logo

గ్రామీణ రహదారులకు మోక్షం

అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో రహదారులు చిన్నాభిన్నమయ్యాయి. పెద్దపెద్ద గోతులతో రాకపోకలు సాగించలేని దుస్థితికి చేరాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేవారికి నరకం చూపిస్తున్నాయి. గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులనే తేడా లేకుండా ఘోరంగా

Published : 24 May 2022 06:20 IST


 ఏటూరు-రామిరెడ్డిపల్లె రహదారి దుస్థితి 

ఈనాడు, డిజిటల్‌ కడప అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో రహదారులు చిన్నాభిన్నమయ్యాయి. పెద్దపెద్ద గోతులతో రాకపోకలు సాగించలేని దుస్థితికి చేరాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేవారికి నరకం చూపిస్తున్నాయి. గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులనే తేడా లేకుండా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇటు రహదారులు, భవనాలశాఖ అటు పంచాయతీరాజ్‌శాఖలో గత రెండేళ్లుగా మరమ్మతులు చేపట్టలేదు. ఏటా చేపట్టే నిర్వహణ పనులను గాలికొదిలేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులకు మోక్షం కలిగించే కబురు కేంద్రం నుంచి అందింది. వడ్డీలేని రుణం ఇవ్వడానికి పచ్చజెండా ఊపింది. ఇదే తరుణంలో గుత్తేదారులకు బిల్లుల బకాయిల చెల్లింపులు మెరుగుపడుతున్నాయి. 
కేంద్రం ఆర్థిక సాయం...
కేంద్రం నుంచి రూ.1,072 కోట్ల ఆర్థిక సాయం వడ్డీలేని రుణం కింద త్వరలో పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీరింగ్‌ విభాగానికి అందనుంది. ఈ నిధులతో సుమారు 4,600 కిలోమీటర్ల పొడవున్న 1,646 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. పాఠశాలలు, వైద్యశాలల అభివృద్ధి తరహాలో చేపట్టిన నాడు- నేడు కింద రహదారుల పనులు జరగనున్నాయి. ప్రస్తుత రహదారుల స్థితి... బాగు చేసిన అనంతరం చిత్రాలను తీసి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ప్రస్తుత రహదారుల స్థితిని ఫొటోలు తీయించడం ప్రారంభించారు. రహదారుల అభివృద్ధికి కేటయించిన నిధుల మళ్లింపునకు అవకాశం లేకుండా ఎస్‌ఎన్‌ఏ ఖాతా కిందకు తీసుకొస్తున్నారు. పనులు చేపట్టబోయే గుత్తేదారులకు సీఎంఎంఎస్‌ పేరుతో కాకుండా ఆస్క్రో ఖాతా ద్వారా చెల్లింపునకు సన్నాహాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపు దాదాపు పూర్తికావొచ్చింది.న్యాయస్థానం ఆదేశాల మేరకు చెల్లింపులు చేపట్టారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన గుత్తేదారులకు ముందుగా చెల్లించారు. మొత్తంగా 2,800 బిల్లులకుగానూ 2,200 వరకు చెల్లించారు. మిగిలినవి వారం... పదిరోజుల్లో చెల్లింపునకు సన్నాహాలు చేస్తున్నారు. రహదారులు, భవనాలశాఖలోనూ చాలా వరకు పెండిండ్‌ బిల్లుల చెల్లించారు. 

ఆరు నెలల్లో పూర్తి చేస్తాం... 
కేంద్రం ఇస్తున్న ఆర్థిక సాయంతో ఆరు నెలల్లోగా రహదారులను బాగుచేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నాం. దాదాపు అన్ని రహదారులు లభివృద్ధి చెందనున్నాయి. గుత్తేదారులకు చాలా వరకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాం. మిగిలినవి త్వరలో చెల్లిస్తాం. నిధులూ కొంత వరకు మిగుల్లోకి రానున్నాయి. - శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌శాఖ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని