logo

రైతుల గోడు పట్టడంలేదు!

వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురం పట్టణానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి ఆరబోసిన వరిధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిపోయింది. కారుమబ్బులు కమ్ముకోవడంతో తన వద్దనున్న చాలీచాలని రంధ్రాలున్న పట్ట (టార్పాలిన్‌)ను కప్పడంతో ఆ రైతు కష్టమంతా వర్షార్పణమైంది.

Published : 26 May 2022 06:34 IST

 మూడేళ్లుగా నిలిచిన రాయితీ టార్పాలిన్ల సరఫరా
 కల్లంలో పంటలు కాపాడుకోవడానికి అష్టకష్టాలు 


శనగలపై కప్పిన చాలీ చాలని ప్లాస్టిక్‌ పట్ట

ఈనాడు డిజిటల్, కడప, న్యూస్‌టుడే, కమలాపురం వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురం పట్టణానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి ఆరబోసిన వరిధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిపోయింది. కారుమబ్బులు కమ్ముకోవడంతో తన వద్దనున్న చాలీచాలని రంధ్రాలున్న పట్ట (టార్పాలిన్‌)ను కప్పడంతో ఆ రైతు కష్టమంతా వర్షార్పణమైంది. తడిసిన పంటను తక్కువ ధరకు వదిలించుకోక తప్పలేదు. ఈయన ఒకరే కాదు ఉమ్మడి కడప జిల్లాలో రైతులందరిదీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం, రానున్నది వర్షాకాలం కావడంతో పట్టలు అందుబాటులో లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయశాఖ వివిధ పథకాలకు మంగళం పాడేసింది. రైతులకు ఉపయుక్తమైనవి అమలు చేయకుండా నిలిపివేసింది. ఇందులో అత్యంత ప్రయోజనకరమైన పట్టలు మూడేళ్ల కింద వరకు 50 శాతం రాయితీపై రైతులకు అందజేసింది. ఒక్కొక్క రైతుకు రెండేసి పట్టలు ఇవ్వడంతో మూడేళ్లపాటు వాటిని వినియోగించుకునేవారు. చివరిగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో రైతులు అబ్ధి పొందారు. అనంతరం ప్రభుత్వం రాయితీ పట్టలకు తిలోదకాలిచ్చింది. 
* ఉమ్మడి కడప జిల్లాలో ఏటా 25 వేల పట్టలు రాయితీపై సరఫరా చేసేవారు. ప్రస్తుతం వైయస్‌ఆర్‌ జిల్లాలో 14 వేలు, అన్నమయ్య జిల్లాకు 11 వేలు వరకు సరఫరా చేయాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. ప్రస్తుతం రైతులు మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇవి నాణ్యత, మన్నిక అంతగా ఉండకపోవడంతో త్వరగా చిరిగిపోతున్నాయి. పేద రైతులు సిమెంటు, రసాయన, దాణా బస్తాలతో తయారు చేసిన సాధారణ పట్టలు వినియోగిస్తున్నారు. వర్షానికి నీరు దిగి పంట తడిసిపోతోంది. ఆరబెట్టిన పంటను పోగు చేసిన రాశులపై కప్పేందుకు పట్టలు అందుబాటులో లేక కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో ఇటీవల మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు పలుచోట్ల ధాన్యం, రాగి, నువ్వు తదితర పంట తడిసిపోయాయి. 
* ఏటా అక్టోబరు, నవంబరులలో ఖరీఫ్‌ పంట చేతికొస్తుంది. పంట కోసి కల్లాల్లో ఆరబెట్టి మార్కెట్లో విక్రయిస్తుంటారు. రబీ పంట మార్చి, ఏప్రిల్, మేలలో కోతకొస్తుంది. దాదాపు ఆరేడు నెలల పాటు నూర్పిడి చేసిన పంటలు జాగ్రత్తగా నిల్వ ఉంచుకోవాలి. ఆ సమయంలో తుపాన్లు, అకాల వర్షం వస్తే కాపాడుకోవడానికి పట్టలు అత్యవసరం. నూర్పిడి సమయంలో నేలపై పట్టలేసి పంటను నాణ్యతగా సేకరించుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది. సన్న, చిన్న కారు రైతులు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా స్వతహాగా మార్కెట్లో రూ.ఆరేడు వేలు ఖర్చు చేయడం కష్టమవుతోంది. కొందరు రైతులు బాడుగకు తెచ్చు కుంటున్నారు. ఈ భారం మోయలేక రాయితీపై ఇచ్చే వాటి కోసం మూడేళ్లుగా రైతులు ఎదురుచూస్తున్నారు. 

ఎంతో ప్రయోజనం...
ఖరీఫ్, రబీలో వరి, రాగి పంటలు పండిస్తున్నాను. యంత్రంతో కోత కోసిన పచ్చి ధాన్యం వారం రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆ సమయంలో వర్షమొస్తే పంట తడిసి నష్టపోతున్నాం. ప్రతి ఏటా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రాయితీపై పట్టలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. బయట కొనుగోలు చేసేవి అంత నాణ్యతగా ఉండడంలేదు. -సుబ్బరాయుడు, రైతు, కమలాపురం
వానొచ్చిందంటే భయమే...
ఏటా నాలుగైదు ఎకరాల్లో వరి, ఆరెకరాల్లో మినుము పంటలు సాగు చేస్తున్నాను. వానొచ్చిందంటే భయపడతున్నాం. పంటను కాపాడుకునేందుకు ప్రభుత్వం రాయితీపై పట్టలు సరఫరా చేయాలి. మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేకపోతున్నాం.     -విజయభాస్కర్‌రెడ్డి, కంచన్నగారిపల్లె, కమలాపురం మండలం
ఉద్యానశాఖ అమలు చేస్తోంది...
వ్యవసాయశాఖ రాయితీపై టార్పాలిన్లను రైతులు అందించడలేదు. ఉద్యానశాఖ మాత్రమే అమలు చేస్తోంది. అవసరమైన రైతులు ఉద్యానశాఖ ద్వారా పొందవచ్చు. 
-నాగేశ్వరరావు, డీఏవో, వైఎస్‌ఆర్‌ జిల్లా 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని