logo

మాజీ ఎమ్మెల్యేపై రాచమల్లు వ్యాఖ్యలు

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ప్రొద్దుటూరు మండలం కామనూరులో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే... మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి

Published : 26 May 2022 06:34 IST

ఉద్రిక్తత... పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం


ఎమ్మెల్యే రాచమల్లును ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మద్దతుదారులు

ఈనాడు డిజిటల్, కడప: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ప్రొద్దుటూరు మండలం కామనూరులో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే... మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘కామనూరులో పలుమార్లు రిగ్గింగ్‌ జరిగింది. ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అనేకసార్లు చంపేశారు.’ అని అన్నారు. ఈ గ్రామానికి చెందిన వరదరాజులురెడ్డి ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం లేక ఇక్కడ స్వేచ్ఛాయుతమైన ఓటింగ్‌ లేకుండా రిగ్గింగ్‌కు పాల్పడటంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నట్లు మండిపడ్డారు. ఈ సమయంలో అక్కడే ఉన్న వరదరాజులురెడ్డి వర్గీయులు... ఎక్కడ?... ఎప్పుడు? రిగ్గింగ్‌ జరిగిందని ఎమ్మెల్యేను ప్రశ్నించడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది. వరదరాజులురెడ్డి వర్గీయులపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కామనూరులో ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలంటూ విజ్ఞప్తి చేయడంతో పాటు రాజకీయ గురువు వరదరాజులురెడ్డికి హెచ్చరిక చేస్తున్నానని ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తెదేపా తరపున మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి పోటీ చేసినా కామనూరులో మాత్రం రిగ్గింగ్‌కు అవకాశం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామన్నారు. ఇన్నాళ్లగా ఇక్కడ అభివృద్ధి జరగలేదని, సీఎం జగన్‌ పుణ్యమా అని మెరుగైన వైద్యం, ఆరోగ్య సేవల కోసం కొత్తగా పీహెచ్‌సీ భవనం ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం ముగిసిన తర్వాత వరదరాజులురెడ్డి మద్దతుదారులు ఏసు, గౌస్‌ లాజం మాట్లాడుతూ ఎమ్మెల్యేను పలు అంశాలపై ప్రశ్నించారు. శాంతిభద్రతలు దృష్ట్యా డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్పంచి షేక్‌ షమీమ్, పురపాలక ఛైర్‌పర్సన్‌ లక్ష్మీదేవి, ర.భ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, ఈఈ నరసింహారెడ్డి, డీఎంహెచ్‌వో నాగరాజు, డిప్యూటీ డీఎంహెచ్‌వో శాంతకళ, వైద్యుడు హనీఫ్‌బాబా, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు : ఎమ్మెల్యే 
ప్రొద్దుటూరు పట్టణం : గోపవరం గ్రామ పంచాయతీలో ఇంటి నిర్మాణాలకు సంబంధించి అప్రూవల్‌ కోసం ఎవరైనా మామూళ్లు వసూలు చేస్తుంటే స్వయంగా తనకు ఫిర్యాదు చేయవచ్చునని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎం నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందిస్తూ శుక్రవారం ఉదయం 11 గంటలకు గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉంటానన్నారు. మామూళ్ల వసూళ్లపై బాధితులు ఎవరైనా ఉంటే తనకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని