Andhra News: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ!

 ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌పై 

Updated : 23 May 2022 14:01 IST

కాకినాడ: ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో ఎమ్మెల్సీని ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో ఆయన్ను ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అనంతబాబును అరెస్ట్‌ చేస్తామని శనివారం రాత్రే జిల్లా ఎస్పీ ప్రకటించినప్పటికీ దానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని పోలీసులు ఇవ్వలేదు. పోస్టుమార్టం ఆలస్యం కావడం వల్లే కేసులో తాము ముందుకు వెళ్లలేకపోయామని పోలీసులు చెబుతూ వస్తున్నారు. 

ఈ కేసుపై ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు సోమవారం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. దళిత, ప్రజాసంఘాలతో పాటు విపక్ష పార్టీలు అనంతబాబును అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ విషయంలోఎలా ముందుకెళ్లాలనే అంశంపై డీఐజీ చర్చించినట్లు తెలుస్తోంది. అనంతబాబు గత మూడురోజులుగా రాజమహేంద్రవరం, కాకినాడ పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం. శుక్రవారం నుంచి తన ఇద్దరు గన్‌మెన్లను వదిలి వెళ్లినట్లు పోలీసువర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఎమ్మెల్సీ కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయి.

కాకినాడలో నిరసనలు

మరోవైపు సుబ్రహ్మణ్యం మృతిపై కాకినాడలో ఎస్సీ, ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దళిత, వామపక్ష, ప్రజాసంఘాల వేదిక ఆధ్వర్యంలో నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మె్ల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్‌ చేయాలని.. ఆయన పదవిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని