింగ్‌ సంస్థ పేరిట దంపతులు ప్రజలకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశ చూపించి వారి నుంచి లక్షల రూపాయలు పెట్టుబడులుగా పెట్టించి.. చివరకు బోర్డు తిప్పేసిన సంఘటన కడప తాలూకా ఠాణా పరిధిలో ఇటీవల చోటు చేసుకుంది.  పెట్టుబడి పెట్టిన బాధితుల్లో ఒకరు ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్పీ ఆదేశాల మేరకు తాలూకా పోలీసులు లులు సంస్థ నిర్వాహకులైన దంపతులతో పాటు సంస్థలో పెట్టుబడి పెట్టిన కడప సైబర్‌ క్రైం ఎస్‌.ఐ.పై కూడా చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితుడు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. కడప నగరానికి చెందిన అల్తాఫ్‌హుస్సేన్, అతని భార్య షబీనాజహారాతో కలిసి నగరంలోని బిల్టప్‌ కూడలి సమీపంలో లులు పేరిట ఓ ట్రేడింగ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థలో రూ.పది లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.3 లక్షలు ఇస్తామని ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. దీంతో నగరంలోని సాయిపేటకు చెందిన ఇమ్రాన్‌బాషా రూ.17.80 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇతనితో పాటు పలువురు కూడా రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. సైబర్‌ క్రైం ఎస్‌.ఐ.జీవన్‌రెడ్డి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. కొన్ని రోజుల అనంతరం పెట్టిన పెట్టుబడి ఇవ్వాలని ఇమ్రాన్‌బాషా సంస్థ నిర్వాహకులను కోరారు. వారు ఇవ్వకపోవడంతో సైబర్‌ క్రైం ఎస్‌.ఐ.జీవన్‌రెడ్డి పూచీపడి తాను ఇప్పిస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా అల్తాఫ్‌ హుస్సేన్‌ ఈ ఏడాది జనవరిలో కడప నుంచి పరారయ్యాడు. బాధితుడు ఇమ్రాన్‌బాషా డబ్బుల కోసం ఎస్‌.ఐ.కి ఫోన్‌ చేయగా రెండు విడతలుగా రూ.90 వేలు అతని ఖాతాలో వేశారు. మిగిలిన డబ్బుల కోసం అడిగితే తనకు సంబంధం లేదని చెప్పడంతో బాధితుడు ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో తాలూకా పోలీసులు లులు సంస్థ నిర్వాహకులు అల్తాఫ్‌హుస్సేన్, ఆయన భార్య షబీనాజహారాతో పాటు ఎస్‌.ఐ.జీవన్‌రెడ్డిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ‘న్యూస్‌టుడే’ ఎస్‌.ఐ.జీవన్‌రెడ్డిని వివరణ కోరగా లులు సంస్థ నిర్వాహకులు మాటలు విని తాను కూడా రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టానని.. తనకు సంస్థకు ఎలాంటి సంబంధం లేదని.. అనవసరంగా తనపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని