logo

ఖరీఫ్‌ ఆయకట్టుపై కసరత్తు

ఖరీఫ్‌లో మధ్యతరహా, పెద్ద జలాశయాల పరిధిలోని కాలువల ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరివ్వాలని జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జల ప్రవాహానికి ఉన్న అడ్డంకులు గుర్తించి తొలగించాలని నిర్ణయించారు.

Published : 20 May 2022 03:36 IST

ప్రణాళిక రూపొందించిన జిల్లా ఉన్నతాధికారులు 

బ్రహ్మంసాగర్‌ జలాశయం

న్యూస్‌టుడే, కడప ఖరీఫ్‌లో మధ్యతరహా, పెద్ద జలాశయాల పరిధిలోని కాలువల ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరివ్వాలని జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జల ప్రవాహానికి ఉన్న అడ్డంకులు గుర్తించి తొలగించాలని నిర్ణయించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం, తెలుగు గంగ, అనుబంధ జలవనరుల ప్రాంతాల్లోని బీడువారిన నేలకు సేద్యపు జలాలు తరలించాలని పక్కా ప్రణాళికను రూపొందించారు. 
* జిల్లాలో 2022 ఖరీఫ్‌లో జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగుగంగ అనుబంధ పథకాల పరిధిలో భూములకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. మైలవరం, పైడిపాళెం, పీబీఆర్, లింగాల కుడి కాలువ, వామికొండ, సర్వ రాయసాగర్, బ్రహ్మంసాగర్, ఎస్‌ఆర్‌-1, ఎస్‌ఆర్‌-2 పరిధిలో 2,91,201 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం జిల్లాలో 54.975 టీఎంసీల నీరుంది. ఇప్పటికే 2.15 లక్షలకు సేద్యపు జలాలు ఇచ్చేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. పంటల సాగు కోసం 21.50 టీంఎసీలు, తాగునీటి అవసరాలకు 7.585 టీఎంసీలు అవసరం ఉంటుందని అంచనా. మరో 25.89 టీఎంసీల జలాలు మిగులు ఉంటుంది. వర్షాలు కురిస్తే నీరు చేర నుంది. ఈ నీటిని ఏం చేయాలి, అదనపు ఆయకట్టుకు ఇవ్వాలంటే క్షేత్రస్థాయిలో ప్రధాన, ఉప, పంట కాలువలను సిద్ధం చేయాల్సి ఉంటుందని గుర్తించారు. ఇందుకు నిధులివ్వాలని ఉన్నతస్థాయికి నివేదిక పంపినట్లు సీనియర్‌ అధికారి తెలిపారు.  వరి పంట సాగును ప్రోత్సహించాలనా, ఆరుతడి పైర్లు వేసుకోవాలని ప్రకటన చేయాలనా అనే అంశంపై ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నారు.
* వ్యవసాయ, ఉద్యాన పంటలకు, నేరుగా, బిందు, తుంపర పరికరాల ఎలా ఇవ్వాలని కసరత్తు చేస్తున్నారు. కడపలో బుధవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలోనూ ఇదే సమస్యపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. మైలవరం జలాశయం నిల్వ సామర్థ్యం 6.50 టీఎంసీలు. ప్రస్తుతం 0.678 టీఎంసీల నీరుంది. ఉత్తర, దక్షిణ కాలువల కింద 70,587 ఎకరాలు ఉండగా ఈసారి 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయకట్టుకు అయిదు టీఎంసీలు, తాగునీటికి 1.892 టీఎంసీలు అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నీటి కంటే మరో ఆరు టీఎంసీలకు పైగా నీరు తెప్పించాల్సి ఉంటుంది. తెలుగుగంగ ఉప జలాశయం-1 నిల్వ సామర్థ్యం 2.134 టీఎంసీలు. ప్రస్తుతం 0.55 టీఎంసీల నీరుంది. ఈదఫా 10 వేల ఎకరాలకు గంగ తీసుకెళ్లాంటే ఒక టీఎంసీ కావాలి. మరో 0.450 టీఎంసీలను తీసుకురావాల్సి ఉంటుంది. ఎస్‌ఆర్‌-2లో నీటి కొరత ఉంది. మిగతా పంట కాలువలను పూర్తి చేయాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని