logo

ప్రకృతి సేద్యం..లాభాలు సాధ్యం

రెండెకరాలున్న రైతులు పదుల సంఖ్యలో రకరకాల మిశ్రమ పంటలు సాగు చేయగలిగితే ఇంటి అవసరాలకు కావాల్సిన మొత్తం ఏదో ఒక రూపంలో సమయానుకూలంగా అందుతుంటుంది. పెరటిలోని ఖాళీ స్థలంలో కూరగాయలు సాగు చేసి ఇంటికి కావాల్సినవి తీసి

Updated : 22 May 2022 02:46 IST

 నీతిఆయోగ్‌  ప్రచురణలో చోటు దక్కించుకున్న జిల్లా రైతులు
 ముగ్గురు అన్నదాతల కీర్తిని చాటిన జాతీయ పరివర్తన సంస్థ

ఈనాడు డిజిటల్, కడప రెండెకరాలున్న రైతులు పదుల సంఖ్యలో రకరకాల మిశ్రమ పంటలు సాగు చేయగలిగితే ఇంటి అవసరాలకు కావాల్సిన మొత్తం ఏదో ఒక రూపంలో సమయానుకూలంగా అందుతుంటుంది. పెరటిలోని ఖాళీ స్థలంలో కూరగాయలు సాగు చేసి ఇంటికి కావాల్సినవి తీసి పక్కన పెట్టుకుని మిగిలిన పంటను మార్కెట్లో అమ్ముకోవాలి. దీనినే సమగ్ర వ్యవసాయ విధానమంటారు. వేన్నీళ్లకు చన్నీళ్లలా రైతు ఆదాయం బహుముఖంగా విస్తరిస్తున్న కొద్దీ చేతిలో రూపాయి లేదనే చింత ఉండదు. ప్రకృతి వ్యవసాయమంటూ రకరకాల పంటలు సాగు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు పలువురు రైతులు. చిన్న, సన్నకారు రైతులు కేవలం ఒక పంటకు మాత్రమే పరిమితం కాకుండా సమగ్ర వ్యవసాయ విధానాన్ని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మారిన ఆర్థిక పరిస్థితులు, కొత్త సాంకేతికత, మేధోసంపద వినియోగం, పాలనలో పారదర్శకత తదితర ఆంశాల ప్రతిపాదికన నీతి ఆయోగ్‌ వైయస్‌ఆర్‌ జిల్లాలోని ముగ్గురు రైతులను గుర్తించి వీరి గురించి ప్రత్యేకంగా ప్రచురించింది.  


పొలంలో రైతు గంగిరెడ్డి 

సాగు పాఠాలు చెబుతూ..!
వినూత్న ఆలోచనే చేసే పనిలో విజయాన్ని కట్టబెడుతుందని నిరూపిస్తున్నారు పెండ్లిమర్రికి చెందిన రైతు గంగిరెడ్డి. పాలేకర్‌ విధానంలో రసాయనాలు వినియోగించకుండా విజయవంతంగా ప్రకృతి వ్యయసాయం చేస్తూ. లాభాలు పొందుతున్నారు. మార్కెటింగ్‌ కోసం సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ.. కల్తీ లేని ఉత్పత్తులను నేరుగా వినియోగదారుడికే అందిస్తున్నారు. గత 15 ఏళ్ల నుంచి అన్ని రకాల ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆరెకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. తాను ఆచరించిన పద్ధతులపై జిల్లాలోని రైతులకు అవగాహన కల్పిస్తూ మంచి దిగుబడులు వచ్చేటట్లు ఇతరులకు పాఠాలు చెబుతున్నారు.


పొలంలో నీమాస్త్రం పిచికారీ చేస్తున్న రైతు శివరామయ్య 

అంతర పంటలతో ఆదాయం 
ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడమే కాకుండా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చునని నిరూపించారు మైదుకూరు మండలం టి.కొత్తపల్లెకి చెందిన రైతు శివరామయ్య. డిగ్రీ వరకు చదువుకున్న ఈయన వ్యవసాయంలో స్థిరపడ్డారు. పదెకరాల్లో 2016 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మొత్తం 7.70 ఎకరాల్లో నిమ్మ, 2 ఎకరాల్లో వరి, కూరగాయాలు, 30 సెంట్లలో ఐదంస్తుల విధానంలో ఉద్యానపంటలు సాగు చేస్తున్నారు. అంతరపంటల సాగును చేపట్టారు. గోమూత్రం, జీవామృతం వంటివి వినియోగించి సాగు చేస్తున్నారు. పెట్టుబడులు తగ్గించడం, రసాయన రహిత పంటల సాగు చేసి మంచి ఆదాయం గడిస్తున్నారు.


సజ్జ కంకిని చూపిస్తున్న రైతు కోటేశ్వరరావు 

ఎకరాలో 22 రకాల కూరగాయలు
మొత్తం 1.10 ఎకరాల విస్తీర్ణంలో 22 రకాల కూరగాయాలను సాగు చేస్తున్నారు కలసపాడు మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన రైతు బి.కోటేశ్వరరావు. అంతర పంటలను ఆదర్శంగా సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. దేశీయ వంగడాలకు పెద్దపీట వేస్తూ ఆయన ఉత్పత్తి చేసే సేంద్రియ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులు కొనుగోలు చేస్తుండడం గమనార్హం. సేంద్రియ సేద్య విధానాలకు ప్రాచుర్యం లభించడంతో సాగు ఖర్చులు తగ్గుతున్నాయి. నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది. నేల ఆరోగ్యంగా ఉంటుంది. పర్యావరణంపై దుష్ప్రభావాలు ఉండవంటున్నారు రైతు కోటేశ్వరరావు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని