logo

పథకం అందక.. యంత్రం కదలక !

జిల్లావ్యాప్తంగా చాలామంది రైతులకు ‘వైయస్‌ఆర్‌ యంత్ర సేవ’ పథకం కింద ట్రాక్టర్లు అందలేదు. తొలుత మార్గదర్శకాల జారీలో జాప్యం జరగడంతో పథకం అమలుపై ప్రభావం చూపింది. నిర్దేశిత గడువు ముగిసినా లక్ష్యం చేరుకోలేదు. అన్నదాతల దరికి అద్దె యంత్ర పరికరాలు చేరడం లేదు.

Published : 24 May 2022 06:20 IST

 రైతుల దరి చేరని వ్యవసాయ సాగు పరికరాలు 
 ట్రాక్టర్ల కోసం ముందుకొచ్చిన 257 సీహెచ్‌సీలు
 జిల్లాలో ‘వైయస్‌ఆర్‌ యంత్ర సేవ’ పథకం తీరు 


ట్రాక్టరుతో వ్యవసాయ పనులు 

జిల్లావ్యాప్తంగా చాలామంది రైతులకు ‘వైయస్‌ఆర్‌ యంత్ర సేవ’ పథకం కింద ట్రాక్టర్లు అందలేదు. తొలుత మార్గదర్శకాల జారీలో జాప్యం జరగడంతో పథకం అమలుపై ప్రభావం చూపింది. నిర్దేశిత గడువు ముగిసినా లక్ష్యం చేరుకోలేదు. అన్నదాతల దరికి అద్దె యంత్ర పరికరాలు చేరడం లేదు. గ్రామీణ గడపలో వినియోగదారుల అద్దె కేంద్రాలు (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు) అందుబాటులో లేవు. చాలాచోట్ల నిర్వహణ కేంద్రాల జాడ లేకుండాపోయింది. పథకం కింద లబ్ధి పొందినవారు వారి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితం ఉన్నవారికే యంత్రాలను పంపిస్తుండడం గమనార్హం. 

న్యూస్‌టుడే, కడప జిల్లాలో గ్రామీణ గడపలో రైతు భరోసా కేంద్రాలు (వ్యవసాయ ఉత్పత్తి నిల్వ భవనాలు) 414, పట్టణాల్లో మరో 18 ఉన్నాయి. ప్రతి ఆర్‌బీకే పరిధిలో ఒక వినియోగదారుల అద్దె కేంద్రం (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌) ఏర్పాటు చేయాలని గతేడాది ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. ప్రతి ఆర్‌బీకేలో అయిదుగురు ఔత్సాహిక రైతులను ఎంపిక చేయాలని ఆదేశించారు. వీరిని ఒక బృందంగా బృందంగా ఏర్పాటు చేయించారు. జిల్లాలో 425 సీహెచ్‌సీలను అందుబాటులోకి తీసుకోవాలని నిర్ణయించారు. వినియోగదారుల అద్దె కేంద్రాల నిర్వహణలో భాగంగా ట్రాక్టర్ల పంపిణీ నిదానంగా సాగుతోంది. వచ్చే నెలలో నిర్వహించే మెగా మేళా రోజున తీసుకోవాలని 257 సీహెచ్‌సీల సభ్యులు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. అందులో 200 బృందాల్లోని అన్నదాతలు 50 శాతం డబ్బులు చెల్లించారు. ఇతర యంత్ర, పరికరాలు కొనుగోలు చేసేందుకు మొత్తం 393 సీహెచ్‌సీల సభ్యులు సుముఖత చూపారు. ఇప్పటికే తీసుకున్న యంత్రాలకు ప్రభుత్వం నుంచి రాయితీ కింద రూ.1.60 కోట్లు లబ్ధిదారులుగా ఎంపికైన అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు. ఒక యూనిట్‌ విలువ రూ.15 లక్షలు. ఇందులో ప్రభుత్వం ఇచ్చే రాయితీ 40 శాతం (రూ.6 లక్షలు), బ్యాంకు రుణం 50 శాతం (రూ.7.50 లక్షలు), లబ్ధి పొందే రైతుల వాటా 10 శాతం (రూ.1.50 లక్షలు). అందరికీ ఒకేసారి ఇవ్వడానికి ఆర్థికంగా ఇబ్బందులొస్తాయని ఉన్నతస్థాయిలో గుర్తించారు. తొలి విడతలో గతేడాది జులై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజున కొన్ని బృందాలకు ఇవ్వాలని నిర్ణయించారు. రెండో దశలో సెప్టెంబరు, మూడో దఫా డిసెంబరులో ఇచ్చేందుకు వ్యవసాయశాఖాధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. మార్గదర్శకాల జారీలో జాప్యం జరగడంతోపాటు విధివిధానాలపై ఉన్నతస్థాయి నుంచి స్పష్టత రాలేదు. దీంతో అమలులో అడ్డంకులు ఎదురయ్యాయి. మునుపటి బకాయిలు చెల్లిస్తేనే ట్రాక్టర్లు ఇస్తామని సరఫరా, పంపిణీ సంస్థల ప్రతినిధులు మెలిక పెట్టడంతో 2021-22 ఖరీఫ్, రబీ ముగిసిపోయినా ర్దేశిత లక్ష్యంలో పూర్తిస్థాయిలో 50 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. 

ఇవీ కారణాలు
అధికార పార్టీకి చెందిన కీలక నాయకులు సిఫార్సు చేసిన వారికే ప్రాధాన్యమివ్వాలని గతేడాది నిర్ణయించడంతో గ్రామాల్లో పోటీ నెలకొనడడం నాయకులకు తలనొప్పిగా మారింది. ట్రాక్టర్లు ఇచ్చేదిలేదని సరఫరా సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. గతంలో రాయితీయేతర సొమ్ములు చెల్లించకుండా నిలిపివేశారని, ఆ డబ్బులు చెల్లిస్తే సీహెచ్‌సీ బృందాలకు ట్రాక్టర్లు ఇస్తామని తెగేసి చెప్పారు. ట్రాక్టరు లేకుండా దుక్కుల మడకలు, విత్తన గొర్రు, రోటావేటారు, పవర్‌ ట్రిల్లరు, బహుళ నూర్పిడి యంత్రాలు, పంటలకు ఆశించే తెగుళ్లు, పురుగుల నివారణకు మందుల పిచికారీ చేసే స్ప్రేయర్లు, లోతు దుక్కి కోసం రెండు మడకలు, కలుపుతీత పరికరాలతోపాటు మరికొన్ని అందుబాటులో పెడతామని చెప్పారు. వీటి కొనుగోలు రైతు ఇష్టానికే వదిలేశారు. అన్నదాతలు నచ్చిన రకాన్ని తీసుకునేలా అనుమతిచ్చారు. ట్రాక్టరు తర్వాత ఇస్తామని 10 నెలల కిందట అధికారులు చెప్పడంతో కర్షకుల్లో నైరాశ్యం నెలకొంది. పైగా యూనిట్‌ విలువ మొత్తం చెల్లిస్తే తర్వాత రాయితీ సీహెచ్‌సీ ఉమ్మడి ఖాతాలో జమ చేస్తామని చెప్పడంతో చాలామంది వెనుకడుగు వేయడంతో పోటీ తగ్గింది. 

రైతులు అడిగిన రకాలు ఇస్తున్నాం
జిల్లాలో రైతు భరోసా కేంద్రాల పరిధిలో వినియోగదారుల అద్దె కేంద్రాల ఏర్పాటు చేయించాం. ఇప్పటికే చాలామంది అన్నదాతలు యంత్ర, పరికరాలు కావాలని డబ్బులు చెల్లించారు. రైతులకు ఏ రకం అవససమని సమాచారం సేకరించాం. కర్షకులు అడిగిన రకాలు ఇస్తున్నాం. జిల్లాలో 210 ట్రాక్టర్లు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్ణయించగా, అంత కంటే ఎక్కువమంది కర్షకులు ముందుకొచ్చారు. త్వరలో అందరికీ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో సీహెచ్‌సీల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు మేలు జరిగేవిధంగా చూస్తాం. - ఎ.నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి 

మండలానికి ఆరు ట్రాక్టర్లు...
ప్రతి ఆర్‌బీకే పరిధిలో సీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని వ్యవసాయాధికారులు తాజాగా ప్రణాళికను రూపొందించారు. మొదట సరఫరా సంస్థలు ట్రాక్టర్లు ఇవ్వడానికి ససేమిరా అన్నాయి. బృంద సభ్యులు కూడా యూనిట్‌ విలువను పూర్తి స్థాయిలో చెల్లించడానికి వెనకడుగు వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ ముగిసినా లక్ష్యాన్ని చేరుకోలేక చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో మండలానికి ఆరు సీహెచ్‌సీలను ఎంపిక చేసి ట్రాక్టర్లు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిని పంపిణీ చేసేందుకు వచ్చే నెలలో మెగా మేళా నిర్వహించాలని కసరత్తు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఎక్కువ మంది ఆసక్తి చూపగా,  మరికొన్ని చోట్ల తక్కువ సంఖ్యలో ముందుకొచ్చారు. దీంతో అన్ని ఆర్‌బీకేలకు ట్రాక్టర్లు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. 
అద్దె కేంద్రం నిర్వహణ ఎక్కడ...?
సన్న, చిన్నకారు రైతులకు ఆర్థికంగా ఉపశమనం కల్పించడానికి క్షేత్రస్థాయిలో వినినియోగదారుల అద్దె కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతులు ఉమ్మడిగా ముందుకొచ్చి సీహెచ్‌సీ కేంద్రాన్ని సమర్థంగా నిర్వహిస్తే అదనపు ఆదాయం పొందవచ్చునని ప్రభుత్వ ఉద్దేశం. కాకపోతే చాలాచోట్ల సక్రమంగా అమలు కావడం లేదు. లబ్ధిదారులుగా ఎంపికైన వారితోపాటు బంధువులు, మిత్రులే ప్రయోజనం పొందుతున్నారు. అద్దె కేంద్రం ఏర్పాటు చేసి యంత్ర పరికరాలను అవసరమైన వారికి అందుబాటులో పెట్టాలనే మాటను మరిచారు. పర్యవేక్షణ లేమితో ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని