logo

‘అత్యుత్తమ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దుతా’

కడప నగరపాలక సంస్థ కమిషనర్‌గా సూర్యసాయిప్రవీణ్‌చంద్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలు, స్థితిగతులను పత్రికల ద్వారా తెలుసుకున్నానన్నారు. కడప నగరపాలక

Published : 27 May 2022 06:07 IST

బాధ్యతలు స్వీకరిస్తున్న కమిషనర్‌ సూర్యసాయిప్రవీణ్‌చంద్‌

కడప నగరపాలక, న్యూస్‌టుడే : కడప నగరపాలక సంస్థ కమిషనర్‌గా సూర్యసాయిప్రవీణ్‌చంద్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలు, స్థితిగతులను పత్రికల ద్వారా తెలుసుకున్నానన్నారు. కడప నగరపాలక సంస్థను రాష్ట్రంలోని అత్యుత్తమ నగరపాలక సంస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని చెప్పారు. నగరాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా సలహాలు స్వీకరిస్తామన్నారు. అనంతరం నగరపాలక సంస్థలోని కీలక విభాగాలకు చెందిన అధికారులతో విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్‌ విభాగంతో జరిగిన సమీక్షలో టెండర్ల దశలో ఉన్న పనులు మొదలుకుని పూర్తయ్యే దశలో ఉన్న పనుల వరకు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ● 14, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అధికారులను ప్రశ్నించారు. రాజీవ్‌మార్గ్‌ అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడానికి కారణాలపై సంబంధిత అధికారులను నిలదీశారు. ట్యాంక్‌బండ్‌ అభివృద్ధి పనులకు పిలిచిన టెండర్ల పురోగతిపై వివరాలు అడిగారు.● పారిశుద్ధ్య విభాగంపై చర్చిస్తూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లాప్‌ పథకంలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీల సంఖ్యపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని చిన్న, మధ్యతరహా, పెద్ద కాలువల పరిమాణాన్ని తెలపాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కాలువలను తనిఖీ చేస్తానన్నారు. ప్రణాళిక విభాగంపై జరిగిన చర్చలో రహదారుల విస్తరణను ప్రస్తావించారు. సీఎం నిధులు మంజూరు చేసిన మూడు రహదారుల విస్తరణ పనుల్లో జాప్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్‌ను కలిసిన కమిషనర్‌ : జిల్లా సచివాలయం : కడప నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ కలెక్టర్‌ విజయరామరాజును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కలెక్టర్‌, జేసీ సూచనలు, మేయర్‌ సహకారంతో కడప నగరాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని