logo

నీటి మట్టం పెరిగితే విడుదల చేస్తాం

శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగులకు చేరిన వెంటనే ఖరీఫ్‌లో అన్ని కాల్వలకు సాగునీటిని విడుదల చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అంజాద్‌బాషా చెప్పారు. నంద్యాల పట్టణంలోని వైఎస్సార్‌ సెంటినరీ హాల్‌లో

Updated : 20 May 2022 03:40 IST

 ఖరీఫ్‌ సాగుపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష


మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి  అంజాద్‌బాషా

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 854 అడుగులకు చేరిన వెంటనే ఖరీఫ్‌లో అన్ని కాల్వలకు సాగునీటిని విడుదల చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అంజాద్‌బాషా చెప్పారు. నంద్యాల పట్టణంలోని వైఎస్సార్‌ సెంటినరీ హాల్‌లో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధ్యక్షతన గురువారం నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నీటి లభ్యతను బట్టి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ తదితర కాల్వలకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నీటిని విడుదల చేస్తామో కచ్చితమైన తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 812 అడుగుల వరకు నీరు ఉందన్నారు. జలాశయానికి నీరు చేరగానే మరోసారి నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. జొలదరాశి, రాజోలి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. కుందూనది విస్తరణ పనులను వేగవంతం చేసి అవసరమైన ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో కాల్వల కింద 1,76,309 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జొలదరాశి, రాజోలి రిజర్వాయర్ల నిర్మాణ పనులను ముమ్మరం చేస్తామన్నారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కేసీ కాల్వ చివరి ఆయకట్టుకు సాగునీటిని అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను కోరారు. ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరే వరకు తెలంగాణ విద్యుదుత్పత్తి చేయకుండా చూడాలని కృష్ణ అడ్వయిజరీ బోర్డును కోరామన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, జిల్లా వ్యవసాయ మండలి ఛైర్మన్‌ భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ఏపీ ఇరిగేషన్‌ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గిరిజా హర్షవర్దన్‌రెడ్డి, డీఆర్వో పుల్లయ్య, జల వనరుల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసులరెడ్డి, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌ అధికారులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని